ప్రేమకూ భాషలున్నాయి! | Surprising Scientific Love Facts | Sakshi
Sakshi News home page

ప్రేమకూ భాషలున్నాయి!

Published Sun, Dec 15 2024 12:20 PM | Last Updated on Sun, Dec 15 2024 12:20 PM

Surprising Scientific Love Facts

రాధ, రవికి పెళ్లయి ఏడాదవుతోంది. రవికి రాధ అంటే చాలా ప్రేమ. తన ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాచీలు, ఆభరణాలు, దుస్తులు ఇచ్చి ఆశ్చర్యపరచేందుకు ప్రయత్నిస్తుంటాడు. కొత్త ఐఫోన్‌ మార్కెట్లోకి రాగానే తెచ్చి ఇచ్చాడు. ఆమె పుట్టినరోజునాడు డైమండ్‌ రింగ్‌ బహుమతిగా ఇచ్చాడు. అయినా రాధకు అసంతృప్తిగానే ఉంది. కారణం రవికి అర్థం కావడంలేదు. ఒకరోజు రాధనే అడిగాడు. ‘నువ్వు నాకు టైమ్‌ ఇవ్వడం లేదు’ అని సమాధానం వచ్చింది. ఏం చెయ్యాలో అర్థంకాక రవి తల పట్టుకున్నాడు. 

అభి, స్వాతిది మరో రకమైన సమస్య. ఆఫీస్‌ పనితో ఎంత బిజీగా ఉన్నా సరే అభికి ఇష్టమైంది చేసి పెట్టేందుకు స్వాతి ప్రయత్నిస్తుంది. వీలైనంత వరకు అతనితో గడిపేందుకే ప్రాధాన్యమిస్తుంది. అయినా అభికి సంతృప్తి లేదు. ఎందుకని అడిగితే.. ‘ఎప్పుడూ నేను హగ్‌ చేసుకోవడమే తప్ప, ఒక్కరోజైనా నీకు నువ్వుగా హగ్‌ ఇచ్చావా?’ అని అడిగాడు. ‘అదేంటీ.. మనం బానే ఉన్నాం కదా?’ అని అడిగింది. ‘సంసారమంటే అదొక్కటే కాదు, మామూలప్పుడు కూడా హగ్‌ చేసుకోవచ్చు’ అని చెప్పాడు. 

ఇలాంటి సమస్య మీకూ ఎదురైందా? ఏం చేస్తే భాగస్వామి సంతోషపడతారో తెలియక తలపట్టుకుంటున్నారా? డోంట్‌ వర్రీ. మీకోసమే ఈ వ్యాసం. 

ప్రేమభాషను గుర్తించండి..
మీరు ప్రేమిస్తే సరిపోదు, మీ ప్రేమను వ్యక్తపరచే విధానం మీ భాగస్వామి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అంటే మీ భాగస్వామి ప్రేమభాష మీకు తెలిసి ఉండాలి. ప్రేమభాషలను నేర్చుకోవడం వల్ల.. 

1 జంటలు ఒకరి భావాలను ఒకరు మరింతగా అర్థం చేసుకుంటారు. భావోద్వేగాలను అందంగా వ్యక్తపరచడం ద్వారా అనుబంధం బలపడుతుంది.  

2. వైవాహిక జీవితంలో అనేక సందర్భాలలో అపార్థాలు తలెత్తవచ్చు. ప్రేమభాషలను అవగాహన చేసుకుంటే, మీ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అపార్థాలు దూరమవుతాయి. 

3. ప్రేమభాషలను పట్టించుకోవడం, పాటించడం జంటల మధ్య సాన్నిహిత్యాన్ని, సంతృప్తిని పెంచుతుంది.  

ఐదు ప్రేమభాషలు
గ్యారీ చాప్‌మన్‌ ప్రేమ భాషల సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి ప్రేమను అనుభవించే, వ్యక్తపరచే విధానం భిన్నంగా ఉంటుంది. అందులో ప్రధానంగా ఐదు రకాలున్నాయి. అవి మాటలు, సేవలు, బహుమతులు, సమయం, స్పర్శ. జంటలు ఒకరి ప్రేమ భాషను ఒకరు అర్థం చేసుకోకపోతే అది అపార్థాలకు, విభేదాలకు దారితీస్తుంది. అందుకే ప్రేమభాషల గురించి తెలుసుకుందాం, ప్రేమను సరైన రీతిలో పంచుకుందాం, భాగస్వామి ప్రేమను గెలుచుకుందాం.

ప్రశంసలు
కొందరికి ప్రేమంటే ప్రశంసలే. లక్ష రూపాయల డైమండ్‌ రింగ్‌ కంటే కూడా ‘ఐ లవ్‌ యూ’ అనే మూడు పదాలే వారికి ముఖ్యం. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’, ‘నీతో ఉంటే నాకు టైమ్‌ తెలియదబ్బా’, ‘నీకంటే ముఖ్యమైనది మరేదీ లేదు’ అనే మాటలు వారి మనసును కట్టిపడేస్తాయి.

సేవ ద్వారా ప్రేమ
మరికొందరికి మాటల కన్నా చేతలు, సేవలు ముఖ్యం. ‘ఐ లవ్‌ యూ’ అని కబుర్లు చెప్తే సంతోషించరు. ఇంటిపనిలో సహాయం చేయడం, తలనొప్పి వచ్చినప్పుడు మర్దన చేయడం, తన పనులు చేసిపెట్టడం లాంటివి చేస్తేనే ప్రేమ ఉన్నట్లు భావిస్తారు.

బహుమతులు అందించడం
కొన్ని జంటలు ప్రేమను బహుమతుల ద్వారా వ్యక్తీకరిస్తారు. ఇక్కడ మాటలు, చేతల కన్నా కూడా బహుమతులే ముఖ్యం. రెండ్రూపాయల గులాబీ పువ్వు కావచ్చు, ఒక మంచి డ్రెస్‌ కావచ్చు, బంగారపు ఉంగరం కావచ్చు.. ఏదో ఒక బహుమతి ఇవ్వడమే ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు.

సమయం గడపడం
మరికొందరికి ప్రేమంటే ఇద్దరూ కలిసి కూర్చుని సమయం గడపడమే. రాధా రవిల సమస్య ఇదే. ఖరీదైన బహుమతులివ్వడమే ప్రేమను ప్రదర్శించడమని రవి అనుకుంటుంటే, తనతో సమయాన్ని గడపాలని రాధ కోరుకుంటోంది.  

స్పర్శ
ఈ భాషలో ఉన్నవారు ప్రేమను ముద్దు, కౌగిలి, అందమైన స్పర్శల ద్వారా వ్యక్తం చేస్తారు. అలా చేయడమే ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. భాగస్వామి అలా చేయనప్పుడు తనపై ప్రేమ లేదని బాధపడుతుంటారు. అభి సమస్య ఇదే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement