![Suffered With Bald Head Problem Here Reasons And Solutions - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/15/bald%20head.jpg.webp?itok=fb0QKr2s)
మామూలుగానేమనలో చాలామందికి జుట్టుఎక్కువగా రాలిపోతుంటుంది. ఇంకొంతమందిలో అయితే జుట్టు చాలా ఎక్కువగా రాలుతూ తమకు బట్టతల వస్తుందేమోఅన్న బెంగ కలిగిస్తుంటుంది. ఇలాంటి వారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలూ, వివరాలూ ఇవి... జెండర్ ప్రకారం చూస్తే బట్టతలలో రెండు రకాలుంటాయి. మొదటిది పురుషుల్లో వచ్చే బట్టతల. దీన్నే ‘మేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’ అంటారు. ఇక రెండోది మహిళల్లో వచ్చే ‘ఫిమేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’. బట్టతలను వైద్యపరిభాషలో ‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటారు.
బట్టతల... కారణాలు
గతకొద్దికాలం వరకూ పురుషుల్లో బట్టతల రావడానికి కారణం టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్లనే అనే అపోహ ఉండేది. మగపిల్లల్లో యుక్తవయసు రాగానే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రవించడం మొదలవుతుందనీ... ఈ టెస్టోస్టెరాన్ కారణంగా యువ దశ మొదలుకొని క్రమంగా వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో హెయిర్‌లైన్ కొద్దికొద్దిగా వెనక్కు పోతూ ఉండేదన్న అభిప్రాయం ఉండేది. కానీ కొన్ని పరిశోధనల ప్రకారం దీనికి టెస్టోస్టెరాన్ కారణం కాదనీ... ‘డీహెచ్‌టీ’ (డిహైడ్రో టెస్టోస్టెరాన్) కారణమని తేలింది.
పురుషులు... మహిళల్లో తేడాలిలా...
ఇక పురుషుల్లో వచ్చే బట్టతలలో నుదురు మీద ఉండే హెయిర్‌లైన్ క్రమంగా వెనక్కిపోతూ ఉంటుంది. అదే మహిళల్లోనైతే ఫిమేల్ పాట్రన్ హెయిర్‌లాస్ అనే కండిషన్ ఉంటుంది. ఇందులో తలపై ముందున్న హెయిర్‌లైన్ అలాగే ఉండి, మాడు మీద జుట్టు పలచబారుతూ పోతుంటుంది.
బట్టతల... నిర్ధారణ పరీక్షలివి...
బట్టతలను నిర్ధారణ చేయడానికి డెర్మోస్కోపీ లేదా ట్రైకోస్కోపీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది.
చికిత్స ప్రక్రియలు...
బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక... తొలుత మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. వాటితో ప్రయోజనం లేకపోతే మీసోథెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అండ్ డర్మారోలర్ వంటి ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు. ఇక లేజర్ సహాయంతో చేసే ఇన్‌ఫ్రారెడ్ లైట్ థెరపీ, లేజర్ కోంబింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి. వీటన్నింటితో పాటు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి చికిత్సలు కూడా ఉపకరిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment