భారతదేశ శక్తి సామర్థ్యాలు, అది సాధించిన ఘనత నన్ను ఎంత గానో ఆకట్టుకున్నాయి. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న ఉప ఖండం అత్యంత క్లిష్టమైన సమ యంలో ఆరోగ్య సవాళ్లను అధిగ మించి తన సత్తాను చాటింది. 100 కోట్ల డోసుల కోవిడ్-19 టీకాలు వేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఇదే అత్యంత వేగంగా సాగిన అతిపెద్ద టీకా కార్యక్రమం. ఇప్పటివరకూ దేశంలో 75 శాతా నికి మించి పెద్ద వాళ్లకు సింగిల్ డోస్, 31 శాతం మందికి పైగా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఇందులో 48 శాతానికి మించి మహిళలున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనాను నిర్మూలించడంలో భారత్ టీకా కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుంది. భారత్ సాధించిన విజయంలోని మౌలిక అంశాలను ఇతర దేశాలు కూడా అనుసరించాలి. మొదటిది-పైనుంచి కింది స్థాయి వరకు రాజకీయ సంకల్పం బలంగా పనిచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం డిసెంబరు 2021 నాటికి అర్హులైన పెద్దవాళ్లందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయి నాయకత్వాల వరకూ ప్రధాని ఇచ్చిన లక్ష్యానికి స్పందించి పని చేస్తున్నారు. 2020 లోనే హై పవర్ కమిటీలు వేసి రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు.
రెండోది– దేశానికి ఉన్న సుదీర్ఘ అను భవం, అవగాహన, మౌలిక వసతులను ఉప యోగించుకుని కోవిడ్‌పై పోరాటానికి ప్రచారం చేసింది. భారతదేశపు రోగనిరోధక కార్యక్రమం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజారోగ్య కార్య క్రమాల్లో ఒకటి. ఏటా 2 కోట్ల 70 లక్షలమంది నవజాత శిశువులకు, 1 నుంచి 5 ఏళ్ల మధ్య ఉండే 10 కోట్ల మంది చిన్నారులకు బూస్టర్ టీకా డోసులు ఇస్తుంటారు. దేశవ్యాప్తంగా దాదాపు 27 వేల కోల్డ్ చెయిన్ సదుపాయాలు న్నాయి. మహమ్మారి సమయంలో, ఈ మౌలిక సదుపాయాలే కీలకంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,48,000 ప్రభుత్వ, 28,000 ప్రైవేటు సెంటర్లు కోవిడ్ టీకాలు వేస్తున్నాయి. దీంతోపాటు 23 లక్షల మంది ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు అందరికీ చేరేలా కీలక పాత్ర పోషిస్తున్నారు.
మూడోది– వాస్తవానికి మహమ్మారి కంటే ముందే తన టీకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు భారత్ నిలబెడుతోంది. ముఖ్యంగా మెనైంజైటస్, నిమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు అందిస్తోంది. భారతదేశంలోని టీకా ఉత్పత్తిదారులైన సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్, బయో–ఈ వంటి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నందుకు మా ఫౌండేషన్ కూడా ఎంతో గర్వపడుతోంది. ఇప్పుడు కోవిషీల్డ్, కోవాగ్జిన్ ద్వారా భారతీయులను కోవిడ్ నుంచి కాపాడుకుంటున్నాం. మేం కూడా ‘జీఏవీఐ’తో కలిసి సీరమ్‌లో కోవిషీల్డ్ ఉత్పత్తి పెంచేందుకు సహకరించాం. ఇంకా కొన్ని అను మతులు రావాల్సి ఉంది. వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద, మధ్య తరగతి దేశాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
నాలుగోది– భారతదేశం తన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో మానిటర్ చేయడం కూడా విజయవంతం కావ డానికి మరో కారణం. కోవిన్ ఓపెన్ సోర్స్ ఫ్లాట్‌ఫాం ద్వారా ట్రాక్ చేయడంతో పాటు, షెడ్యూలింగ్ చేయగలిగారు. పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు కూడా ఆన్‌లైన్ ద్వారా అందించారు. దీని ద్వారా ఇన్‌ఫెక్షన్ ధోరణులను విశ్లేషించగలిగారు. ఈ ప్రక్రియను దేశంలోని ఇతర ఆరోగ్య కార్యక్రమాలకు కూడా విస్తరించడానికి అవకాశాలున్నాయి.
ఐదవది-ఏ ప్రజారోగ్య కార్యక్రమం అయినా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకం. గతంలో పోలియో నిర్మూలనా కార్య క్రమం విజయవంతం చేసిన అనుభవంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని సమీకరించడంపై దృష్టి పెట్టాయి. స్థానికంగా ప్రభావితం చేయ గలిగే వ్యక్తులు, సంస్థలను భాగస్వామ్యం చేశాయి. డిజిటల్ స్ట్రాటజీ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, స్థానిక ప్రభుత్వాలను ఉత్సాహపరిచి డిమాండ్ సృష్టించారు.
వ్యాక్సిన్ ఉత్పవాలు, మహోత్సవాల పేరుతో ప్రజల్ని చైతన్య పరిచారు. ప్రపంచవ్యాప్తంగా మరెంతో మంది ప్రజలకు టీకాలు అందేవరకూ మహమ్మారి మన వెనకే ఉందన్న విషయం మరిచిపోరాదు. నిరుపేద దేశాల్లో 3 శాతం లోపు ప్రజలకే ఇప్పటికి టీకా చేరువైంది. అదీ సింగిల్ డోస్ మాత్రమే. ఇంకా భారీ సంఖ్యలో వేగంగా టీకాలు ఉత్పత్తి చేయా ల్సిన అవసరం ఉంది. భారతదేశం ఈ విషయంలో ముందుంది. వ్యాక్సిన్ మైత్రి, కొవాక్స్ రూపంలో పేద దేశాలకు ఎగుమతి చేస్తోంది.
ఇండియా ఒక ఆశ కల్పించింది. సంక్షోభ సమయాల్లో దేశాలు ఏం చేయగలవో చేసిచూపింది. బలమైన నాయకత్వం, ఆరోగ్య రంగంలో నిలకడగా పెట్టుబడి పెట్టడం, పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, తమ ప్రజలను అనారోగ్యం నుంచి కాపాడుకోవాలన్న ఆశయం కనిపించాయి. గడిచిన 18 నెలల్లో జరిగిన విషాదాలను, కష్టాలను తలుచుకుని బాధపడి ఏమీ చేయలేము. కానీ రానున్న 18 నెలలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉండగలమని నిరూపించాలి.
బిల్ గేట్స్ కో–చైర్‌పర్సన్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment