సామాజిక మాధ్యమాల్లో ‘యూట్యూబ్’ దారి వేరు. యూజర్లు తమ వీడియోలను పోస్ట్ చేయడానికి, ఇతరులు పోస్ట్ చేసిన వీడియోలను తిలకించడానికి అవకాశం కల్పించే వేదికగా పదిహేనేళ్ల కిందట ప్రారంభమైంది ‘యూట్యూబ్’. అనతి కాలంలోనే జనాదరణ పొందడంతో ఇంటర్నెట్ దిగ్గజం ‘గూగుల్’ దీనిని సొంతం చేసుకుంది. ‘గూగుల్’ చేతుల్లోకి వెళ్లాక ‘యూట్యూబ్’ మరింతగా విస్తరించింది. ప్రపంచం నలుమూలలా ఉన్న ఔత్సాహికులకు ఇది తమ ప్రతిభను చాటుకునే వేదికగా మారింది. వినోదమైనా, విజ్ఞానమైనా జనాలతో పంచుకోవడానికి ‘యూట్యూబ్’ ఈ తరానికి దొరికిన ‘ఆన్‌లైన్’ రహదారి. వీక్షకులను పెంచుకోగలిగితే ఇది చక్కని ఆదాయమార్గం కూడా. ‘యూట్యూబ్’ను వేదికగా చేసుకుని స్టార్‌డమ్ సాధించిన వారు తక్కువేమీ లేరు. అలాంటి స్టార్స్ మన దేశంలోనూ ఉన్నారు. వారిలో కొందరి సంక్షిప్త పరిచయం మీ కోసం...
క్యారీ మినాటీ: అజేయ్ నాగర్
‘యూట్యూబ్ ఇండియా’లో నంబర్ వన్ స్టార్ క్యారీ మినాటీ. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఈ కుర్రాడి అసలు పేరు అజేయ్ నాగర్. ‘యూట్యూబ్’లో మాత్రం క్యారీ మినాటీగానే ప్రసిద్ధుడు. భారత్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు గల యూట్యూబర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. ‘క్యారీ మినాటీ’, ‘క్యారీ ఈజ్ లైవ్’ పేరిట రెండు చానెళ్లు నిర్వహిస్తున్నాడు. పదేళ్ల వయసులోనే– అంటే 2009లోనే యూట్యూబ్‌లోకి అడుగు పెట్టినా, తన ప్రధాన చానెళ్లను మాత్రం 2014 నుంచి నిరంతరాయంగా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఇతడి చానెళ్లకు ఏకంగా రెండున్నర కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. చురుకైన హాస్యం, సునిశితమైన వ్యంగ్యం, వీడియో గేమ్స్‌లో నైపుణ్యం క్యారీ మినాటీ ప్రత్యేకతలు. ఇతడు రూపొందించిన ‘స్టాప్ మేకింగ్ అసంప్షన్స్: యూట్యూబ్ వర్సెట్ టిక్‌టాక్–ది ఎండ్’ అనే వీడియో శరవేగంగా వైరల్‌గా మారింది. నాన్‌మ్యూజిక్ వీడియోల్లో అత్యధిక లైక్స్ కూడా సాధించింది. అయితే, ఇందులోని వ్యంగ్యం కొందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ‘యూట్యూబ్’ ఈ వీడియోను తొలగించింది. ఇలాంటి ఒడిదుడుకులు ఎదురైనా, ఇప్పటికీ ఈ కుర్రాడు ‘యూట్యూబ్’లో తన జోరు కొనసాగిస్తూనే ఉన్నాడు.
భువనేశ్వర్ బామ్
బహుముఖ ప్రజ్ఞశాలి భువనేశ్వర్ బామ్. గుజరాత్‌లోని బరోడాకు చెందిన ఈ మరాఠీ కుర్రాడు హాస్యనటుడు, రచయిత, గాయకుడు, పాటల రచయిత. తనలోని నైపుణ్యాల ప్రదర్శన కోసం ‘యూట్యూబ్’నే వేదికగా చేసుకుని వీక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘యూట్యూబ్’లో కోటి మంది సబ్‌స్క్రైబర్లను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పిన ఘనత ఇతడిది. ‘బీబీ కీ వైన్స్’ పేరిట ఇతడు నిర్వహిస్తున్న చానెల్‌కు ప్రస్తుతం దాదాపు రెండు కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ తరం కుర్రకారు తీరుకు అద్దంపట్టేలా ఉండే ఇతడి కామెడీ వీడియోల కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు. తనలోని గానకళను ప్రదర్శించడానికి తరచుగా మ్యూజిక్ వీడియోలనూ పోస్ట్ చేస్తుంటాడు. రెండేళ్ల కిందట ‘టిటు టాక్స్’ పేరిట యూట్యూబ్ సిరీస్‌ను కూడా ప్రారంభించాడు. ఈ సిరీస్ తొలి అతిథిగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పాల్గొన్నాడంటే భువనేశ్వర్ బామ్ ప్రతిభ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
నిషా మధులిక
‘యూట్యూబ్’లోకి కాస్త లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినా, లే‘టేస్టు’ సంచలనంగా ముద్ర వేసిన మహిళ నిషా మధులిక. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె పెళ్లి తర్వాత ఢిల్లీలో స్థిరపడ్డారు. భర్త సాంకేతికరంగంలో వ్యాపారవేత్త. తన రంగంలో ఆయన బిజీ. ఇద్దరు పిల్లలు ఎదిగాక వారు వాళ్ల జీవితాల్లో బిజీ. ఈ పరిస్థితుల్లో నిషా మధులిక ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’కు లోనయ్యారు. ఒంటరి భావనను దూరం చేసుకోవడానికి మొదట తనకు తెలిసిన వంటలతో బ్లాగ్ ప్రారంభించారు. బ్లాగ్ సక్సెస్ కావడంతో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘అమర్ ఉజాలా’ వంటి పత్రికలకు వంటల కాలమ్స్ రాయడం మొదటు పెట్టారు. వీటితో ఆమెకు బాగా పేరొచ్చింది. ‘యూట్యూబ్’కు ఆదరణ పెరుగుతున్న రోజుల్లో– 2009లో ఆమె తన పేరుతోనే యూట్యూబ్ చానెల్ ప్రారంభించారు. శాకాహార వంటలు చేయడంలో మెలకువలను చెబుతూ ఆమె పోస్ట్ చేసే వీడియోలకు అనతి కాలంలోనే విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పుడామె చానెల్‌కు కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
కబితా సింగ్
‘యూట్యూబ్’లో వినోదభరితమైన వీడియోలకే కాదు, వంటల వీడియోలకు ఆదరణ ఎక్కువే. ఇదే అంశాన్ని పసిగట్టిన పుణేకు చెందిన షెఫ్ కబితా సింగ్, తన పాకకళా ప్రదర్శనకు ఆరేళ్ల కిందట ‘యూట్యూబ్’ను వేదికగా ఎంచుకున్నారు. ‘కబితాస్ కిచెన్’ పేరిట వంటల వీడియోలతో చానెల్ నిర్వహిస్తున్నారు. భారత్‌లో వంటల వీడియోలతో నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్స్‌లో కబితా సింగ్‌దే అగ్రస్థానం. ఆమె చానెల్‌కు ఇప్పుడు 87 లక్షల మందికి పైగానే సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ‘కబితాస్ కిచెన్ డాట్ కామ్’ పేరిట ఆమె సొంత వెబ్‌సైట్‌నూ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా భారతీయ వంటలతో పాటు అప్పుడప్పుడు ఇతర దేశాలకు చెందిన వంటల వీడియోలనూ ఆమె తన చానెల్‌లో పోస్ట్ చేస్తుంటారు.
నిశాంత్ చంద్రవంశి
ఢిల్లీలో స్థిరపడ్డ బిహారీ యువకుడు నిశాంత్ చంద్రవంశి సామాజిక కార్యకర్త, డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్‌ఈఓ) నిపుణుడు. ‘డిజిమానాకో’ పేరిట ఒక డిజిటల్ మార్కెటింగ్ సంస్థ, దానికోసం ఒక వెబ్‌సైట్‌నూ నెలకొల్పాడు. ఇదే పేరుతో యూట్యూబ్ చానెల్‌నూ నడుపుతూ, సామాజిక అంశాలను, డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌ఈఓ నైపుణ్యాలపై వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఢిల్లీ, పట్నాలలో ఉండే యువకులకు ఉచితంగా డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌ఈఓ అంశాలపై ఆన్‌లైన్ క్లాసులూ చెబుతుంటాడు. వైబ్‌సైట్లకు ట్రాఫిక్ పెంచుకోవడానికి అనుసరించాల్సిన చిట్కాలు, చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్‌లో ఉనికి చాటుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై నిశాంత్ చెప్పే వీడియో పాఠాలు యూట్యూబ్‌లో బాగా ఆదరణ పొందుతున్నాయి. అలాగే, దేశంలోని వివిధ చారిత్రక, భౌగోళిక అంశాలను, సామాజిక పరిణామాలను వివరిస్తూ రూపొందించే వీడియోలకు కూడా అభిమానులు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. నిశాంత్ యూట్యూబ్ చానెల్‌కు ఇప్పుడు కోటిమందికి పైగానే సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
సనమ్ పురి
మస్కట్‌లో పెరిగిన పంజాబీ కుర్రాడు సనమ్ పురి. అక్కడి ఇండియన్ స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు సనమ్ అన్న సమర్, అతడి క్లాస్‌మేట్ వెంకీ గిటార్ వాయించేవాళ్లు. ఇద్దరూ కలసి ఒక బ్యాండ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. పాడటానికి తానూ వాళ్లతో చేరాడు సనమ్. స్కూల్ చదువు పూర్తయ్యాక కాలేజీ చదువుల కోసం ఇండియాకు వచ్చేశారు. సనమ్, సమర్ ఢిల్లీకి చేరుకున్నారు. వెంకీ బెంగళూరు చేరాడు. సమర్ పాటలు రాసేవాడు. సనమ్ పాడేవాడు. వెంకీ బెంగళూరులోని వివిధ బ్యాండ్లతో కలసి గిటార్ వాయించేవాడు. సనమ్ కూడా సొంతగా పాటలు రాయడం మొదలుపెట్టాడు.
తాను రాసిన పాటలను తానే పాడుతూ రూపొందించిన వీడియోలతో పాటు పాత బాలీవుడ్ పాటలు పాడుతూ రూపొందించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ పదేళ్ల కిందటే యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. అనతికాలంలోనే పాపులర్ అయ్యాడు. మరో రెండేళ్లకు తన పేరిట సొంతగా బ్యాండ్‌ను కూడా ప్రారంభించాడు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సహకారంతో రూపొందించిన ‘యారా’ మ్యూజిక్ వీడియోకు విపరీతమైన జనాదరణ లభించింది. ఉర్రూతలూగించేలా సనమ్ పాడే పాటలకు, విలక్షణమైన అతడి మ్యూజిక్ ఆల్బమ్స్‌కు పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నారు. అతడి చానెల్‌కు ఇప్పుడు 1.10 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
తన్మయ్ భట్
స్టాండప్ కామెడీ షోలకు టీవీ చానెళ్లలో ఉన్న ఆదరణ తెలిసినదే. ముంబై యువకుడు తన్మయ్ భట్ స్వతహాగా హాస్యచతురుడు. మంచి నటుడు, రచయిత. తనలో ప్రతిభ ఉన్నా, తొలినాళ్లలో అవకాశాలు రాలేదు. ‘యూట్యూబ్’కి అప్పుడప్పుడే మన దేశంలో ఆదరణ పుంజుకుంటున్న రోజులవి. అవకాశాల కోసం వెదుక్కునే బదులు, వాటిని సృష్టించుకుంటేనే మేలని ఆలోచించి, 2006లో ‘ ఆనేస్టీ‍్ల బై తన్మయ్ భట్’ పేరుతో చానెల్ ప్రారంభించి, తన హాస్యాన్ని జనాలతో పంచుకోవడం మొదలుపెట్టాడు. తన్మయ్ కామెడీకి యూట్యూబ్ యూజర్లు త్వరలోనే అలవాటు పడ్డారు. విలక్షణంగా ఉండే అతడి స్కిట్‌లకు, హాస్య ప్రసంగాలకు ఆదరణ పెరిగింది. టీవీ అవకాశాలు వాటంతట అవే వెదుక్కుంటూ రావడం మొదలయ్యాయి. ‘యూటీవీ బిందాస్’లోని ‘హస్‌లే ఇండియా’కు స్క్రిప్ట్ రాసే అవకాశం దొరింది. టీవీ రంగానికి అదే తన్మయ్ తొలి పరిచయం. ఆ తర్వాత ‘డిస్నీ ఇండియా’ డెయిలీ కామెడీ సీరియల్స్‌కూ స్క్రిప్ట్ రాశాడు. అదే ఊపులో మరిన్ని టీవీ అవకాశాలనూ అందిపుచ్చుకున్నాడు. ఒకవైపు టీవీ అవకాశాలతో బిజీగా మారినా, తన యూట్యూబ్ చానెల్‌ను కొనసాగించడం మానలేదు. మరో ముగ్గురు మిత్రులతో కలసి ‘ఆలిండియా బ్యాక్‌చోద్’ పేరిట మరో యూట్యూబ్ చానెల్‌నూ ప్రారంభించాడు. తన్మయ్ యూట్యూబ్ చానెల్‌కు ఇప్పుడు దాదాపు 2.40 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ఇలాంటి వారి స్ఫూర్తితోనే ఎందరో ఔత్సాహికులు యూట్యూబ్‌లోకి అడుగుపెడుతున్నారు. తమ ప్రతిభను అందరితోనూ పంచుకుంటున్నారు. ఇందులో ప్రతిభ నిరూపించుకునే వారికి అవకాశాలకు కొదవలేదు. నిబంధనలకు లోబడి సొంత కంటెంట్‌తో వీడియోలను పెడుతూ కొనసాగితే, ఇది చక్కటి స్వయం ఉపాధి మార్గం కూడా. కేవలం యూట్యూబ్‌నే నమ్ముకుని స్వయం ఉపాధిని పొందుతున్న వారు కూడా మన దేశంలో చాలామందే ఉన్నారు. ఇంకెందరో ఔత్సాహింకులు ఇందులోకి అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
సందీప్ మహేశ్వరి
వ్యాపారరంగంలో పడి లేచిన కెరటం సందీప్ మహేశ్వరి. ఈ ఢిల్లీ యువకుడు బీ కామ్ చదువుతుండగానే మోడలింగ్ చేసేవాడు. డిగ్రీ పూర్తయ్యాక ఫొటోగ్రఫీపై ఆసక్తితో ఫొటోగ్రఫీలో కోర్సు చేశాడు. మోడలింగ్‌లో రాణించాలనుకునే ఔత్సాహికులకు పనికొచ్చేలా ‘మాష్ ఆడియో విజువల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ ప్రారంభించాడు. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్నవారి పోర్ట్‌ఫోలియోలు రూపొందించేవాడు. మోడలింగ్ రంగంలో వేధింపులను తట్టుకోలేక మోడలింగ్‌కు దూరమయ్యాడు. ‘మాష్ ఆడియో విజువల్స్’ ఒకవైపు బాగానే నడుస్తుండగా, 2002లో ఇంకో కంపెనీ పెట్టాడు. ఆరునెలల్లోనే ఆ కంపెనీ దివాలా తీసింది. ఇది అతనికి కోలుకోలేని దెబ్బ. తిరిగి తేరుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. ఫొటోగ్రఫీ నైపుణ్యాన్నే నమ్ముకుని 2006లో ‘ఇమేజెస్ బజార్’ ప్రారంభించాడు. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టే ఔత్సాహికులు ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కుదేలైపోకుండా, తిరిగి నిలదొక్కుకునేలా వారిని ప్రోత్సహించేందుకు ఏదైనా చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనతోనే తన పేరుతో యూట్యూబ్ చానల్ పెట్టి, మోటివేషనల్ స్పీకర్ అవతారమెత్తాడు. వ్యాపార చిట్కాలతో పాటు నిరాశను పారదోలేలా ఉండే ప్రసంగాలకు త్వరలోనే పెద్దసంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడతని చానెల్‌కు కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment