
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, ‘చందమామ’శంకర్‌గా పేరొందిన కరథొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ (97) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో ఉన్న కరథొలువు గ్రామంలో 1924 జూలై 24న శంకర్ జన్మించారు. తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవారు. తల్లి గృహిణి. శంకర్‌కు నలుగురు సోదరు లు. చిన్నప్పటి నుంచే చిత్రాలు గీయడంలో ఆసక్తి పెంచుకున్న శంకర్ పన్నెండవ తరగతి పూర్తయ్యాక చెన్నైలోని ఆర్ట్ కాలేజీలో చేరారు.
అక్కడ తనలోని చిత్రకారునికి మెరుగులు దిద్దుకున్నారు. ఆ తర్వాత 1946లో కళైమాగల్ అనే పత్రికలో తొలిసారి చిత్రకారునిగా కొలువులో చేరారు. అనంతరం 1952లో ‘చందమామ’లో చేరి, 2012లో ఆ పత్రిక మూతపడేవరకూ దాదాపు 60 ఏళ్ల పాటు అందులోనే పనిచేశారు. తన అద్భుత చిత్రాలతో చందమామ కథలను పాఠకుల కళ్లముందు సాక్షాత్కరింపచేశారు.
పురాణ పాత్రలకు సజీవరూపం..
చిత్రకారునిగా శంకర్ వేలాది చిత్రాలకు జీవం పోశారు. రామాయణం, మహాభారతం వంటి పురాణాలకూ ఆయన అద్భుత చిత్రాలు వేశారు. అయితే, ఆయనకు బాగా పేరు తెచ్చింది మాత్రం చందమామలో బేతాళ కథలకు రూపొందించిన చిత్రాలే. శంకర్ చందమామలో చేరేటప్పటికే అక్కడ మరో ఇద్దరు ప్రసిద్ధ చిత్రకారులు ‘చిత్రా’రాఘవులు, వడ్డాది పాపయ్య ఉన్నారు. సాధారణంగా పిల్లలకు ఇంట్లో తాతయ్యో, అమ్మమ్మో పురాణాలు, కథలు చెప్పడం మామూలే. అయితే, వాటిలోని పాత్రధారులు ఎలా ఉండేవారో ఎవరికి తెలుసు? ఊహించుకోవడం తప్ప వేరే మార్గం లేదు.
కానీ, ‘చందమామ’లో శంకర్ బొమ్మలు చూస్తూ పెరిగిన వారికి పురాణపాత్రలు టక్కున కళ్లముందు మెదులుతాయి. అంత అద్భుతంగా ఆ పాత్రల చిత్రాలను ఆయన మన కళ్లముందు ఉంచారు. ఆయన వేసిన బొమ్మలు అన్నీ ఒక ఎత్తయితే, బేతాళ కథలకు వేసిన శీర్షిక చిత్రం ఒక ఎత్తు. విక్రమార్కుడు ఒక చేతిలో కరవాలం పట్టుకొని, భుజంపైన శవాన్ని మోసుకుంటూ వెళుతున్నట్లుండే ఆ చిత్రం శంకర్‌కు ఎంతో పేరు తెచ్చింది. అంతేకాదు, పురాణగాథలకు శంకర్ చిత్రీకరించిన భవనాలు, ఆభరణాలు, సినిమాల్లో ఎన్నో సెట్టింగ్‌లకు ప్రేరణ అంటే అతిశయోక్తికాదు.
Comments
Please login to add a commentAdd a comment