చందమామ చిత్రకారుడు శంకర్
పిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో తాతయ్యో, బామ్మో/అమ్మమ్మో ఇతర పెద్దలో పిల్లలకు పురాణాలలోని కథలు వాళ్ళకు తెలిసినంతవరకూ చెబుతూ ఉంటే ఆయా పురాణ పాత్రలు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తుంది? ఎవరి ఊహల్లో వాళ్ళు అనుకోవటం తప్ప వేరే అవకాశం లేదు. కానీ, చందమామలో శంకర్ గారి బొమ్మలు చూస్తూ పెరిగిన బాలలకు పురాణ పాత్రలను ఊహించుకోవలసిన కష్టం లేదు. చదివిన పది వాక్యాల కంటే, ఒక బొమ్మ విషయాన్ని పిల్లలకు అద్భుతంగా చెబుతుంది. తాను బొమ్మలు వేస్తున్నది, పిల్లలకోసం అని ఎంతో శ్రద్ధాసక్తులతో ఆ బొమ్మలు వేసేవారు. కథ చదివిన తక్షణం ఆయా పాత్రల వివరాలు చక్కగా తెలిసిపోయేవి. పురాణాల పాత్రలను పిల్లలకే కాదు పెద్దలకు కూడా కళ్ళకు కట్టిన ఘనత ఒకే వ్యక్తిది. ఆ వ్యక్తే మనందరకూ సుపరిచితమైన శంకర్‌గారు.
చందమామలో వచ్చిన రామాయణం, మహా భారతం సీరియల్స్‌కి వేసిన బొమ్మలతో పౌరాణిక పాత్రలకు దివ్యత్వం కలిగించిన గొప్ప ఆర్టిస్టు శంకర్‌గారని అప్పట్లోనే కొడవటిగంటి కుటుంబ రావుగారు చెప్పారు. రాజకుమార్తెల నిసర్గ సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రించిన శంకర్‌గారు రాక్షస పాత్రలను కూడా అంతే సుందరంగా చిత్రించారు. ఉదాహరణకు రామాయణంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు పాత్రలు మచ్చుకు మాత్రమే. చందమామలో చేరింది మొదలుకుని 2012 చివరి వరకు దాదాపు 60ఏళ్లు పాటు చిత్రాలు గీస్తూనే వచ్చిన మాన్య చిత్రకారుడు శంకర్‌గారు.
ఆయన వేసిన బొమ్మలు అన్నీ ఒక ఎత్తు ఐతే, బేతాళ కథలకు శీర్షిక బొమ్మగా వేసిన బొమ్మ ఒక ఎత్తు. ఆయన వేసిన ఒక బొమ్మ ప్రపంచ ప్రసిధ్ధి పొందింది. అదే బేతాళ కథలకు ప్రత్యేక శీర్షిక బొమ్మగా విక్రమార్కుడు చేతిలో కరవాలం భుజాన శవాన్ని మోసుకుంటూ వెడుతూ ఉంటే, శవంలోని బేతాళుడు కథ చెప్పటం మొదలుపెడతాడు. నాకు తెలిసి తెలుగు పత్రికా చరిత్రలో అతి ఎక్కువకాలం ధారావాహికగా కొనసాగిన శీర్షిక చందమామలో బేతాళ కథలే. చందమామలో చివరివరకూ ఆయన వేసిన బేతాళ బొమ్మనే కొనసాగించారు.కథలోని వివరాలే కాక, పిల్లలకు ఆ పాత్ర లక్షణాలు తెలియటానికి అనేక ఇతర వివరాలు కూడా చొప్పించేవారు. దాంతో ఆయన బొమ్మలతో కథలకు పరిపూర్ణత్వం వచ్చేది.
అంతేకాక, బొమ్మలు చక్కగా చెక్కినట్టు, రూప లావణ్య విశేషాలతో ఉండటం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆయన జానపద కథలకు వేసిన బొమ్మల్లో అలనాటి కట్టడాలు, అప్పటివారి దుస్తులు, వాడుకలో ఉన్న అనేక పరికరాలు పాత్రలు వగైరా ఎంతో శ్రద్ధగా చిత్రీకరించేవారు. నిజానికి శంకర్‌గారు వేసిన పురాణ సంబంధిత బొమ్మల్లో ఆయన చిత్రీకరించిన భవనాలు, ఆభరణాలు వంటివి నాటి తెలుగు పౌరాణిక సినిమాలలో వేసిన సెట్టింగ్‌లకు ప్రేరణ అంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, పిల్లలకు పురాణాలు, పురాణ గాథలు దగ్గిర చేయటంలో, శంకర్ గారి చిత్రాలు ఎంతగానో తోడ్పడ్డాయి. శంకర్ గారి మరణంతో అలనాటి పిల్లలు తమ నేస్తాన్ని కోల్పోయారు. వారికి మోక్ష ప్రాప్తి కలుగుగాక.
మంగళవారం కన్నుమూసిన శంకర్‌గారి వయస్సు 97 సంవత్సరాలు, తన అసలు పేరు కరథొలువు చంద్రశేఖరన్ శివశంకరన్. చందమామ చిత్రకారుడిగా శంకర్‌గా పరిచయం. ఆయన 1924, జూలై 24న ఈరోడ్‌లోని ఓ గ్రామంలో జన్మించారు. 12వ తరగతి పూర్తయ్యాక, మదరాసులోని ఆర్ట్స్ కాలేజీలో చేరి తనకు స్వతహాగా అబ్బిన బొమ్మలు వేసే శక్తిని ఇనుమడింపచేసుకున్నారు. మొదటి ఉద్యోగం 1946లో కళైమాగళ్ అనే పత్రికలో. తరువాత 1952లో చందమామలో చిత్రకారునిగా చేరి, చివరివరకూ చందమామలోనే బొమ్మలు వేశారు. చివరిక్షణాల్లోనూ, చందమామలో తాను వేసిన బొమ్మలనే తలచుకుంటూ ఆ బెంగతోనే ఆయన మరణించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
కె. శివరామప్రసాద్
వ్యాసకర్త రిటైర్డ్ మేనేజర్, కెనరా బ్యాంక్
మొబైల్ : 91676 03720
Comments
Please login to add a commentAdd a comment