హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని, తెలుగులో ప్రత్యేకించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డేటాతో స్వేచ్చా "AI చందమామ కథలు" ను శనివారం ఆవిష్కరించింది. తెలుగు ఎల్‌ఎల్‌ఎమ్ అనేది తెలుగు మాట్లాడే మారుమూల రైతుకు కూడా అందుబాటులో ఉండాలనే ఛాలెంజ్‌ను స్వీకరించి, ఈ క్రమంలో దీనికి చందమామ కథలను ఎంచుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరైనారు. ఇది తెలుగులో కథ చెప్పడం కోసం దేశంలో తీసుకొచ్చిన తొలి ఏఐని ఆయన కొనియాడారు. నీతి, మర్మం నైతిక విలువలతో కూడిన చందమామ కథలను తెలుగు ఏఐవైపు మళ్లించడం సంతోషమన్నారు. భారతీయ కథలు, భారతీయ భాషలలో, భారతీయులందరికీ కథల రూపంలో అందించడం ముఖ్యం, ఈ క్రమంలో తెలుగు భాషలో, విలువలతో కూడిన చందమామ కథలతో ప్రారంభించడం చాలా బాగుందన్నారు ప్రొఫెసర్ (ఐఐటీ, మద్రాస్)గౌరవ్ రైనా.
ఈ సందర్భంగా స్వేచ్ఛ తెలంగాణ వ్యవస్థాపకుడు వై కిరణ్ చంద్ర సాక్షి.కామ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక చిన్న సమావేశంలో కథలకోసం భారతీయ భాషలలో ఏఐని సృష్టించే ఈ సమస్యపై ఆలోచిస్తున్న క్రమంలో చైతన్య (CPO & కో-ఫౌండర్, ఓజోనెటెల్), ప్రొఫెసర్ గౌరవ్ రైనా (ప్రొఫెసర్ IIT మద్రాస్) ఈ ఆలోచనకు రూపం వచ్చిందని తెలిపారు. తమ ప్రయత్నానికి 30 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు సహకరించారని తెలిపారు. దీన్ని భవిష్యత్తులో స్వేచ్ఛ గొంతుకలా కూడా విస్తరించాలని భావిస్తున్నామని కిరణ్ చంద్ర తెలిపారు.
ప్రధానంగా భారతదేశంలో 10 మిలియన్ డాలర్లతో ChatGPT లాంటి ఎల్‌ఎల్‌ఎంని నిర్మించడం అసాధ్యమన్న ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ వ్యాఖ్యల్ని సవాల్‌గా తీసుకున్నట్టు చెప్పారు. ఓపెన్ AI వంటి వాటితో పోటీ పడేందుకు భారతీయ స్టార్ట్-అప్ రూపొందించిన తొలి ఇండిక్ లాంగ్వేజ్ మోడల్‌లలో తమ స్వేచ్ఛ చాట్‌బాట్ ఒకటని కిరణ్ వెల్లడించారు.
42 వేలకు పైగా పేజీల కథలను ఇప్పటికే అప్ లోడ్ చేశామనీ, అమృతమైన సరికొత్త కథలు వచ్చేలా కూడా ఈ టూల్ ను సిద్ధం చేశామని చెప్పారు. 40వేల కథల డేటాసెట్ ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేయడానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనేది చాట్‌జీపీటీలా ఖరీదైనదిగా గాకుండా ప్రతి రైతుకు, ప్రతి గ్రామీణ ఉపాధ్యాయునికి, ప్రతి దుకాణదారునికి అందుబాటులో ఉండాలన్నారు. ఆవైపుగా కూడా తమ కృషి సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రమా దేవి లంక(డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్) ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల కూడా పొల్గొనడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment