సాధనతోనే కీర్తికిరీటం... విశాఖ స్వాతి విజయ ప్రస్థానం | Swathi Pala: Winner Haut Monde Mrs. India Worldwide 2022 Winner | Sakshi
Sakshi News home page

సాధనతోనే కీర్తికిరీటం... విశాఖ స్వాతి విజయ ప్రస్థానం

Published Tue, Sep 6 2022 12:35 AM | Last Updated on Tue, Sep 6 2022 10:44 AM

Swathi Pala: Winner Haut Monde Mrs. India Worldwide 2022 Winner - Sakshi

‘నేను ఒక సగటు భారతీయ మహిళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పెళ్లయ్యి, పిల్లలున్న నాకు అందాల సుందరిగా పట్టాభిషేకం చేయడం భారతదేశం నలుమూలల్లో ఉన్న అద్భుతమైన మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పారు స్వాతి పాల. ఈ యేడాది హాట్‌ మండే మిసెస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ 2022 విజేత కిరీటాన్ని ఇటీవల స్వాతి పాల అందుకున్నారు.

విశాఖపట్టణంలో పుట్టి పెరిగిన స్వాతి, హైదరాబాద్‌లో మీడియా రంగంలోనూ పని చేశారు. కెనడాలో బిజినెస్‌ అనలిస్ట్‌గా, ఇద్దరు పిల్లలు తల్లిగా, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న గృహిణిగా, తన కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్న సాధకురాలిగా స్వాతి ఎన్నో సంగతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

‘‘ఈ ఏడాది ప్రయాణం నాకు చాలా అపురూపమైనది. వివాహిత మహిళల కోసం అత్యంత గౌరవనీయమైన, ప్రసిద్ధి చెందిన ఈ అందాల పోటీలు దుబాయ్‌లోని రస్‌ అల్‌ ఖైమాలోని హిల్టన్‌ గార్డెన్‌ ఇన్‌ లో జరిగింది. ఈ ఫైనల్స్‌లో దేశ దేశాల నుంచి 20 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో నేను అగ్రగామిగా నిలవడం ఎంతో గొప్పగా, ఆనందంగా అనిపించింది. నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం, భూమిని సూచించేలా నన్ను ఎలిమెంట్స్‌ క్వీన్‌గా ప్రకటించారు.

మాది వైజాగ్‌. అక్కడే ఆంధ్రా యూనివర్శిటీలో ఎంబీయే చేశాను. హైదరాబాద్‌కి ఉద్యోగరీత్యా వచ్చాక సాక్షి’ టీవీ ప్రారంభం నుంచి నాలుగేళ్లు హెచ్‌.ఆర్‌ విభాగంలోనూ, క్రియేటివ్‌ ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌గానూ వర్క్‌ చేశాను. మా వారి జాబ్‌ నేవీ కావడంతో తనకు కెనడాకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. దీంతో నేనూ కెనడా వెళ్లాను. అక్కడే బిజినెస్‌ అనలిస్ట్‌గా వర్క్‌ చేస్తున్నాను.

ఆన్‌లైన్‌లో అప్లై
మా వారు ఆన్‌లైన్‌లో ఈ అందాల పోటీల గురించి చూసి, నన్ను ప్రోత్సహించారు. అప్లై చేయించారు. 50 వేల అప్లికేషన్స్‌లో 110 మందిని ఎంపిక చేశారు. అలా ఎంపిక అయిన వారిలో నేనున్నాను. అప్లై చేసిన దగ్గర నుంచి ఏడాదిగా చాలా సెషన్స్‌ అయ్యాయి. వాటిలో రకరకాల టాస్క్‌లు దాటుకుని దుబాయ్‌లో జరిగిన గ్రాండ్‌ ఫినాలే వరకు వచ్చాను. మూడు రోజుల పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 20 మందితో పోటీ పడి ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచాను.

కష్టమైనా ఇష్టంతో..
ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఈ పోటీలో పాల్గొడానికి చేసిన కృషి చాలా కష్టమైనది. రోజూ జిమ్‌కి వెళ్లడం, సరైన పోషకాహారం తీసుకోవడం, గ్రూమింగ్‌ సెషన్స్‌ తీసుకోవడం, ర్యాంప్‌ వాక్, వెయిట్‌ మేనేజ్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోసం క్లాసులు .. ప్రతిసారీ టాస్క్‌ అనిపించింది. ఉద్యోగంతో పాటు ఈ హార్డ్‌ వర్క్‌ చేయగలనా.. అని సందేహం కలిగింది. కానీ, ప్రారంభించాక మెల్ల మెల్లగా మామూలు అయిపోయింది. అయితే, ఈ క్లాసులన్నీ దాదాపు ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. ఇండియా నుంచి కోచ్‌లుగా ఉన్న రితిక రామ్‌త్రీ మొదటి ఆరు నెలలు, తర్వాత శైలజ సూచి దగ్గర ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఇండియా టైమింగ్స్‌ను బట్టి నైట్‌ టైమ్‌లోనూ కోచింగ్‌ తీసుకున్నాను. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను అనే ఉత్సాహంతో ఈ ప్రయాణం నడిచింది.

క్లాసికల్‌ డ్యాన్సర్‌
ముందు కష్టం అనుకున్నది మెల్లగా మెల్లగా నా దినచర్య మార్చుకోవడంతో ట్రైనింగ్‌ సులువుగా మారిపోయింది. సెషన్స్‌లో ‘మిమ్మల్నే మిసెస్‌ ఇండియాగా ఎందుకు సెలక్ట్‌ చేయాలి?’ అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనుకున్నాను. చిన్నప్పుడు శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ తీసుకున్నాను. దీంతో డ్యాన్స్‌లో నాకు సులువు అనిపించింది.

పిల్లలే ప్రోత్సాహం
 కిరీటం వచ్చిందా లేదా అనేది తర్వాతి విషయం. శిక్షణ ఎంత బాగా తీసుకుంటామో ఫైనల్‌ పోటీలలో ప్రతిఫలిస్తుంది. కానీ, నాలో నాకే చాలా గొప్ప మార్పులు కనిపించాయి. నా పెద్ద కొడుకు తనీష్‌కి పదకొండేళ్లు. వాడు నా ఫొటోలు తీసి, సోషల్‌ మీడియా పేజీలో అప్‌లోడ్‌ చేసేవాడు. చిన్నవాడు రేయాన్‌ ఫుడ్‌ తీసుకోవడంలో చాలా బాగా ఎంకరేజ్‌ చేసేవాడు. ‘నువ్వే గెలవాలి’ అనే వారి తాపత్రయం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది.

రాబోయే పోటీలు
12వ  సీజన్‌ స్టార్ట్‌ కాబోతోంది. కెనడాలో వచ్చే నెలలో జరగబోయే ఆడిషన్స్‌లో నేను జ్యూరీ మెంబర్‌గా ఉన్నాను. అయితే, ఫైనల్స్‌ ఎక్కడ జరుగుతాయో తెలియాల్సి ఉంది’ అని వివరించారు ఈ మిసెస్‌ ఇండియా.
– నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement