గాలి తర్వాత ప్రాణాధారం నీటిచుక్క. గొంతెండిపోతే నోట్లకట్టలు దాహం తీర్చవు. నీటి చుక్క కోసం... అర్రులు చాచాల్సి వస్తుంది. ధారపోయడానికి చేతిలో డబ్బున్నా సరే... నేలతల్లి కడుపులో చుక్క మంచి నీరుండదు. జాగ్రత్త పడదాం... భవిష్యత్తును కాపాడుకుందామని... దేశాన్ని చైతన్యవంతం చేస్తున్నారు వసంతలక్ష్మి.
‘‘2040 నాటికి నీటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? భావి తరాల కోసం ఆస్తులు కూడబెడుతున్నాం, బాగా చదివి పెద్ద ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించాలని వాళ్లకు నేర్పిస్తున్నాం. చేతి నిండా డబ్బు ఉండి గొంతు తడుపుకోవడానికి నీటి చుక్క లేని జీవితాలను పిల్లలకు అందిస్తున్నాం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే రాబోయే తరాలు కాదు కదా, మనతరమే నీటి ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
డబ్బు సంపాదనను వ్యసనంలాగ పిల్లల బుర్రల్లోకి ఎక్కించేస్తున్నాం, నీటి వృథాను అరికడదామని మాట మాత్రంగానైనా చెప్తున్నామా?’’ ఇలా సాగుతుంది వసంతలక్ష్మి ప్రసంగం. నీటి సంరక్షణ గురించి పాఠం చెప్తోందామె. నేడు వరల్డ్ వాటర్ డే సందర్భంగా తన నీటి ఉద్యమం వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
జలమే ధనం
‘‘వర్షాలొస్తే రోడ్లు జలమయం, ఎండకాలం మొదలయ్యే నెల నుంచే రోడ్ల మీద నీటి ట్యాంకుల స్వైరవిహారం. ఆ ట్యాంకర్లను చూస్తే డేంజర్ బెల్స్ మోగించుకుంటూ వెళ్తున్నట్లే అనిపించేది. మనిషి భవిష్యత్తు ఎంతటి ప్రమాదంలో పడుతుందోననే దిశలో నా ఆలోచన సాగడంతో అధ్యయనం మొదలుపెట్టాను. గణాంకాలు భయపెట్టాయి.
ఇదే ధోరణిలో నీటిని వృథా చేస్తుంటే మన తరమే నీటికోసం అల్లాడే రోజు వస్తుంది. అందుకే జలాన్ని మించిన ధనం మరొకటి లేదని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నాను. కశ్మీర్‌లో మొదలు పెట్టిన ‘జల్ ధన్ యాత్ర’ ఉత్తరాఖండ్, హరియాణా మీదుగా ఢిల్లీకి చేరింది. వరల్డ్ వాటర్ డే (మార్చి 22) పురస్కరించుకుని గుర్‌గావ్‌లో 20వ తేదీన అవగాహన సదస్సు నిర్వహించాం.
జలగండం!
నీటి గురించిన వివరాల్లోకి వెళ్లేకొద్దీ వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. మనదేశంలో మనిషి సగటున ఒక రోజుకి వృథా చేసే నీరు పదకొండు గ్యాలన్‌లుగా ఉంటోంది. జలపొరల్ని చీల్చుకుని మరీ తోడేస్తున్నాం. మహారాష్ట్రలో భూగర్భజలాలు మైనస్‌లోకి వెళ్లిపోయాయి. మూడు వందల అడుగుల వరకు నీటి చుక్క ఆనవాలుకు కూడా అందడం లేదు.
తమిళనాడులో ఒకప్పుడు 57 జీవనదులు ప్రవహించేవి. మనిషి భూమి ఆక్రమణ ఆకలికి నదులు కూడా బలయిపోయాయి. ఇప్పుడు ఐదారుకి మించి జీవనదుల్లేవక్కడ. మనకు నీటిని పొదుపు చేయడం, వృథాను అరికట్టడంలో విచక్షణ లేదు. అలాగే పరిశ్రమల వ్యర్థాల కారణంగా నీటి వనరులు కలుషితం కావడం గురించి ఏ మాత్రం ముందుచూపు లేదు.
ప్రజల్లో చైతన్యం ఉంటే పరిశ్రమలు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వెనుకాడతామయనేది నా అభిప్రాయం. పరిశ్రమల నిర్వహకులు తాము వాడిన నీటిని శుద్ధి చేసి భూమిలోకి వదలాల్సి ఉండగా, ఆ నియమాలేవీ పాటించకుండా నేలకు రంధ్రాలు చేసి వదిలేస్తున్నారు. దాంతో భూగర్భజలాలు కలుషితమైపోతున్నాయి. పంజాబ్‌లో ఒక రైలును స్థానికులు క్యాన్సర్ రైలని పిలుస్తారు.
ఆ రైలులో ప్రయాణించే వాళ్లలో... కలుషిత నీటిని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడిన వాళ్లు ఢిల్లీకి వైద్యానికి వెళ్లే వాళ్లే ఎక్కువని చెబుతారు. మనదేశంలో నీటి కాలుష్యానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి. ‘ఉదాసీనంగా ఉంటే రాబోయే తరాలు మనల్ని క్షమించవు. మేల్కోండి’ అని ఎలుగెత్తి చెబుతున్నాను’’ అని చెప్పారు సామాజిక కార్యకర్త చీరాల వసంతలక్ష్మి.
వాటర్ షెడ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వసంతలక్ష్మి గత ఏడాది ‘వాటర్ వారియర్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘జల్ ధన్ యాత్ర’ ద్వారా దేశవ్యాప్తంగా పర్య టించి గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విద్యార్థులు, మహిళలు, రైతులకు గణాంకాలతో సహా నీటి గురించి వివరిస్తున్నారు.
సామాజిక ‘స్నేహిత’
చీరాల వసంతలక్ష్మి పుట్టింది ఆంధ్రప్రదేశ్, నెల్లూరు నగరంలో. ‘అమ్మతనానికి అవమానం జరగకూడదు. బిడ్డలందరూ సమానంగా పుడతారు. ఏ బిడ్డా అన్‌వాంటెడ్ కాదు... కాకూడదు. ఆడపిల్లను వద్దంటే నాకివ్వండి... బతికిస్తాను’... ఈ ‘అమ్మ ఒడి’లో ప్రేమ ఉంది, ‘ఇదిగో ఊయల’... అని పాతికేళ్ల కిందట నగరంలో 27 ఊయలలు పెట్టారు. 87 మంది పిల్లలకు అమ్మ అయ్యారామె. ఆ ఊయలను ప్రభుత్వం చేపట్టింది, తమిళనాడులో జయలలిత ప్రభుత్వమూ అందుకుంది.
సమాజంలో తల్లులందరూ తమ పిల్లలను అనారోగ్యాల నుంచి సంరక్షించుకోగలిగిన అవగాహన కలిగి ఉండాలనే ఆశయంతో మొదలైన నా సేవలో ఏదీ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు. ఒక్కొక్కటిగా వచ్చి చేరుతూ నా బాధ్యతలను పెంచుతూ వచ్చాయి. జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వచ్చినప్పుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలంటే రిజిస్టర్ అయిన సంస్థ ఉండాలన్నారు. అలా నా సేవ 1998లో వ్యవస్థీకృతమైంది.
స్పెషల్ కిడ్స్ 150 మందిని దత్తత తీసుకున్నాను. వాళ్లతో డీల్ చేయడం కోసం నేను స్పెషల్ బీఈడీ చేసి వాళ్లకు ఎడ్యుకేటర్‌గా మారాను. అలాగే మహిళల సమస్యల గురించి పోరాడే క్రమంలో చట్టాలు తెలుసుకోవడానికి బీఎల్ చదివి... సేవలను ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించాను.
కరాటేలో బ్లాక్‌బెల్ట్, రైఫిల్ షూటింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్‌ని కావడంతో బాలికలు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కాలేజీ విద్యార్థినులు, స్వయం సహాయక బృందాల మహిళలు మొత్తం పదిహేను వేల మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రమాదాల బారిన పడకుండా కొన్ని మెళకువలు నేర్పించాను.
అలాగే చనిపోవాలనుకున్న వాళ్లకు ‘స్నేహిత’నయ్యాను. సర్వీస్ అనే ఉద్దేశంతో మొదలు పెట్టలేదు, కానీ ఎక్కడ అవసరం ఉందనిపిస్తే అక్కడ వాలిపోతూ నా ప్రయాణం నీటి సంరక్షణ దిశగా సాగుతోంది.
– సీహెచ్. వసంతలక్ష్మి. అడ్వొకేట్, వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్
– వాకా మంజులారెడ్డి
చదవండి: మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! బతుకుజీవుడా అని బయటపడ్డా!
Comments
Please login to add a commentAdd a comment