చందమామలో కుందేలు ఉంటుందో లేదో కాని చందమామ బాలల పత్రికలో కుందేలు ఉండేది. అడవి ఉండేది. సింహాలు, పులులు, నక్కలు. ఏనుగులు పిల్లలు కోరే ప్రపంచమంతా ఉండేది. ఆ బొమ్మలు గీసిన చిత్రకారుడు శంకర్ చెన్నైలో మంగళవారం కన్నుమూశారు. ఒక గొప్ప శకానికి ముగింపు పలికారు. చందమామకు 75 సంవత్సరాలు, శంకర్‌కు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా గతంలో సాక్షితో పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే...
‘‘మా స్వస్థలం కరత్తొలువు. ఇది కోయంబత్తూరు జిల్లాలో ఉంది. మా నాన్నగారు టీచర్. అందువల్లనేనేమో చిన్నప్పటి నుంచి అక్షరాలు అందంగా రాసేలా అలవాటు చేశారు. ఆ రోజుల్లోనే పాఠశాలల్లో అందరికీ మధ్యాహ్న భోజనం ఉండేది. జస్టిస్ పార్టీ వాళ్లు అందరికీ ఎంత తింటే అంత భోజనం పెట్టించేవారు. నా పదవ యేట చెన్నై వచ్చాను చదువుకు. ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తయ్యాక మా గురువులు నాతో ‘నువ్వు మామూలు చదువుల వైపు కాకుండా ఫైన్ ఆర్ట్స్‌లో చేరు’ అన్నారు. అప్పట్లో ఆ స్కూల్‌ని బ్రిటీషువారు నడుపుతున్నారు. నేను ఆయన చెప్పినట్లే చిత్రలేఖనంలోకి వెళ్లాను. నా శ్రద్ధ చూసి, పాఠశాల వారు నాకు స్కాలర్‌షిప్ మంజూరు చేశారు. దాంతో నేను ముందు తరగతులు చదువుకోవడానికి వీలుపడింది.
చందమామలో బొమ్మలు
1940లో చందమామ ప్రారంభమైతే 1952లో నాగిరెడ్డిగారి పిలుపు మేరకు 300 రూపాయల జీతానికి చేరాను. అంతకు ముందు వేరొక తమిళ మ్యాగజీన్‌లో పనిచేశాను. తెలుగు, తమిళం, ఇంగ్లీషు భాషలలో తగినంత పరిజ్ఞానం ఉండటం వల్ల పని సులువుగా చేసుకోగలిగాను. గత 60 సంవత్సరాలుగా అందులోనే పని చేస్తున్నాను. నాకు ఆధ్యాత్మికత ఎక్కువ. భక్తి కూడా ఎక్కువ. అదే సంస్థలో ఆరు దశాబ్దాలు పాటు పనిచేయడం నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. నా తుదిlశ్వాస వరకు చందమామలోనే ఉండాలనేది నా ఆకాంక్ష మాత్రం నెరవేరకుండా గత సంవత్సరం ఈ పత్రిక మూతపడింది.
విక్రమ్ భేతాళ్...
1955లో చక్రపాణి, కుటుంబరావుగార్లు తెలుగులో బేతాళ కథలకు బొమ్మలు వేయమని అడిగారు. అప్పటివరకు వస్తున్నవాటిని మార్చి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి బొమ్మలు గీయమని సూచించారు. అది పిల్లల కథే అయినప్పటికీ చాలా పెద్ద విజయం సాధించింది. ఈ కథలకు నేను 700 బొమ్మలు వేశాను.
పిల్లల ఆలోచనా ధోరణి ఆరోగ్యకరంగా ఉండేలా చేసేందుకు చందమామ నాకు అవకాశం ఇచ్చింది. నేను, చిత్ర, వపా... మా బొమ్మల ద్వారా గత ఆరుతరాలుగా ఇంటింటా నిలిచిపోయాం.
ఆనందంగా ఉంటుంది...
కథలకు బొమ్మలు వేసి ఆ బొమ్మల ద్వారా కథను సజీవం చేయడానికి మించిన ఆనందం ఇంకేముంటుంది. పురాణాలకు సంబంధించి ఇప్పటికి వేలకొలది బొమ్మలు వేశాను. చాలామంది నేను వేసిన రాముడు, కృష్ణుడు బొమ్మలను వారి వారి పూజా మందిరాలలో పెట్టుకున్నామని చెబుతుంటే ఎంతో పరవశంగా అనిపిస్తుంది. చందమామను మీరే కాదు, మీ తల్లిదండ్రులు, తాతలు కూడా తప్పనిసరిగా చదివి ఉంటారని నా అభిప్రాయం. కేవలం ఐదారు వేలతో ప్రారంభమైన చందమామ సర్క్యులేషన్ లక్షల స్థాయికి చేరి ఒక వెలుగు వెలిగింది.
మరచిపోలేని అనుభవాలు ఎన్నో...
ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల గ్రామంలో ఒక చదువురాని స్త్రీ ‘చందమామ కారణంగా చదవడం, రాయడం నేర్చుకున్నాను’ అని చెప్పింది. ఒరిస్సాలో ఒక గొర్రెల కాపరి ఒక వెదురుబొంగులో చందమామ పుస్తకాన్ని భద్రపరిచాడట. అతడికి ఎప్పటికైనా నేను వేసినట్లుగా బొమ్మలు వేయాలని కోరికట. చందమామ గురించి కవిసమ్రాట్, ‘చందమామ నా చేత కూడా చదివిస్తున్నారు. పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా’ అని ఒక సందర్భంలో అన్నారంటే చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల పెద్దల మనసులో ఎంత స్థానం సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. చందమామ నా బిడ్డ. ఈ పత్రిక ఆగిపోవడంతో బిడ్డను చంపేసినట్టుగా ఉంది. ప్రపంచంలో ఇన్ని భాషలలో వచ్చిన పత్రిక ఇదొక్కటే. అవార్డులు, రివార్డులు ప్రభుత్వాల నుంచి అందుకోలేదు కాని, ప్రజల ప్రశంసలు మాత్రం లెక్కలేనన్ని అందుకున్నాను. ఆ అనుభూతులు నేను ఎన్నటికీ మరచిపోలేను.’’
– సంభాషణ:
డా. పురాణపండ వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment