తన ముగ్గురు కుమారులతో విన్‌హోల్డ్(PC: Kennedy News and Media Via Metro)
మాతృత్వపు మధురిమలను ఆస్వాదించాలని కోరుకోని మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను ప్రపంచంలోకి తీసుకువస్తుంది తల్లి. అందుకోసం ఎంతటి బాధనైనా పంటిబిగువన భరిస్తుంది. పొత్తిళ్లలో చిన్నారిని చూసుకోగానే తాను పడిన ప్రసవ వేదనను మరిచిపోతుంది.
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన కారా విన్‌హోల్డ్ కూడా అలాంటి కోవకు చెందిన వారే! అయితే, ఇప్పటికే ఒక కుమారుడికి జన్మనిచ్చిన ఆమె.. తనకు తెలియకుండానే కవలలకు ప్రాణం పోశారు. వారిని ఈ లోకంలోకి తీసుకువచ్చారు. ఎన్నో అబార్షన్ల తర్వాత దక్కిన ఈ రెట్టింపు సంతోషంతో విన్‌హోల్డ్ దంపతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అసలేం జరిగింది?
వాషింగ్టన్ పోస్ట్, మెట్రో కథనాల ప్రకారం.. విన్‌హోల్డ్, ఆమె భర్త 2018లో ఓ బాబుకి జన్మనిచ్చారు. తమ కుటుంబాన్ని మరింతగా విస్తరించుకోవాలని భావించిన ఆ జంట.. మరో సంతానం కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో 2019లో విన్‌హోల్డ్ గర్భం దాల్చడంతో ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు.
అనారోగ్య కారణాల రీత్యా ఆమెకు గర్భవిచ్చిత్తి అయింది. 2020లోనూ ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆరోగ్యంపై కూడా ఈ అబార్షన్లు తీవ్ర ప్రభావం చూపాయి. అయినప్పటికీ మరో బిడ్డను కనాలన్న ఆ తల్లి మనసు నిరాశ చెందలేదు.
ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో విన్‌హోల్డ్ మరోసారి గర్భవతి అయింది. అన్నీ సజావుగా సాగడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూడసాగింది. అయితే, ఊహించని విధంగా ఏడు వారాల తర్వాత తన కడుపులో మరో శిశువు ఎదుగుతున్నట్లు డాక్టర్లు ఆమెకు చెప్పారు. గర్భం దాల్చిన నెల రోజుల తర్వాతే మరో ప్రెగ్నెన్సీ రావడంతో ఇది సాధ్యమైందని వైద్యులు చెప్పడంతో విన్‌హోల్డ్ దంపతులు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె కవలలకు జన్మనిచ్చారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
(PC: Kennedy News and Media Via Metro)
కారణం ఏమిటి?
కారా విన్‌హెల్డ్‌కు తెలియకుండానే కవలలు జన్మించడానికి కారణం సూపర్‌ఫెటేషన్. హెల్త్‌లైన్ జర్నల్ ప్రకారం.. ఒకేసారి విడుదలైన రెండు అండాలు వేర్వేరు సమయాల్లో(వారాల వ్యవధి) ఫలదీకరణం చెందితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. దీనినే వైద్య పరిభాషలో సూపర్‌ఫెటేషన్ అంటారు.
ఎప్పుడూ నిరాశ చెందలేదు.. అయితే ఇలా!
‘చాలా మంది పిల్లల్ని కనాలని.. వారితో అమ్మా అని పిలిపించుకోవాలని నాకు ఆశగా ఉండేది. గర్భస్రావాలు అయినప్పటికీ నేను పూర్తి ఆశావాద దృక్పథంతోనే ఉన్నాను. కచ్చితంగా ఇది జరిగి తీరుందని నమ్మాను. అమ్మగా నా ప్రయాణంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుసు.
అయినా ఏనాడు నిరాశ చెందలేదు. ఇప్పుడు నా కల నెరవేరింది’’ అని విన్‌హోల్డ్ వాషింగ్టన్ పోస్ట్‌తో వ్యాఖ్యానించారు. తన జీవితంలో అద్భుతం జరిగిందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
కాగా విన్‌హోల్డ్‌కు కవలలుగా ఇద్దరు కుమారులు జన్మించారు. ఆరు నిమిషాల తేడాతో ఈ భూమ్మీదకు వచ్చిన ఆ బుజ్జాయిలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ముగ్గురు కుమారుల అల్లరితో ఈ దంపతుల ఇల్లు ఇప్పుడు ఎంతో సందడిగా ఉంది. ఇక గర్భవతికి మరో ప్రెగ్నెన్సీ అంటూ విన్‌హోల్డ్ జీవితంలోని ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్..
Comments
Please login to add a commentAdd a comment