‘గుడ్ మార్నింగ్ సర్. నా పేరు సురేష్. సాక్షి ఫన్ డే లో వస్తున్న ‘సై కాలం’ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నా. రకరకాల మానసిక సమస్యలు, వాటి లక్షణాలు, వాటినెలా పరిష్కరించుకోవాలి అనే విషయాల మీద చాలా బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అసలు ఒక మనిషికి మానసిక సమస్య ఉందో లేదో గుర్తించడం ఎలా? అనే టాపిక్ కూడా రాస్తే బాగుంటుంది సర్’ అంటూ మొన్నా మధ్య ఒక కాల్ వచ్చింది. ఆ సూచన విలువైందిగా తోచింది. అందుకే ఈ వారం ఆ అంశం గురించే తెలుసుకుందాం!
సమస్య, రుగ్మత వేర్వేరు
సురేష్‌లానే చాలామందికి మానసిక సమస్యల గురించి ప్రాథమిక అవగాహన కూడా ఉండదు. ఎవరి ప్రవర్తనైనా కొంచెం తేడాగా కనిపించగానే గుళ్లూ, గోపురాలకు తిప్పేస్తారు. యజ్ఞాలూ,యాగాలూ, శాంతి పూజలూ చేయిస్తారు. లేదా మంత్రగాళ్ల దగ్గరకు తీసుకువెళ్తారు. వాటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే మానసిక సమస్యలు, రుగ్మతల మధ్య తేడా అర్థం చేసుకోవాలి. రోజువారీ ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, సర్దుబాటులో సమస్యలు, కోపం, విచారం, చదువులో, ఉద్యోగంలో ఇబ్బందులు లాంటివి మానసిక సమస్యలు. ఇవి తాత్కాలికం. యాంగ్జయిటీ, డిప్రెషన్, బైపోలార్, ఫోబియా, స్కిజోఫ్రీనియా లాంటివి మానసిక రుగ్మతలు. ఇవి దీర్ఘకాలం ఉంటాయి.
సహానుభూతి ఉంటే చాలు..
మానసిక వ్యాధి ఉందా లేదా అని అంచనా వెయ్యడానికి సరిపడా మానసిక నిపుణులు మన దేశంలో అందుబాటులో లేరు. అందువల్ల సహానుభూతి, మంచిగా వినే నైపుణ్యం ఉన్నవారెవరైనా ప్రాథమిక అంచనా వేయవచ్చు. అయితే మానసిక వ్యాధి ఉన్నవారితో మాట్లాడాలంటే చాలామంది జంకుతారు. కారణం.. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి అనగానే చాలామందికి ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడే, శుభ్రత లేని వ్యక్తి గుర్తొస్తాడు. అతనితో మాట్లాడితే తిడతాడేమో, కొడతాడేమో అని భయపడతారు. కానీ మానసిక అనారోగ్యం ఉన్నవారు కూడా మామూలు వ్యక్తులే. వారితో మాట్లాడినందువల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదని గుర్తించండి.
ఎలా మాట్లాడాలి?
‘మీకేదో మానసిక సమస్య ఉన్నట్లుంది’ అని మొదలుపెడితే ఎవరైనా నొచ్చుకుంటారు. కాబట్టి వారితో మాట కలిపేందుకు.. ఈ మధ్య పత్రికల్లో వచ్చిన వార్త లాంటి మామూలు విషయంతో మొదలు పెట్టండి. ఆ తర్వాత అతని స్థానంలో మిమ్మల్ని ఊహించుకుని, అతని బాధను, సామాజిక, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోండి. దీన్నే సహానుభూతి అంటారు. వీలైనంత వరకు ఆ వ్యక్తి బంధువులెవరూ అక్కడ లేకుండా చూసుకోండి. కొంతమంది తమకు మానసిక సమస్య ఉందని ఒప్పుకోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి సమాచారం సేకరించండి. శారీరక జబ్బుతో ఉన్న వ్యక్తితో ఎంత సహానుభూతితో మాట్లాడతామో, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తితో కూడా అంతే సహానుభూతితో వ్యవహరించాలి.
ఏం చెయ్యాలి?
మానసిక సమస్య లక్షణాలు కనిపించగానే మానసిక వ్యాధి ఉందని నిర్ధారణకు రాకూడదు. ఆ వ్యక్తితో మాట్లాడి లక్షణాలు ఎన్నాళ్ల నుంచి ఉన్నాయి, జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవాలి. అతని సామాజిక, ఆర్థిక, సంబంధ బాంధవ్యాల వివరాలు, సమస్యల గురించి ఆరా తీయాలి. వీటి ద్వారా ఆ వ్యక్తి ఎందుకు మానసిక సమస్యతో బాధపడుతున్నాడో అర్థం చేసుకోగలుగుతారు. ఆ వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నాడని మీకు అనిపిస్తే వెంటనే దగ్గర్లోని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి. వారు అతనితో మరింత లోతుగా మాట్లాడి, సైకో డయాగ్నసిస్ ద్వారా రుగ్మతను నిర్ధారిస్తారు. అవసరమైన సహాయం అందిస్తారు.
అడగాల్సిన ప్రశ్నలు..
- రాత్రిపూట నిద్ర పట్టడంలో ఏదైనా సమస్య ఉందా? · రోజువారీ పనులు చేయడంలో ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తోందా?
- కొద్దికాలంగా విచారంగా, జీవితంలో సంతోషమే లేనట్లుగా అనిపిస్తోందా? · దేని గురించైనా భయభ్రాంతులకు లోనవుతున్నారా?
- మరీ ఎక్కువగా మద్యం తాగుతున్నారని బాధపడుతున్నారా? · మద్యం లేదా మాదక ద్రవ్యాల కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు?
- వీటిలో ఏ ప్రశ్నకైనా ‘అవును’ అని సమాధానం చెప్తే, మరింత సమయం వెచ్చించి మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
రుగ్మతను గుర్తించే లక్షణాలు..
- ఏ శారీరక వ్యాధికీ సంబంధంలేని బాధల్ని చెప్పడం · మానసిక వ్యాధికి సంబంధించిన వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర ఉండటం
- డిప్రెషన్ లేదా మద్యపాన సంబంధమైన మానసిక సమస్య ఉందని నేరుగా చెప్పడం
- మద్యపాన వ్యసనం లేదా గృహహింస లాంటి ప్రత్యేక కారణాలు
- వైవాహిక, లైంగిక సమస్యలు · దీర్ఘకాల నిరుద్యోగం, సన్నిహిత వ్యక్తి మరణం, జీవితం సమస్యలమయం కావడం
- అతీంద్రీయ శక్తులు ఉన్నాయని అనుమానించడం.
--సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment