పెద్ద చదువులు చదవలేదు.. ఖరీదైన ల్యాబుల్లో ప్రయోగాలు చేయలేదు.. కోట్ల రూపాయల పెట్టుబడి లేదు.. పరిశ్రమలనూ స్థాపించలేదు.. ప్రకృతి అధ్యయనాన్నే వ్యాధులకు చికిత్సగా మలస్తున్నారు.. సహజమైన సాగు నుంచే పంటలకు ఎరువులు.. పురుగు మందులను కనిపెడుతున్నారు..
ఇలా తమ పరిధిలోని ఆవరణ.. వాతావరణాన్నే ప్రయోగశాలగా ఎంచుకుని.. తమకున్న పరిజ్ఞానంతో కృషి చేస్తూ.. అంచనాలకు అందని రీతిలో అద్భుత ఆవిష్కరణలను సృష్టిస్తున్నారు. శాస్త్రవేత్తలను సైతం అబ్బురపరచే విధంగా వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న అతి సాధారణ రైతు కుటుంబానికి చెందిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. వారే తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, కారాకొల్లుకు చెందిన పల్లె శాస్త్రవేత్తలు.
వ్యవసాయం రసాయనాలతో విషతుల్యమవుతోంది. భూసారం భారీగా దెబ్బతింటోంది. ఉత్పత్తి గణనీయంగా పడిపోతోంది. పెట్టుబడి ఖర్చు రైతుకు గుదిబండగా మారుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే కొత్తగా చుట్టుముడుతున్న వ్యాధులు, తెగుళ్లు అన్నదాతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
అతి సామాన్యమైన కుటుంబాలు
వీటి నివారణకు ఎప్పటికప్పుడు పరిష్కారాలు వస్తున్నా తమవంతుగా ఏదో ఒకటి చేయాలన్న ఆరాటంతో ఏడుగురు మిత్రులు.. చంద్రశేఖర్, భాస్కర్, బత్తినాయుడు, మురళి, వెంకటేశ్వర్లు, శ్రీధర్, శివ బృందంగా ఏర్పడ్డారు. వీరంతా చిన్న చిన్న చదువులతో.. అతి సామాన్యమైన కుటుంబంలో అష్టకష్టాలు పడుతున్నవారే.
ధన్వంతరి ఆయుర్వేదిక్ రీసెర్చ్
అయినా సరే అన్నదాతకు మేలు చేయాలనే తపనతో వారి నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి పరిశోధనలు సాగిస్తున్నారు. సరికొత్త ప్రత్యామ్నాయాలను ఆవిష్కరిస్తున్నారు. తొలుత ఈ ప్రయాణం .. ధన్వంతరి ఆయుర్వేదిక్ రీసెర్చ్ అనే ఓ కుటీర పరిశ్రమ స్థాపనతో మొదలైంది. ప్రజలకు అత్యవసరమైన మందులు, ద్రావణాలు, పెయిన్ బామ్, తైలం లాంటి వాటిని సహజ సిద్ధంగా తయారు చేయనారంభించారు.
కొత్త పద్ధతుల్లో
ఇది విజయవంతం కావడంతో గ్రామ్ బజార్ పేరుతో ఓ సంస్థను పెట్టి వ్యవసాయంపై పరిశోధనలు మొదలుపెట్టారు. రైతుకు అధిక నష్టం చేకూర్చుతున్న తెగుళ్ల నివారణే లక్ష్యంగా అడుగులు వేశారు. ఇప్పుడున్న రసాయన మందులు, జీవామృతం, పంచామృతం, గోమూత్రం, వేపాకు కషాయం తదితరాలకు భిన్నంగా తమ పరిసరాల్లోనే దొరికే పలురకాల మొక్కలను సేకరించి.. కొత్త పద్ధతుల్లో ఎరువులు, పురుగు మందులను తయారు చేస్తున్నారు.
పేటెంట్ హక్కులు కూడా
అలా ఇంకొన్ని రకాల మొక్కల నుంచి మందులనూ తయారు చేయసాగరు. ప్రభుత్వాల సహకారం తీసుకోకుండా ఉన్న ఆస్తులను అమ్మేసి అన్నదాత కన్నీళ్లు తుడిచే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ ఉత్పత్తులకు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చి బయట మార్కెట్‌లో విక్రయించే స్థోమత లేక తమను సంప్రదించిన వారికి తక్కువ ధరకే అందిస్తున్నారు. కారాకొల్లు శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలకు భారత ప్రభుత్వం ద్వారా పేటెంట్ హక్కులు కూడా పొందారు.
గ్రామ్ బజార్.. రైతు హుషార్
నాలుగేళ్ల క్రితం గ్రామ్ బజార్ పేరుతో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, పురుగు మందులు తయారు చేయడం ప్రారంభించారు. వీటిని రైతులకు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇందులో ప్రధానంగా..
1.గ్రోత్ ప్రమోటర్
గ్రోత్ ప్రమోటర్ ద్రావణం అపరాలు, నూనె గింజలు, మిరప వంటి పంటలతో పాటు మామిడి, జామ, సపోటా, బత్తాయి తోటల పెంపకానికి పనిచేస్తుంది.
వాడకం ఇలా..
మినుము, కంది, పెసర, శనగ, వేరుశనగ పంటల్లో విత్తనం వేశాక 15–25 రోజుల మధ్య ఎకరాకు 2 లీటర్ల చొప్పున 14 కిలోలు ఇసుకలో కలిపి చల్లాలి. ఆకు కూరలు, కూరగాయల తోటల్లో ఎకరానికి 2 లీటర్ల చొప్పున ఇసుకలో కలిపి చల్లవచ్చు లేదా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయొచ్చు.
మొదలు వద్ద పోయవచ్చు. పూల తోటల్లో ఎకరాకు 2 లీటర్ల చొప్పున ఇసుకలో కలిపి చల్లవచ్చు. మామిడి, జామ, సపోట, బత్తాయి వంటి ఉద్యాన పంటల్లో ఎకరానికి 4 లీటర్ల చొప్పున ఇసుకలో కలిపి చల్లవచ్చు.
పండ్ల తోటల విషయంలో చెట్టు వయసు, సైజుని బట్టి మందు మోతాదు పెంచుకోవాలి. ఏ పంటలోనైనా ఇసుకలో కలిపి చల్లిన తర్వాత వెంటనే నీరు పెట్టాలి. అధిక దిగుబడి కోసం పంట కాలంలో రెండుసార్లు వాడడం ఉత్తమం.
2. నెమటోడ్స్
నెమటోడ్స్ ద్రావణం మెట్ట, అపరాలు, ఉద్యాన పంటల్లో నులిపురుగులను నివారిస్తుంది.
వాడకం ఇలా..
పంట సాగుకు ముందే నెమటోడ్స్ నివారిణి వేసుకోవచ్చు. స్వల్పకాలిక పంటలకు ఎకరానికి 2 లీటర్ల చొప్పున ఇసుకలో కలిపి చల్లాలి. దీర్ఘకాలిక పంటలు, పండ్ల తోటల్లో ఎకరానికి 4 లీటర్ల చొప్పున ఇసుకలో కలిపి చల్లాలి.
విత్తనం వేసిన 15–30 రోజుల మధ్య ఇసుకలో కలిపి చల్లి నీళ్లు పెట్టాలి. మందు ద్రావణం బాగా పనిచేయాలంటే నెమటోడ్స్ ద్రావణం పోసే ముందు మొక్కలకు తేలికగా నీరు పెట్టాలి. ద్రావణం పోసిన 6–7 గంటల తర్వాత లేదా మరుసటి రోజు నీరు పెట్టాలి. 2–3 నెలల తర్వాత రెండో విడత నెమటోడ్స్ నివారిణి వాడితే ఫలితం బాగుంటుంది.
3. వీడ్ జాప్
వీడ్ జాప్ ద్రావణం వరిలో కలుపు నివారణకు ఉపకరిస్తుంది.
వాడకం ఇలా..
ఎకరా వరికి 3 లీటర్ల చొప్పున ద్రావణాన్ని చివరి దమ్ము చేసే ముందు 28 కిలోల ఇసుకలో బాగా కలిపి పొలమంతా చల్లాలి. ఎత్తుపల్లాలు లేకుండా పొలాన్ని దమ్ము చేసుకోవాలి. పొలంలో కనీసం 2 అంగుళాలు నీళ్లు ఉండి, బయటకి వెళ్లకుండా చూసుకోవాలి.
ద్రావణం చల్లిన 2–3 రోజుల తర్వాత నాట్లు వేసుకోవాలి. డ్రమ్ సీడర్ ద్వారా నాటితే దమ్ము చేసే ముందు ఇసుకలో కలిపి చల్లాలి. కనీసం పది రోజుల వ్యవధి తర్వాత నేరుగా వరి విత్తనం విత్తుకోవచ్చు. చౌడు, సున్నపురాయి భూముల్లో ఈ ద్రావణం పనిచేయదు.
ధన్వంతరి.. వ్యాధులు మటుమాయం మరి!
ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్న వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడానికి కారాకొల్లు పల్లెశాస్త్రవేత్తల మిత్రబృందం.. ప్రకృతి సిద్ధంగా కొన్ని లేపనాలు, ద్రావణాలను ఆవిష్కరించింది. ఇందులో ప్రధానంగా..
1. శ్రీతైలం: ఇది అన్ని నొప్పులకు పనిచేస్తుంది. ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులకు అద్భుతంగా పనిచేస్తుంది.
2. దివ్యతైలం: గాయాలు, పుండ్లు, చర్మవ్యాధులకు దివ్య ఔషధిగా పనిచేస్తుంది
3. నో–బైట్: ఇది దోమ కాటు నుంచి రక్షిస్తుంది. 10 ఎంఎల్ ద్రావణం ఒళ్లంతా పూసుకుంటే 6–7 గంటల పాటు దోమలు దరిచేరవు. మనుషులతో పాటు పశువులకు కూడా ఉపయోగిస్తున్నారు.
4. కృష్ణ తైలం: ఇది పశువుల పొదుగు వాపు వ్యాధికి అత్యద్భుతంగా పనిచేస్తుంది.
అవార్డులు.. రివార్డులు
వీరి సేవలకు గుర్తింపుగా వీరికి 2013లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్‌ఐఎఫ్) కన్సొలేషన్ అవార్డు దక్కింది. ఢిల్లీలో ఎన్‌ఐఎఫ్ చైర్మన్, ప్రసిద్ధ శాస్త్రవేత్త డా. మషేల్కర్ చేతుల మీదుగా గల్లా చంద్రశేఖర్ అవార్డు తీసుకున్నారు.
2017లో నాటా అవార్డు వరించింది. కారాకొల్లుకు వచ్చి అవార్డు అందజేశారు. 2018లో రైతునేస్తం అవార్డును అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. 2016లో హైదరాబాద్‌లో ఐఐసీటీ (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డును అందజేసింది.
అదే నాలో కసి పెంచింది
1982–83 ప్రాంతంలో మా గ్రామానికి కరెంట్ లేదు. కరెంట్ కోసం అధికారుల వద్దకు వెళితే లంచం అడిగారు. లంచం ఇచ్చేది లేదని భీష్మించుకున్నా. ఆ తర్వాత నిరాహార దీక్ష చేయాలని నిశ్చయించుకున్నా. విషయం తెలుసుకున్న ఏఈ మా గ్రామానికొచ్చి కరెంట్ ఇచ్చేందుకు సమ్మతించారు. అప్పుడు నాలో ఓ ఆలోచన పుట్టింది.
నేను గ్రామానికే న్యాయం చేశాను.. దేశానికి చేయలేనా అని అనిపించింది. నాలో ఉన్న సైన్స్ పరిజ్ఞానంతో కొత్త వాటిని కనిపెట్టవచ్చని భావించా. ఇందులో భాగంగానే వ్యవసాయంతోపాటు ప్రజల అవసరాలకు ఉపయోగపడే మందులు కనిపెడుతున్నా. ల్యాబ్ సౌకర్యం లేదు. ప్రొఫెషనల్‌గా ఎక్కడికీ వెళ్లలేం.
మా చుట్టుపక్కల ఉన్న వివిధ రకాల మొక్కల నుంచే సొల్యూషన్ కనుక్కుంటున్నాం. మా మిత్రబృందంతో కలసి 1994లో తెల్లవెంట్రుకలను నల్లగా చేసే హెర్బల్ మందు కనిపెట్టాం. ఆ తర్వాత దోమల నివారణపై పరిశోధన చేశాం. ఇప్పుడు వ్యవసాయం, వ్యాధుల నివారణపై మందులు కనిపెడుతున్నాం.
– గల్లా చంద్రశేఖర్, కారాకొల్లు పల్లె శాస్త్రవేత్త
నెమటోడ్స్‌తో ఉత్తమ ఫలితాలు
నా పేరు రాఘవేంద్ర. మాది సత్యసాయి జిల్లా, ధర్మవరం. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. వ్యవసాయంపై ఉన్న మక్కువతో నాలుగు ఎకరాల్లో బత్తాయి సాగు చేశా. రెండేళ్ల తర్వాత మొక్కల కొసన.. ఆ తర్వాత చెట్లు మొత్తం ఎండిపోవడం మొదలైంది.
రకరకాల రసాయన మందులు ఉపయోగించా. ఖర్చు తప్ప ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే గ్రామ్ బజార్ యూట్యూబ్ చానల్ ద్వారా కారాకొల్లు పల్లె శాస్త్రవేత్తలు తయారు చేసిన నెమటోడ్స్ హెర్బల్ మందు వాడాను. మంచి ఫలితం వచ్చింది. 50 శాతం మొక్క చనిపోయినా మిగిలిన భాగం బతికింది. కాపు పెరిగింది. చాలా సంతోషంగా ఉంది.
శ్రీతైలంతో రెండంతస్తులు
నాపేరు నాగరాజు. మాది నాయుడుపేట. ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. గత కొంత కాలంగా ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. తిరగని ఆస్పత్రి లేదు. వాడని మందులు లేవు.
కానీ ఒళ్లునొప్పులు మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో కారాకొల్లు పల్లె శాస్త్రవేత్తలు తయారు చేసిన ప్రకృతి సిద్ధ ఔషధం శ్రీతైలంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండంతస్తుల మిద్దె కూడా అవలీలగా ఎక్కుతున్నా.
-యెండ్లూరి మోహన్, సాక్షి తిరుపతి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment