కార్పొరేట్‌ సాగు మన సంస్కృతికి విరుద్ధం | Buddiga Zamindar Article Against Corporate Farming | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ సాగు మన సంస్కృతికి విరుద్ధం

Published Tue, Dec 8 2020 1:11 AM | Last Updated on Tue, Dec 8 2020 1:15 AM

Buddiga Zamindar Article Against Corporate Farming - Sakshi

‘ప్రపంచంలోని 70 శాతం పంటపొలాలలో గడ్డి బీడులను, పండ్లతోటలను ఒక్క శాతం బడా రైతాంగం (కార్పొరేట్లు) మాత్రమే వ్యవసాయం నిర్వహిస్తూ, ప్రకృతి సంక్షోబాలకు కారణమవుతూ సేద్యంలో అసమానత ప్రభావానికి కారకులవుతున్నారని’, ఆక్స్‌ఫామ్, ప్రపంచ అసమానతలపై అధ్యయనం చేస్తున్న సంస్థలతో కలిసి పనిచేసిన అంతర్జాతీయ భూముల అధ్యయన కేంద్రం పరిశోధనలలో తేలింది. 1980 నుండి వ్యవసాయ పొలాల నిర్వహణ పరోక్షంగా కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా కేంద్రీకృతమైందని అధ్యయన కేంద్ర ప్రతినిధి వార్డ్‌ అన్యూన్‌ తెలిపారు. కాంట్రాక్టు వ్యవసాయం ద్వారా చిన్న, మధ్య తరగతి రైతులను నిర్లక్షం చేస్తూ ఏకపంట సాగుచేస్తుండటంతో భూసారం తగ్గుతూ, జీవవైవిధ్యం నశిస్తున్నది. కార్పొరేట్లు ప్రవేశపెడుతున్న ఈ ఏకపంటల విధానంతో పంజాబ్, హరియాణా రైతులను పెప్సీ, ఐటీసీ కంపెనీలకు బంగాళదుంప, టమాటా తప్ప వేరే పంటలు పండనీయడంలేదు. కనీసం 10 లక్షల ఎకరాలు కాంట్రాక్టు వ్యవసాయానికి సేకరించారు.

పెరుగుతున్న భూమి విలువతోపాటు, భూమిని కోల్పోతున్న రైతులను మొదటిసారిగా పరిగణిస్తే ఇప్పటివరకు నమ్మిన దానికంటే 41 శాతం ఎక్కువని నివేదిక తెలియజేస్తున్నది. స్వల్పకాల లాభాలే ధ్యేయంగా కార్పొరేట్‌ వ్యవసాయం చేయడంతో ప్రపంచ వాతావరణం పైనా, ప్రజారోగ్యంపైనా ప్రతికూల ప్రభావం కల్గిస్తున్నది. పర్యావరణం, మహమ్మారులతో వ్యవసాయం ముడిపడి ఉండటంచేత ఇప్పుడు ప్రజల జీవితంలోని ప్రతీ అంశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన దేశంలో 6 శాతం ధనిక రైతుల దగ్గర 51 శాతం భూమి అధీనంలో ఉంది. 5 నుండి 10 ఎకరాలు ఉన్న రైతుల దగ్గర దేశంలోని మొత్తం సాగుభూమిలో సుమారు 10 శాతం ఉంది. 5 ఎకరాల లోపు రైతులు మొత్తం రైతాంగంలో 85 శాతం వరకూ ఉండగా, మొత్తం భూమిలో తమ వాటాగా వీరు 37 శాతం మాత్రమే కలిగిఉన్నారు, వీరిలో 23 శాతం దారిద్య్రపు రేఖ దిగువన ఉన్నారు. భూస్వాములు, పెద్ద రైతుల భూమిని 70 శాతం కౌలురైతులే సాగుచేస్తున్నారు.

ఆసియా, ఆఫ్రికా రైతాంగం చిన్నకమతాలను కలిగిఉన్నారు. ఇక్కడి వ్యవసాయం తక్కువ సమయంలో లాభార్జనే ధ్యేయంగా కాకుండా భూసారాన్ని భావితరాలకోసం పరిరక్షిస్తుంటారు. ప్రపంచం మొత్తంలో 80 నుండి 90 శాతం చిన్నకమతాల పొలాలు రైతుకుటుంబాలు మొత్తంగా గానీ లేక రైతుచే సాగుచేయబడుతూ వుండగా, నానాటికీ ఈ కమతాల సంఖ్య కార్పొరేట్‌ వ్యవసాయానికి బలైపోతూ కుచిం చుకుపోతోంది. గత 40 ఏళ్లనుండి అమెరికా, యూరపులో కార్పొరేట్‌ వ్యవసాయానికి రైతాంగం బలైపోతూ... వ్యవసాయ పెట్టుబడి నిధులకోసం, కఠినమైన ఒప్పందాలతో సాగుచేయవల్సి వస్తోంది. నేల నాణ్యత క్షీణిస్తూ. ఎరువులు,  క్రిమిసంహారకాలు అపరిమితంగా వాడటంతోపాటు, అడవులను నరుకుతూ పర్యావరణ సమస్యలు సృష్టిస్తున్నారు.

మెరుగైన పర్యావరణ నిర్వహణ కోసం, రైతాంగ గిట్టుబాటు వ్యవసాయం కోసం చిన్న, మధ్య తరగతి రైతాంగం కోసం, నిబంధనలలో మార్పులు తీసుకొచ్చి, కమ్యూనిటీ రైతులకు కూడా మద్దతును ప్రభుత్వం ప్రకటించాలి. పన్నులు తగ్గించి, ప్రభుత్వ సబ్సిడీలు పెంచి నేరుగా రైతుకే చేరే అవకాశం కల్పించాలి. రైతు గర్వపడే భూ హక్కును కాపాడాలి. చిన్న రైతులు, రైతుకుటుంబాలు, స్వదేశీ ప్రజలు భూమిని సాగుచేయడంలో చాలా జాగ్రత్తలతో మెలకువ వహిస్తారు. కేవలం పెట్టుబడి రాబట్టడానికేగాక రైతుగా గుర్తింపుకోసం, తమ సంస్కతిని భావితరాలు కొనసాగించటం కోసం వ్యవసాయాన్ని చేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం పర్యావరణాన్ని కాపాడుతూ, సగటు సెంటుభూమిలో ఎక్కువ ఉత్పాదకత చేస్తారు. ఈ విధానాన్ని కార్పొరేట్‌ వ్యవసాయం చేయలేదు.

ప్రకృతిని, నేలను నమ్ముకున్న రైతాంగంలా కార్పొరేట్‌ వ్యవసాయం సాగు జరగదు. తన లాభాల కోసం కంపెనీలను మార్చినట్లుగా వ్యవసాయం నుండి కార్పొరేట్‌రంగం తప్పుకొంటుంది, భూమిని మాత్రం తన వద్దనే ఉంచుకొని పొలాలను బీళ్లుగా మార్చుతుంది. దీనితో ఆహారభద్రతకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రజానీకానికి పట్టెడన్నం పెట్టే రైతును దూరం చేసుకోవద్దు. నేడు ప్రపంచంలో 140 కోట్ల ప్రజలు ప్రత్యక్షంగా భూమిపై ఆధారపడి ఆహారం, వసతిని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు, వీరిని మనం రక్షించుకోవాలి. ఇటువంటి రైతాంగం అభద్రతకు గురవుతున్న కారణం చేతనే చలిని సైతం లెక్కచేయక, కార్పొరేట్‌ అనుకూలచట్టాలకు వ్యతిరేకంగా రాజధానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. 
వ్యాసకర్త: బుడ్డిగ జమిందార్‌, ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరమ్‌ అధ్యక్షులు

మొబైల్‌ : 98494 91969

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement