నేను ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలోని ఇబ్బంది వల్ల వేరే ఉద్యోగం చూసుకున్నాను. ప్రస్తుతం ఉన్న కంపెనీలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేస్తాను అని అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. కానీ, రాజీనామా ఇస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇస్తాము అని చెప్పారు. తీరా రాజీనామా చేసే సమయానికి ‘మేము రిలీవింగ్ ఇవ్వము. నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వము. అగ్రిమెంట్ ప్రకారం మూడేళ్లు పనిచేయాల్సిందే – అంటే ఇంకో 14 నెలలపాటు ఇక్కడే ఉండాలి అంటున్నారు.’ ఇదే కంపెనీలో పని చేస్తే నేను జీవితాన్ని కోల్పోతాను. ఎంతో హెరాస్మెంట్‌గా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. – ఒక ఐ.టీ. ఉద్యోగి, హైదరాబాద్
అసలు మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కంపెనీ వారికి ఎందుకు ఇచ్చారు? అలా తీసుకునే హక్కు కానీ, తీసుకుని వారి వద్దనే ఉంచుకునే హక్కు కానీ ఎవరికీ లేదు. పరిశీలించిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు మీకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలా కాదని ఎవరైనా చేస్తే అది చట్టరీత్యా తప్పు. ఐటీ కంపెనీలలో సాధారణంగా ఫ్రెషర్స్ గా వచ్చిన వారితో బాండు రాయించుకోవడం చూస్తుంటాము. కానీ, బాండు రాయించుకున్నంత మాత్రాన మీరు వారి వద్ద బానిసత్వం చేయాలి అని అర్థం కాదు. అలాంటి బాండ్లు అన్నివేళలా చెల్లవు కూడా. కంపెనీవారు మీకు ఏదైనా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి, (స్పెషల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్స్ వంటివి) ఆ శిక్షణ ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటే, సదరు శిక్షణ నుంచి మీరు నేర్చుకున్న పని ఆ కంపెనీకి ఉపయోగకరం అయినప్పుడు మాత్రమే వారు ఇచ్చిన శిక్షణకు ప్రతిఫలంగా కొంతకాలం వారి వద్ద పనిచేయాలి అనే నిబంధన చెల్లుతుంది. అంతేకానీ ప్రతి ఒక్క ఉద్యోగి దగ్గర ఇలాంటి బాండ్లు రాయించుకుంటే అవి చెల్లవు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు.
కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్, సెక్షన్ 27 ఒక వ్యక్తిని తన వాణిజ్య/వ్యాపారాలు చేయడం వీలు లేదు అని రాసుకున్న ఏ అగ్రిమెంట్ అయినా కాంట్రాక్టు అయినా చెల్లవు. మీరు రాసుకున్న అగ్రిమెంట్/ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ లోని పదజాలాన్ని ఒకసారి పరిశీలించండి. మీరు లిఖితపూర్వక నోటీసు ఇచ్చి, నోటీసు సమయాన్ని పూర్తి చేసి ఆ కంపెనీని వదిలి వెళ్లవచ్చు. వీలుంటే ఒక లాయర్‌ని సంప్రదించి ఆ కాంట్రాక్టు చెల్లుతుందో లేదో చూసుకోండి.
ఇదీ చదవండి: ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!
ఐటీ ఉద్యోగి అయినప్పటికీ, మీరు చేసే పని గనుక లేబర్ యాక్ట్ పరిధిలోకి వస్తే, మీరు లేబర్ కోర్టును కూడా సంప్రదించవచ్చు. అలాగని అందరు ఐటీ ఉద్యోగులకూ లేబర్ చట్టాలు వర్తించవు. కొందరికి మాత్రమే వర్తిస్తాయి. ప్రత్యామ్నాయంగా మీరు సివిల్ కోర్టును మీరు ఆశ్రయించవచ్చు. కొంత సమయం పట్టినప్పటికీ మీకు సరైన న్యాయం దొరుకుతుంది.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం
sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment