వయసు పెరిగాకే డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులు వస్తాయనే నమ్మకాన్ని సడలిస్తూ చిన్నారుల్లోనూ డయాబెటిస్ ఇప్పటికే విస్త్రుతంగా వ్యాపిస్తోంది. అదే విధంగా ఇప్పుడు రక్తపోటు (బీపీ) కూడా వయసులకు అతీతంగా విజృంభిస్తోందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు.. అధిక శాతం మంది చిన్నారులు బీఎంఐ లాంటి జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారని, 13% మంది చిన్నారులు శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తేల్చింది.
టీనేజ్‌పై.. రక్తపోటు..
దేశవ్యాప్తంగా 64,165 మంది తల్లిదండ్రులను హీల్ఫా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ సంప్రదించడంతో పాటుగా వారి 318 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులకు సవివరంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహించి ఓ సమగ్ర అధ్యయనాన్ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక మహారాష్ట్రలలో 18 నెలల పాటు ఈ అధ్యయనం జరిగింది. హీల్ఫా హెల్త్ రిపోర్డ్ కార్డ్ ప్రకారం, ప్రస్తుతం, పిల్లల్లో అత్యధిక రక్తపోటు అనేది పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా మారుతోంది. పరీక్షలలో పాల్గొన్న వారిలో... 17% మంది విద్యార్థులు రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరిలో 8% బాలికలు, 9% బాలురు పెరిగిన రక్తపోటుతో బాధపడుతున్నారు.
బీపీ సమస్యలు పిల్లల్లో పెరగడం అనేది అత్యంత ఆందోళన కరమైన అంశమే అయినప్పటికీ, మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ఎక్కువ శాతం మంది పిల్లలు అధిక/స్వల్ప బీఎంఐ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటం. పరీక్షించిన బాలురులో దాదాపు 71% మంది బీఎంఐ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, 60% మంది బాలికలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
కారణాలెన్నో..
పెరుగుతున్న కాలుష్యం, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయకపోవడం, తరచుగా పొగ బారిన పడుతుండటంతో చిన్నారుల శ్వాస సంబంధిత వ్యవస్ధలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. టీనేజర్లలో ఈ సమస్యను గుర్తించకపోవడం వల్ల పరిస్థితులు దిగజారే ప్రమాదాలూ ఉన్నాయి ‘‘మా పరీక్షల ఫలితాల ప్రకారం, కేవలం 0.0018% మన చిన్నారులు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.ఓ దేశంగా 26.5 కోట్ల జనాభాలో కేవలం 4885 మంది మాత్రమే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉన్నారు. ఇది ప్రమాదఘంటికలను మోగిస్తుంది.
ప్రభుత్వంతో పాటుగా తల్లిదండ్రులు, ఈ దిశగా ఆలోచన చేయడంతో పాటుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది’’ అని హీల్ఫా ఫౌండర్, సీఎస్‌ఓ రాజ్ జనపరెడ్డి అన్నారు. ‘భావి భారత చిన్నారుల ఆరోగ్య స్ధితి పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల, ప్రిన్సిపాల్స్ ప్రభుత్వాలకు సైతం రియాల్టీ చెక్‌గా హీల్ఫా హెల్త్ రిపోర్ట్ కార్డ్ నిలుస్తుంది. 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో 41% మంది ప్రజలు 18 సంవత్సరాల లోపు వారు. మనం అత్యధికంగా పనిచేసే జనాభా దిశగా వెళ్తున్నాం కానీ ,అలాగే అనారోగ్యవంతమైన సమాజం దిశగా వెళ్తున్నాం’’ అని అన్నారాయన.
జాగ్రత్తలతో చెక్..
ఆరోగ్యవంతమైన వాతావరణం సృష్టించడం ద్వారా మాత్రమే బీపీ సంబంధిత సమస్యలను అడ్డుకోగలం. చిన్నారుల జీవనశైలి అలవాట్లు , ఆహారం, వ్యాయామాలు, స్క్రీన్ టైమ్‌ను అత్యవసరంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని రాజ్ జనపరెడ్డి అంటున్నారు. అలాగే చిన్నారులకు మూడు సంవత్సరాల వయసు దాటిన తరువాత సంవత్సరానికో సారి తప్పనిసరిగా రక్తపోటు పరీక్షలను చేయించడం అవసరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment