అపుడు భిక్షాటన...ఇపుడు డాక్టరమ్మగా! ఇంట్రస్టింగ్‌ జర్నీ | Tibetan monk helps slum dweller daughter become MBBS doctor | Sakshi
Sakshi News home page

అపుడు భిక్షాటన...ఇపుడు డాక్టరమ్మగా! ఇంట్రస్టింగ్‌ జర్నీ

Published Fri, Oct 4 2024 3:31 PM | Last Updated on Fri, Oct 4 2024 4:05 PM

Tibetan monk helps slum dweller daughter become MBBS doctor

అదృష్టం కలిసి వస్తే.. ఏ స్థితిలో ఉన్నా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అందివచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుంటే  ఆకాశమంత ఎత్తు ఎదగవచ్చు. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మురికి వాడలో పుట్టిన పింకీ ప్రేరణాత్మక కథ చదివితే ఈ మాటలు అక్షరాలా నిజం అనిపిస్తుంది.


స్టోరీ ఏంటీ అంటే: పండుగ సీజన్‌లో  కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలోని  మెక్‌లియోడ్‌గంజ్‌లోని బుద్ధ దేవాలయం దగ్గర తన తల్లి కృష్ణతో కలిసి పింకీ హర్యాన్  అనే బాలిక భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేది. అయితే 2004లో ఆమె అదృష్టవశాత్తూ టిబెటన్  బౌద్ధ సన్యాసి జమ్యాంగ్ కంటపడింది.  జమ్యాంగ్ ఆమెను ఆదరించి సాయం చేశాడు. విద్యాబుద్ధులు నేర్పించాడు. చివరికి  చైనీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్‌  పూర్తి చేసి ధర్మశాలకు తిరిగి వచ్చింది.

అయితే  ఈ జర్నీ అంత ఈజీగా జరగలేదు. బిచ్చమెత్తుకుంటూ కనిపించిన బాలిక కోసం  వెదికి, చరణ్ ఖుద్ వద్ద ఉన్న మురికివాడను సందర్శించి బాలికను గుర్తించాడు. ఆమెను చదివిస్తానని చెప్పాడు. కానీ ఇందుకు ఆమె  తండ్రి మొదట్లో ఇష్టపడలేదు. ధర్మశాలలోని దయానంద పబ్లిక్ స్కూల్‌కు పంపమని పింకీ హర్యాన్ తల్లిదండ్రులను ఒప్పించాడు.   చివరికి పింకీ తండ్రి కాశ్మీరీ లాల్‌  అంగీకరించి, కొత్తగా ప్రారంభించిన టోంగ్లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ హాస్టల్‌కు పంపడంతో అసాధారణ ప్రయాణం మొదలైంది.  పింకీ హర్యాన్ చదువులో బాగా రాణించింది. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి తర్వాత నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. కానీ ఇక్కడ ఫీజులు చాలా ఎక్కువ కాబట్టి 2018లో చైనాలోని ప్రతిష్టాత్మకమైన వైద్య విశ్వవిద్యాలయంలో చేరింది.  ఆరేళ్ల  ఎంబీబీఎస్‌ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ధర్మశాలకు తిరిగి వచ్చింది.

 

ఈ సందర్భంగా "నా తండ్రి చెప్పులు కుట్టేవాడు , బూట్లకు పాలిష్ చేయడం ద్వారా జీవనం సాగించేవాడు అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. తన విజయానికి తాను టిబెటన్ సన్యాసి జమ్యాంగ్‌కు రుణపడి ఉన్నానని, ఇప్పుడు పేదరికం కారణంగా చదువుకునే స్థితిలో లేని ఇతర పేద పిల్లలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పింకీ చెప్పింది. చిన్నప్పుడు,  మురికివాడలో నివసించాను కాబట్టి నా నేపథ్యమే అతిపెద్ద ప్రేరణ అని  తెలిపింది.  అంతేకాదు పింకీ ప్రేరణతో  ఆమె సోదరుడు, సోదరి అదే ఎన్‌జీవో పాఠశాలలో చేరడం విశేషం. 

కాగా డబ్బు సంపాదించే యంత్రాలుగా మారడానికి బదులుగా మంచి మానవులుగా మారడానికి పిల్లలను మార్చడమే సన్యాసి జమ్యాంగ్ లక్ష్యమని,  గత 19 సంవత్సరాలుగా ఎన్‌జీవో టోంగ్లెన్ ట్రస్ట్‌తో అనుబంధం కలిగి ఉన్న సిమ్లాలోని ఉమంగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆయన తన జీవితమంతా ధర్మశాల, మురికివాడల పిల్లలకు అంకితం చేశాడన్నారు. జమ్యాంగ్ దత్తత తీసుకున్న పిల్లలంతా ఒకప్పుడు అడుక్కునేవారు లేదా చెత్తను ఏరేవారే. కానీ  ఇప్పుడు  వాళ్లంతా డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, హోటల్ మేనేజర్లుగా మారారని చెప్పారు. జమ్యాంగ్ 1992లో టిబెట్ నుండి తప్పించుకుని నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చాడు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పేదరికం ఆయనను కదిలించింది. పేదలకు సాయం చేయడం, ముఖ్యంగా మురికివాడల్లో పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement