హిందీలో పాట రాయడం ఆమెకు ఇష్టం. బాణీ కట్టి పాడడం అంతకంటే ఇష్టం. స్వచ్‌భారత్... నిర్భయ... ఆమె రాసిన సామాజికాంశాల గేయాలు. ఇప్పుడు.. ‘కామధేను అయోగ్’.. గోమాత కోసం ఆమె రాసి పాడిన పాట. మొత్తం రెండు వందల పాటలు రాశారు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేశారు. జీవితం అంటే బాధ్యత అంటారు. అది చెప్పడానికి గ్రామాల బాటపట్టారు. నేల కోసం, రైతు కోసం పని చేస్తున్నారు.
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మళ్లీ భోజనం, ఈ మధ్యలో చిరుతిళ్లు.. రోజులో ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా మనిషి తప్పనిసరిగా చేసే పని చక్కగా భుజించడం. ఆరోగ్యం పట్ల ఆకాంక్ష పెరిగితే ఒకరకమైన భోజనం, జిహ్వ మీద మమకారం పెరిగితే మరో రకమైన భోజనం... ఏది ఏమైనా పొట్ట పూజ మాత్రం తప్పదు. దేహం నడవాలంటే ఇంధనం కావాల్సిందే, కాబట్టి తినడం తప్పనిసరి. మరి ఈ భోజనం మన కంచంలోకి రావడానికి బీజం ఎక్కడ పడుతోంది. పొలాన్ని పలకగా చేసుకుని విత్తనాలనే బీజాక్షరాలుగా మార్చుకుని జీవిత గ్రంథాలను రాసుకుంటున్న రైతుకు దక్కాల్సిన గౌరవం దక్కుతోందా? ఇదే ప్రశ్న తనను తాను వేసుకున్నారు మోటూరి సూర్యకళ. దక్కడం లేదని ఆమె ఘంటాపథంగా చెబుతున్నారు. పన్నెండేళ్ల సామాజిక సేవా జీవితంలో ఆమె ఎందరి అనుభవాలనో ప్రత్యక్షంగా చూశారు.
ఎన్నో రకాల సవాళ్లను చూశారు. వాటన్నింటికీ సమాధానంగా ‘మన ఊరు – మన బాధ్యత’ అనే వేదికకు రూపకల్పన చేశారు. అందులో భాగంగానే రైతు యువకుల కోసం ‘వివాహ పరిచయ వేదిక’ను రూపొందించారు. సమాజంలో ఇప్పటికే కులాల ప్రాతిపదికగా, మతాల ప్రాతిపదికగా, ఆస్తిపాస్తులు సంపన్నతల ప్రాతిపదికగా ఎన్నో వివాహ వేదికలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇన్ని ఉండగా రైతుల కోసం మరొక వేదిక అవసరం ఉంటుందా అంటే... తప్పని సరిగా ఉందన్నారు సూర్యకళ. ‘‘రైతు అనే వ్యక్తి ఉన్నాడని, వ్యవసాయం అనే ఒక రంగం ఉందని మన సమాజం మర్చిపోయింది. పూట పూట మనం మంచిగా తినాలి, కానీ ఆ పంటను పండించే రైతును గుర్తించడం లేదు’’ అని తనకు ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకున్నారు.
అంతరం ఉంది!
‘మన ఊరు– మన బాధ్యత’లో భాగంగా అనేక గ్రామాల్లో పర్యటించాను. ఎంతోమంది తో స్వయంగా మాట్లాడాను. కాలేజ్‌లో చదువుకుంటున్న ఆడపిల్లలు రైతులకు దక్కని గౌరవాల గురించి చెప్పిన మాట నాకు ఆవేదన కలిగింది. వాళ్ల నాన్న కాలేజ్‌కి వెళ్తే... లెక్చరర్లు ఏ మాత్రం పట్టించుకోరట. పైగా నేలపై కూర్చుని ఎదురు చూడాలట. అదే కాలేజ్‌లో చదువుతున్న ఇతర విద్యార్థుల నాన్నలు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ ప్యాంటు షర్టుల్లో వస్తే.. వారి పట్ల అత్యంత గౌరవంగా వ్యవహరిస్తారట. సమాజం ఇలా ఉంది కాబట్టే... మా అమ్మానాన్నలు మమ్మల్ని రైతుకిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడం లేదు. చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న అబ్బాయిలతో వివాహం చేయాలనుకుంటున్నారు.. అని చెప్పారా అమ్మాయిలు. పంచె కట్టుకునే రైతుకి, ప్యాంటు షర్టు వేసుకున్న గుమాస్తాకి మధ్య సమాజం పెద్ద అంతరాన్నే సృష్టించింది.
సమాజం సృష్టించిన అంతరాన్ని ఆ అమ్మాయిలు చిన్న వయసులోనే గ్రహించగలిగారు. ఇక పట్టణాలు, నగరాల్లో పెరిగిన వాళ్లకయితే రైతు కూడా మనిషేననే గుర్తింపు కూడా ఉండడం లేదు. నేల మీద నిలబడి వ్యవసాయం చేసే వాడికి వెన్నెముక ఉంటుంది, ఉద్యోగం చేసే వ్యక్తికంటే మించిన వ్యక్తిత్వం రైతు యువకుడిలో కూడా ఉంటుందనే గమనింపు ఉండడం లేదు. అందుకే రైతు యువకుల వివాహం కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశాను. అబ్బాయిలు తమ వివరాలతోపాటు వాళ్ల పొలం, కుటుంబం, తన ఆశయాలు, ఆకాంక్షలను వివరిస్తూ వీడియో రికార్డు చేసి మాకు పంపిస్తారు. ఆ వీడియోను నిపుణులతో ఎడిట్ చేయించి డిజిటల్ వేదిక మీద అప్‌లోడ్ చేస్తున్నాను’’ అని వివరించారు సూర్యకళ.
గోమాత.. భూమాత
మోటూరి సూర్యకళ గుర్తించిన సమస్య మనలో చాలామందికి తెలిసినదే. అయినా ఎవరూ పని గట్టుకుని స్పందించలేదు. ఆ పని ఆమె చేశారు. ఆమె చిన్నప్పటి నుంచి గ్రామాల గురించి తెలిసి పెరగలేదు. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టారు. పదమూడేళ్ల వయసులో కొత్త నగరానికి మారింది వాళ్ల కుటుంబం. ఇంటర్ చదువుతూ చిన్న పిల్లలకు హోమ్ ట్యూషన్‌లు చెప్పేవారామె. ఆ తర్వాత దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఇరవై ఏళ్ల పాటు హైదరాబాద్‌లో అనేక కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం చేశారు. ఆ ఉద్యోగంతోపాటు గత పన్నెండేళ్లుగా అనేక ఎన్‌జీవోలతో కలిసి పని చేశారు. నాలుగేళ్ల నుంచి గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణ శాఖ అధ్యక్షురాలిగా సమాజహితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు తనకు వచ్చిన ఆలోచనకు ‘మన ఊరు– మన బాధ్యత’ అని నామకరణం చేసి దేశమంతటినీ అందులో భాగస్వాములను చేస్తున్నారు.
దివ్యాంగుల కోసం జాతీయ స్థాయి డాన్స్ టాలెంట్ షో, రాబోయే దీపావళి కోసం గోమయంతో ప్రమిదల తయారీలో శిక్షణ, గో ఉత్పత్తుల తయారీలో శిక్షణ వంటివి ఆమె చేపట్టిన కొన్ని కార్యక్రమాలు. వీటన్నింటితోపాటు ఆమె... రైతు యువకుల వివాహ పరిచయ వేదిక ద్వారా సమాజంలో అందరి మనసుల్లో పెద్ద అగాధంగా స్థిరపడిపోయిన అంతరాన్ని తొలగించడానికి కంకణం కట్టుకున్నారు. మనిషిని జీవితాంతం కాపాడేవి గో ప్రాశస్త్యం, భూ సస్యత్వం అంటారు సూర్యకళ. ‘‘ప్రతి ఒక్కరిలోనూ సామాజిక బాధ్యత ఉంటుంది. అయితే అది కొన్ని విషయాల్లో నిద్రాణంగా ఉండిపోతుంది. ఆ నిద్రపోతున్న బాధ్యతను తట్టిలేపే ప్రయత్నమే ఇది’’ అన్నారామె.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment