వలస కార్మిక మహిళ రూపంలో చేతిలో బిడ్డతో దుర్గామాత విగ్రహం. ఆమె కూతుళ్లుగా సరస్వతిదేవి (ఎడమ), లక్ష్మీదేవిల విగ్రహాలు
కష్టం అంటే ఏంటో.. లాక్‌డౌన్‌లో చూశాం. ఎంతమంది తల్లులు.. కార్మిక వలస మాతలు! కష్టమొస్తే ఏంటి?! అనే.. ధైర్యాన్నీ లాక్‌డౌన్‌లోనే చూశాం. ప్రతి మహిళా ఒక శక్తి. శక్తిమాత! ఆ శక్తిమాత స్వరూపమే వలస దుర్గమ్మ.
కాయ కష్టం చేయందే పూట గడవని వలస కార్మికులు ఉపాధిని కోల్పోతే బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో కరోనా చూపించింది. çసమానమైన కష్టానికి సమానమైన ప్రతిఫలం రాకున్నా, కుటుంబ పోషణ కోసం మగవాళ్లతో సమానంగా గడపదాటి, ఊరు దాటి, రాష్ట్రమే దాటి వెళ్లిన మహిళలు లాక్‌డౌన్‌లో కూలి దొరికే దారి లేక కట్టుబట్టలతో, కాళ్లకు చెప్పులు లేకుండా, బిడ్డల్ని చంకలో వేసుకుని, వెంట బెట్టుకుని సొంత ఊళ్లకు మైళ్లకు మైళ్లు నడిచారు. కన్నీళ్లు వాళ్లకు రాలేదు. చూసిన వాళ్లకు వచ్చాయి! ఏ శక్తి ఆ తల్లుల్ని నడిపించిందో కానీ, ఆ శక్తి రూపంలో వలస మహిళా కార్మికులు ఈ ఏడాది శరన్నవరాత్రులకు దేశంలో చాలా చోట్ల ‘వలస మాత’ దుర్గమ్మలుగా దర్శనం ఇవ్వబోతున్నారు! కోల్‌కతాలో ఇప్పటికే అనేకచోట్ల వలస దుర్గమ్మల మండపాలు వెలశాయి.
దుర్గమ్మ ఆదిశక్తికి ప్రతిరూపం. మహిళాశక్తి ఆ దుర్గమ్మకు ప్రతీక. దుర్గమ్మ తొమ్మిది శక్తి అవతారాలను యేటా చూస్తూనే ఉంటాం. ఆ తొమ్మిది శక్తులు కలిసిన మహాశక్తి ‘వలస కార్మిక తల్లి’! బాలాత్రిపుర సుందరి, గాయత్రీ దేవి, శ్రీమహాలక్ష్మి, అన్నపూర్ణమ్మ, లలితాదేవి, మహాసరస్వతి, శ్రీదుర్గ, మహిషాసుర మర్దినీ దేవి, శ్రీరాజరాజేశ్వరి.. వీళ్లందరి అంశతో కోల్‌కతాలోని బరిషా దుర్గా పూజా కమిటి ఈ ఏడాది కార్మికశక్తి మాతను మండపాలన్నిటా విగ్రహాలను నెలకొల్పుతోంది! మొదట నైరుతి కోల్‌కతాలోని బెహాలాలో కమిటీ తన మండపంలో వలసమాతను ప్రతిష్ఠించింది. మండే ఎండల్లో, కాలే కడుపుతో, ఆకలిదప్పికలను ఓర్చుకుంటూ పిల్లల్ని నడిపించుకుంటూ వెళుతున్న ఆ వలస కార్మిక మహిళను దుర్గాశక్తిగా రింతూ దాస్ అనే కళాకారుడు మలిచాడు. ఆ తల్లి పక్కన నడుస్తున్న కూతుళ్లు లక్ష్మీ, సరస్వతి. లక్ష్మీదేవి చేతిలో ఆమె వాహనమైన గుడ్లగూబ ఉంటుంది. సరస్వతీ దేవి చేతిలో ఆమె వాహనం హంస ఉంటుంది. చూడండి, ఎంత గొప్ప అంతరార్థమో! తమను మోసే వాహనాలను తామే మోసుకెళుతున్నారు! స్త్రీని శక్తిమాతగానే కాదు, కారుణ్యమూర్తి గానూ చూపడం అది.
Comments
Please login to add a commentAdd a comment