Tanya Khanijow is an Indian YouTuber, travel blogger, and a photographer: ఏ స్కూల్లోనైనా రెండేళ్లు చదివితే అక్కడి వాతావరణం, తోటి విద్యార్థులు మంచి స్నేహితులైపోతారు. అక్కడి నుంచి మారి వేరే స్కూల్లో చేరాలంటే బాధగా.. కొత్త వాతావరణానికి అలవాటు పడటం కష్టంగా అనిపిస్తుంది. అటువంటిది ఢిల్లీకి చెందిన తాన్య పదోతరగతి పాసయ్యేలోపు చాలా స్కూళ్లు మారింది... వెళ్లిన ప్రతిచోటా అక్కడి వాతావరణానికి సులభంగా అలవాటు పడడమే కాదు. అక్కడి వారితో ఇట్టే కలిసిపోయి స్నేహితులను సంపాదించుకునేది. తనకు అది నచ్చడంతో పెద్దయ్యాక ఏకంగా ట్రావెలింగ్‌నే కెరియర్‌గా మలచుకుంది. వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తూ అక్కడి ఆసక్తికర అంశాలను తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ లక్షలమందిని అలరిస్తూ, ట్రావెల్ బ్లాగర్, సోషల్ మీడియా ఎంట్రప్రెన్యూర్, ట్రావెల్ ఫిల్మ్‌మేకర్‌గా రాణిస్తోంది.
ఢిల్లీలోని ఓ ఆర్మీ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి తాన్య ఖనీజో. ఇంట్లో తాన్యానే పెద్దమ్మాయి, తనకు టివేషా అనే చెల్లి ఉంది. నాన్న ఆర్మీలో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తుండేవారు. నాన్న ఉద్యోగ బదిలీ కారణంగా ప్రతి రెండేళ్లకు ఒక కొత్త ప్రదేశాన్ని చూడాల్సి వచ్చేది తాన్యకు. కుటుంబం మకాం మార్చిన ప్రతి ఊరిలో అక్కడి పరిస్థితులు, వాతావరణానికి అలవాటు పడటానికి కొంచెం ఇబ్బంది పడినప్పటికీ తొందరలోనే ఆ కొత్త ప్రదేశాన్ని ఇష్టపడేది. అలా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని తొమ్మిది రకాల స్కూళ్లలో పాఠశాల విద్యనభ్యసించింది.
తరువాత ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. హాస్టల్లో ఉండి చదువుకున్న తాన్యా ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా రకరకాల అడ్వెంచర్స్‌లో పాల్గొనేది. అంతేగాక కాలేజీ స్నేహితులతో కలిసి ట్రిప్స్‌కు వెళ్తుండేది. ఇలా తరచూ ఊర్లు మారడం, ట్రిప్‌లకు వెళ్తుండడంతో చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్‌పై తాన్యకు మక్కువ ఏర్పడింది.
ఉద్యోగం వదిలేసి..
2016లో ఇంజినీరింగ్ పూర్తైన వెంటనే ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో బిజినెస్ అనలిస్ట్‌గా చేరింది. ఉద్యోగంలో చేరినప్పటికీ ట్రావెలింగ్ మీద ఆసక్తి వదులుకోలేక ఉద్యోగం చేస్తూనే మరోపక్క సమయం దొరికినప్పుడల్లా ట్రిప్స్‌కు వెళ్లేది. ఇలా వెళ్లిన ప్రతిసారి అక్కడి ప్రదేశాల్లోని ఆసక్తికరమైన వాటిని ఫోటోలుగా, కొన్నింటిని వీడియోల రూపం లో భద్రపరచుకునేది.
ఒకసారి వీటన్నింటిని సోషల్ మీడియా లో పెడితే బావుంటుందన్న ఆలోచన రావడంతో... ఒక బ్లాగ్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేసి దానిలో తన దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలు పోస్టు చేసేది. వాటికి మంచి స్పందన లభిస్తుండడంతో ఉద్యోగాన్ని వదిలేసి, ట్రావెలింగ్‌నే కెరియర్‌గా మలచుకోవాలనుకుంది. ఇందుకోసం జీతాన్ని పొదుపు చేసి డబ్బును జమ చేసుకుంది. తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి పూర్తి సమయాన్ని ట్రావెలింగ్‌కు కేటాయించింది.
సోలో గర్ల్ ఇన్ పాండిచ్చేరి..
ఉద్యోగం మానేసిన వెంటనే తాన్యా ఖనీజో పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. తొలిసారి ఢిల్లీ నుంచి పాండిచ్చేరికి నాలుగురోజుల సోలో ట్రిప్ వీడియోను ‘సోలో గర్ల్ ఇన్ పాండిచ్చేరి’ పేరిట పోస్టుచేసింది. ఈ వీడియోకు మంచి స్పందన లభించడంతో ట్రావెల్ వీడియో లు వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయని గ్రహించి, షూట్ చేసిన వీడియోలను మరింత నాణ్యంగా అందించేందుకు అర్థవంతంగా ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసింది. వ్యూవర్స్ మరింతగా పెరిగారు.
తొలినాళ్లలో ట్రావెల్ టిప్స్‌తోపాటు దియా, లైఫ్‌స్టైల్, ఫ్యాషన్‌కు సంబంధించిన అనేక అంశాలను పోస్టు చేసేది. తరువాత తక్కువ బడ్జెట్‌లోనే ఎక్కువ ప్రదేశాలను ఎలా సందర్శించవచ్చు, వంటి అంశాలతో కూడా వీడియోలు పోస్టు చేసేది. ఇండియాలోనే తొలి మహిళా ట్రావెలర్ కావడంతో తాన్యా ఛానల్‌కు మంచి వ్యూస్ వచ్చేవి. దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలను అర్థవంతంగా వివరిస్తుండడంతో.. ప్రస్తుతం తాన్య యూట్యూబ్ ఛానల్‌కు దాదాపు ఎనిమిది లక్షల మంది సబ్‌స్క్రైబర్స్, ఇన్‌స్టాగ్రామ్ లో నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తన జీవితంలో అనుకోకుండా ఎదురైన పరిస్థితులను ఆనందంగా స్వీకరించడమేగాక, వాటినే కెరియర్‌గా మలుచుకునీ ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది తాన్య.
చదవండి: Bipin Rawat Wife Madhulika: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే
Comments
Please login to add a commentAdd a comment