కేరళలో విలక్షణమైన జానపద సంప్రదాయ సమ్మేళనానికి నిదర్శనం ‘తెయ్యం’ వేడుకలు. ముఖ్యంగా కేరళ ఉత్తర ప్రాంతంలో రకరకాల ‘తెయ్యం’ వేడుకలు జరుగుతాయి. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా కోట్టంకుళిలో డిసెంబర్ 6 నుంచి 15వ తేదీ వరకు ‘పేరుమ్‌తిట్ట తరవాడ్’ అనే తెయ్యం ఉత్సవాలు జరుగుతున్నాయి. మలబార్ ప్రాంతంలోని వివిధ గిరిజన తెగలకు చెందిన కళాకారులు సంప్రదాయ వేషాలను ధరించి, పౌరాణిక గాథలకు సంబంధించిన సంగీత, నృత్య ప్రదర్శనలు చేస్తారు.
‘పేరుమ్‌తిట్ట తరవాడ్’ వేడుకల్లో ‘ఎలయూర్ తెయ్యం’, ‘చాముండీ తెయ్యం’, ‘పంచూర్ల తెయ్యం’, ‘ముత్తూర్ తెయ్యం’ వంటి వివిధ పురాతన సంప్రదాయ రీతుల తెయ్యం నృత్యరూపకాలను ప్రదర్శిస్తారు. వేలన్ తెగకు చెందిన గిరిజనుల సంప్రదాయ నృత్యం ‘తెయ్యం’ నృత్యంగా పరిణామం చెందింది. ఈ నృత్యానికి దాదాపు పదిహేనువందల ఏళ్ల చరిత్ర ఉంది. దేవతల నుంచి, పితృదేవతల నుంచి ఆశీస్సులు కోరుతూ ఈ నృత్యం చేస్తారు. మలబార్ ప్రాంతంలో ఇలాంటి తెయ్యం వేడుకలు ఏటా అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వేర్వేరు చోట్ల జరుగుతాయి. ‘తెయ్యం’ ప్రదర్శనలు సాధారణంగా ఆలయ ప్రాంగణాల్లోను, ఆలయాలకు సంబంధించిన వేడుకల్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపైన జరుగుతాయి.
‘తెయ్యం’ అనే మాట ‘దైవం’ నుంచి వచ్చిందని చెబుతారు. ఇది దైవాన్ని ప్రసన్నం చేసుకునే నృత్యంగా నమ్ముతారు. మలబార్ ప్రాంతంలో దాదాపు నాలుగువందల తెయ్యం రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎక్కువగా పురుషులే ‘తెయ్యం’ ప్రదర్శనలు చేస్తారు. అయితే, ‘దేవకూత్తు తెయ్యం’ నృత్యాన్ని మాత్రమే మహిళలు ప్రదర్శిస్తారు. ‘తెయ్యం’ నృత్యం చేసే కళాకారులు విచిత్రమైన సంప్రదాయ వేషాలను ధరిస్తారు. వీరు నృత్యం చేసేటప్పుడు వాద్య కళాకారులు సంప్రదాయ వాద్యాలైన డోలు, సన్నాయి, తప్పెటలు వంటివి మోగిస్తారు. వేడుకలకు సంబంధించిన పౌరాణిక గాథలను గానం చేస్తారు. కళ్లు చెదిరే రీతిలో సాగే ఈ ప్రదర్శనలను తిలకించడానికి దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు కూడా వస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment