రావణుడికి ఎన్ని తలలు? పది. బ్రహ్మకు? నాలుగు.. మరి, గొంగళి పురుగుకు..? ఒకటి..! ఇక్కడే పప్పులో కాలు వేశారు. అందరూ అనుకున్నట్లు గొంగళి పురుగుకు ఒక తల కాదు, ఐదు తలలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే వాటిని ఉంచుకుంటాయి. చాలావరకు వదిలేస్తుంటాయి. కారణం, అవి చచ్చిన తలలు కాబట్టి. గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకోక చిలుకగా మారుతుందనే విషయం తెలిసిందే. అలా రూపాంతరం చెందే ముందు మరో పదమూడు రూపాంతరాలు చెందుతుందట.
ఇలా ఈ రూపాంతరం చెందే ప్రతిసారి వాటి పాత చర్మాన్ని వదిలి.. కొత్త చర్మాన్ని ధరిస్తాయి. ఈ క్రమంలోనే వాటి తల భాగం కూడా మారుతుంది. మారే తలను కొన్ని గొంగళి పురుగులు ఓ టోపీలా వాటి తలపైనే పెట్టుకుంటే, కొన్ని వదిలేస్తుంటాయి. అలా సుమారు ఐదు తలల వరకు ధరించగలవు. ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన ఉరాబా లూజెన్స్ జాతికి చెందిన గొంగళి పురుగులు ఇలా చేస్తాయి. వీటికి ‘మ్యాడ్ హాటర్‌పిల్లర్’ అని పేరు. ఇతర జీవుల నుంచి తమని తాము పెద్దదిగా చూపిస్తూ, భయపెట్టడానికి కొన్ని ఈ తలల టోపీని ధరిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఇవి ఎక్కువ కాలం నిలువవని, విరిగిపోతాయని, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమని వారు అంటున్నారు. ఏది ఏమైనా, ఈ హ్యాటర్ పిల్లర్‌గా భలే బాగుంది కదూ!
చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!
Comments
Please login to add a commentAdd a comment