భారతీయ ప్రాచీన సాహిత్యంలో రైతుకు, వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యతా లేదన్నది వాస్తవం. కౌటిల్యుడు, మనువు ఈ దేశంలోని వ్యవసాయదారులను మనుషులుగా కూడా వ్యవహరించడానికి వీలులేని శూద్రులుగా తోసిపుచ్చారు. ప్రస్తుత నూతన వ్యవసాయ చట్టాలు కూడా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వ్యవసాయ వ్యతిరేక తాత్వికతనే ప్రతిబింబిస్తున్నాయి. మహాత్మా జ్యోతిరావు ఫూలే సేద్యానికి, రైతుకు ప్రాధాన్యతను ఇచ్చిన తొలి శూద్ర చింతనాపరుడు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణతోనే రైతుల ఆందోళన నిలిచిపోయినట్లయితే ఎలాంటి మార్పూ సంభవించదు. రైతుల పిల్లలు మంచి ఇంగ్లిష్ విద్యను పొందుతూనే హరప్పా నాగరికత కాలం నాటి వ్యవసాయ ప్రాధాన్యత నుంచి మన ప్రాచీన భారత నాగరికతను తిరిగి అక్కున చేర్చుకోవలసి ఉంది.
తమ ఆత్మగౌరవాన్ని, తరతరాలుగా చేస్తూవస్తున్న వృత్తి భవిష్యత్తును కాపాడుకోవడానికి భారీ స్థాయిలో రైతులు ఆందోళన జరుపుతున్న నేపథ్యంలో పాలక ఆరెస్సెస్ భావజాలం.. దాని వాణిజ్య అనుకూల సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి లేశమాత్రంగా అయినా అవకాశం ఉందా? 1925 నుంచి ఆర్‌ఎస్‌ఎస్ సాంస్కృతిక హిందుత్వ జాతీయవాద విధాన పత్రాల కేసి చూసినట్లయితే, వ్యవసాయ అభివృద్ధి విధానాన్ని శాస్త్రీయంగా రూపొందించిన దాఖలాను అవి ఏమాత్రం చూపించవు. ఒక సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్.. సారాంశంలో వ్యవసాయ వ్యతిరేకతను పుణికిపుచ్చుకున్న మనుధర్మం, కౌటిల్యుడి అర్థశాస్త్ర భావజాలానికి సంబంధించిన బలమైన సైద్ధాంతిక మూలాలను కలిగివుంది. ఆధునిక కాలంలో సావర్కర్, గోల్వాల్కర్ తమ రచనల ద్వారా కౌటిల్యుడు, మనువు పరంపరను కొనసాగించారు.
ఇస్లాం వ్యతిరేతను నిలువెల్ల పుణికిపుచ్చుకున్న భావజాలంతో హిందుత్వ ప్రాపంచిక విధానం వ్యవసాయ వ్యతిరేకతను నిగూఢంగా పొందుపర్చుకుంది. జాతీయవాదం పేరిట తమ భావజాలాన్ని నిర్మించుకున్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తిని ముందుకు తీసుకుపోవడం వారి చర్చల క్రమంలో ఎన్నడూ భాగం కాలేదు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని అఖిల భారత జమాత్–ఇ–ముస్లిమిన్ లేక జమాత్ ఇస్లామ్ హింద్ నేతృత్వంలోని వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏ మత సంస్థకైనా లేక మత రాజకీయ పార్టీకైనా.. వ్యవసాయ ఉత్పత్తి, రైతుల ప్రయోజనంపై దృష్టి సారించిన చరిత్ర లేదు. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీలే భారతదేశాన్ని ఏలుతూ, రైతు వ్యతిరేక చట్టాలను రూపొందిస్తున్న తరుణంలో వీరి చరిత్రను మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
పాంచజన్య, ఆర్గనైజర్ వంటి ఆరెసెస్ సిద్ధాంత పత్రికలను కానీ, వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వంటి వాటి పరిశోధనా సంస్థల కార్యకలాపాలను కానీ గమనించిన ఎవరికైనా సరే భారతీయ వ్యవసాయంపై వీరు ఎన్నడూ దృష్టి సారించినట్లు కనబడదు. వీరు ఎల్ల ప్పుడూ ద్వేషిస్తూ ఉండే చైనాతో (అది కమ్యూనిస్టు దేశమైనా కాకున్నా సరే..) పోటీ పడేలా వ్యవసాయంలో సానుకూల సంస్కరణ, అభివృద్ధి తీసుకురావటం పట్ల వీరు ఎన్నడూ దృష్టి పెట్టలేదు. కౌటిల్యుడు, మరింత అధికంగా మనువు ఈదేశంలోని వ్యవసాయదారులను మనుషులుగా కూడా వ్యవహరించడానికి వీలులేని శూద్రులుగా తోసిపుచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ కానీ, దాని రాజకీయ విభాగమైన బీజేపీ కానీ ఆ భావజాలంతో ఎన్నడూ తెగతెంపులు చేసుకోలేదు. ప్రస్తుత నూతన వ్యవసాయ చట్టాలు కూడా వారి వ్యవసాయ వ్యతిరేక తాత్వికతనే ప్రతిబింబిస్తూండటం గమనార్హం.
ప్రధాని నరేంద్రమోదీ కానీ, అమిత్ షా కానీ తమ నిఘంటువులోనే లేని ప్రగతిశీల వ్యవసాయ తాత్వితతను ఎలా ముందుకు తీసుకొస్తారు? చిన్నదైనా, పెద్దదైనా వాణిజ్య అనుకూల విధానమే వారి పరంపరగా ఉంటోంది. ఢిల్లీలో అధికారం స్వీకరించిన కొన్నేళ్లలోనే ఆ పరంపర మార్పుచెందుతుందా? ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీల నియంత్రణలో ఉన్న ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ఆహార ఉత్పత్తిదారుల వ్యతిరేక తాత్వికతను కలిగి ఉన్న మనుధర్మ నుంచి కాస్తయినా పక్కకు తొలగడానికి సంసిద్ధత చూపడం లేదు. ఆనాడు ప్రధాన ఆహార ఉత్పత్తిదారులుగా ఉన్న శూద్రుల గురించి మనువు ఏం చెప్పాడో చూడండి. వ్యవసాయంలో వారి కృషిని ఎన్నడూ మనువు ఒక శ్రమగా గుర్తించలేదు. 1. 123. బ్రాహ్మణులకు సేవ చేయటం ఒక్కటే శూద్రుడి అద్భుతమైన వృత్తిగా ప్రకటించడమైనది. దీనికి వెలుపల శూద్రులు ఎలాంటి పని చేసినా అది ఫలితాలను ఇవ్వకపోవచ్చు. 2. 129. శూద్రుడికి శక్తి ఉన్నప్పటికీ అతడు సంపదను సృష్టించకూడదు. శూద్రుడు సంపదను కలిగి ఉండటం బ్రాహ్మణుడిని నొప్పిస్తుంది.
హిందుత్వ శక్తులు ఎన్నడూ అద్యయనం చేసి ఉండని చైనాలో, క్రీస్తు పూర్వం 770, 221 మధ్య కాలంలో వ్యవసాయప్రాధాన్యతా వాదం (అగ్రికల్చరిజం) అనే ప్రాపంచిక తత్వం ఉనికిలో ఉండేది. ఈ తాత్వికతకు ప్రాతినిధ్యం వహించిన ప్రధాన తత్వవేత్త జు జింగ్ (372–289 బీసీఈ). ప్రజల ప్రవృత్తి, ఇచ్ఛ అనేవి ఏ ఇతర వృత్తికంటే వ్యవసాయంమీదే ఆధారపడి ఉంటాయన్నది ఇతని ప్రధాన సిద్ధాంతం. క్రీస్తు పూర్వం మూడు, నాలుగు శతాబ్దాల నాటికి చైనా సమాజం పశుపాలన నుంచి బయటపడి ఈ అగ్రికల్చరిజం దన్నుతో వ్యవసాయ ఉత్పత్తివైపు అడుగేసింది. జూ జింగ్ తాత్విక రంగంలో వ్యవసాయదారుడిని ’పవిత్రమైన రైతు’గా భావించేవారు. మత గురువుల కంటే పవిత్ర రైతుకే అత్యధిక విలువ ఇచ్చేవారు.
వ్యవసాయ వ్యతిరేక తత్వశాస్త్రమైన బ్రాహ్మనిజం కారణంగానే భారతదేశంలో రైతులకు ఏనాడు అలాంటి ప్రాధాన్యత లభించలేదు. వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలీని బ్రాహ్మణ రుషికి వ్యవసాయ సమాజంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. వీరికి ఎన్నడూ తాత్విక, గౌరవనీయ పవిత్ర స్థానాన్ని దక్కనీకుండా చేశారు. శూద్రులు తమవైన వ్యవసాయ ఆధ్యాత్మిక విధులను నిర్వర్తించేవారు కానీ వీరి దేవతలకు బ్రాహ్మణ సాహిత్యంలో ఎలాంటి విలువా చూపేవారు కాదు. బ్రాహ్మణిజం శూద్రులను బానిసలుగా వ్యవస్థీకరించి వారిని ఉద్దేశపూర్వకంగా విద్యకు దూరం చేయడంతో వీరి తాత్విక అభివృద్ధి కూడా నిలిచిపోయింది. బ్రాహ్మణులు రూపొం దించిన వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, మను ధర్మశాస్త్రం వంటివాటిలో వ్యవసాయానికి కించిత్ చోటు లేదు. కానీ భారతదేశంలోని ప్రతి రచయితా వీటినే భారతీయ నాగరికత, సంస్కృతికి ఆకరాలుగా భావిస్తూ వచ్చేవారు.
కానీ ఈ పుస్తకాల్లో ఏ ఒక్కటీ వ్యవసాయ ప్రాధాన్యత గురించి చాటిన పాపాన పోలేదు. ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ భావజాలమైన భారతీయ సాంస్కృతిక వారసత్వం వ్యవసాయం నుంచి తీసుకున్నది కాదు. అసలు వ్యవసాయాన్ని సంస్కృతిలో భాగంగానే వీరు గుర్తించలేదు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్ది వరకు మన దేశంలోనూ వ్యవసాయం కాస్త అభివృద్ధి చెంది వ్యవసాయ ఉత్పత్తి ఒకమేరకు ప్రారంభమైన కాలంలోనే వ్యవసాయ ఉత్పత్తిని కించపరుస్తూ కౌటిల్యుడు అర్ధశాస్త్రం, మనువు ధర్మశాస్త్రం రాశారు. కులాన్ని ఆచరించే రుషులను, సన్యాసులను భారతీయ సంస్కృతి వారసత్వానికి సంబంధించి తిరుగులేని నమూనాగా బ్రాహ్మణవాదం ప్రోత్సహిస్తూ వచ్చింది. కానీ వీరికి ఉత్పత్తిలో, వ్యవసాయంలో ఏ పాత్రా లేదని గమనించాలి.
శూద్ర రైతులను తమదైన ప్రత్యామ్నాయ చింతనను ఏర్పర్చుకోవడానికి కూడా అనుమతించలేదు. 19వ శతాబ్ది మధ్య కాలంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే వ్యవసాయానికి, రైతుకు ప్రాధాన్యతను ఇచ్చిన మొట్టమొదటి శూద్ర చింతనాపరుడు. శూద్రులకు తాత్విక స్థాయి లేకుండా చేశారని, వారిని బానిసల స్థాయికి కుదించి వేశారని పూలే గుర్తించారు. బానిసగానే ఉన్నంత కాలం ఏ శూద్రుడు కూడా తన సొంత తాత్విక దృక్పథాన్ని నిర్మించుకోలేడు. కాబట్టే పూలే శూద్ర రైతుకు కేంద్ర స్థానమిచ్చి ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం రచించారు. అయితే ఫూలేకి నిరంతరం రచనలు చేస్తూ, తాత్విక దృక్పథాన్ని నిర్మించగల చారిత్రక వారసత్వం లేనందున గతకాలపు చైనా ప్రాపంచిక దృక్పథం వంటి పూర్తి స్థాయి వ్యవసాయ ప్రాధాన్యతా వాదాన్ని ఆయన పెంపొందించలేకపోయారు. వ్యవస్థీకృతంగా రాయకుండా, ఎలాంటి ప్రాపంచిక దృక్పథం కూడా అభివృద్ధి చెందదు.
ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ శక్తులు పూలే వ్యవసాయ తాత్వికతను పురోగమన స్థాయికి అనుమతించకుండా వేదవాడనే కొనసాగిస్తూ వచ్చాయి. కాబట్టి వేదకాలానికి ముందటి వ్యవసాయ ప్రాధాన్యతా వాదాన్ని తిరిగి కనిపెట్టడం ద్వారా మన నిజమైన ప్రాచీన మూలాలపై చర్చను తప్పక కొనసాగించాలి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణతోనే రైతుల ఆందోళన నిలిచిపోయినట్లయితే ఎలాంటి మార్పూ సంభవించదు. ప్రభుత్వ పాఠశాలల్లో రైతుల పిల్లలు మంచి ఇంగ్లిష్ విద్యను పొందుతూనే హరప్పా నాగరికత కాలం నాటి వ్యవసాయ ప్రాధాన్యత నుంచి మన ప్రాచీన భారత నాగరికతను తిరిగి అక్కున చేర్చుకోవలిసి ఉంది. అలాగే మన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు భారతీయ వ్యవసాయ ప్రాధాన్యతను ఆధిక్యతలో ఉంచుతూ పునర్నిర్మాణం చెందటం అవసరం. వ్యవసాయ రంగంలో ఉన్నతమైన అభివృద్ధి, మెరుగైన మార్కెట్ దిశగా అలాంటి మార్పును ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ శక్తులు వ్యతిరేకించినట్లయితే, యూనివర్శిటీల్లోని రైతాంగ యువత నాయకత్వంలో నిజమైన అజాదీ కోసం సమరం ప్రారంభమవడం ఖాయం.
వ్యాసకర్త
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
ఇంగ్లిష్ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత,
సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment