వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తాను పట్టిన పట్టు వీడారు. అధ్యక్ష ఎన్నికల్లో తనపై నెగ్గిన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు అధికారాన్ని బదలాయించడానికి అంగీకరించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికార మార్పిడి ప్రక్రియ మొదలు పెట్టాలని ఆయన వైట్ హౌస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. అధికార బదలాయింపులో అత్యంత కీలకంగా వ్యవహరించే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్‌ఏ) చీఫ్ ఎమిలీ ముర్ఫీకి బైడెన్ బృందంతో కలిసి పని చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు ట్రంప్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన ముర్ఫీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశం పట్ల ఆమెకున్న అంకిత భావం, విశ్వాసానికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అధికార మార్పిడికి అంగీకరించినప్పటికీ ఎన్నికల ఫలితాల అంశంలో తన పోరాటం కొనసాగుతుందన్నారు. ట్రంప్ అధికార మార్పిడికి అంగీకరించడాన్ని బైడెన్ బృందం స్వాగతించింది. అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికైనట్టు జీఎస్‌ఏ గుర్తించి, ప్రభుత్వ వనరుల్ని వినియోగించుకోవడానికి అనుమతినివ్వడం అధికార మార్పిడికి ముందడుగు అని బైడెన్ బృందం పేర్కొంది.
విమర్శలు ఆపేద్దాం : బైడెన్
దేశంలో ఎన్నికలు ముగిశాయని.. విభేదాలను, ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకోవడాన్ని ఆపేయాల్సిన సమయం వచ్చిందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ అన్నారు. అధికార బదిలీ ప్రక్రియను ట్రంప్ ప్రారంభించిన నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అందరూ ఏకం కావాల్సిన సమయం ఇదేనని అన్నారు. విభజించేందుకుగాక, ఏకం చేసేందుకు ప్రతిజ్ఞ చేసిన అధ్యక్షుడిగా తనను తాను వర్ణించుకున్నారు. తాను రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్ అని చూడనని చెప్పారు. అందరి విశ్వాసాన్ని పొందుతూ పని చేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment