భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బ్రిటన్.. ఇలా అన్ని చోట్లా వైరస్ కొత్తరకాలు పుట్టుకొస్తున్నందున కోవిడ్ వైరస్ ఇక ఏమాత్రం ఊహాత్మకమైన, అనిశ్చయకరమైన ప్రమాదం కానేకాదు. వ్యాక్సిన్‌ల విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ మేధో సంపత్తి నిబంధనలను వెంటనే మాఫీ చేయాలని వంద దేశాలు కోరుతున్నాయి. డబ్ల్యూటీఓ ఒప్పందంలోని ఈ అడ్డంకులను తాత్కాలికంగా నైనా తొలగిస్తే టీకాలు ఉత్పత్తికి, పంపిణీకి చట్టబద్ధ వెసులుబాటు కలుగుతుంది. టీకా తయారీదారులు తమ గుత్తాధిపత్యాన్ని, లాభాలను కొనసాగించడం వల్లనే వ్యాక్సిన్‌లకు కొరత ఏర్పడుతోంది. ప్రజల ప్రాణాలకంటే ఔషధ కంపెనీల లాభాలు ఎక్కువ కాదు, కాకూడదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కోవిడ్–19 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేశారు. వారికి ప్రాథమికంగా మద్దతు అందించిన ప్రభుత్వాలకు కృతజ్ఞత చెప్పాలి. అయితే వ్యాక్సిన్ ప్రయోజనాలు అందరికీ అందాలి. ప్రజల ప్రాణాల కంటే ఔషధ కంపెనీల లాభాలు ఎక్కువ కాదు. వైరస్ ఎక్కడ పుట్టుకొచ్చినా అంతటా వ్యాప్తి చెందుతుంది. కొత్త వ్యాప్తి వల్ల టీకాలను కూడా లెక్కచేయని ఎస్.ఏ.ఆర్.ఎస్ కోవిడ్–2 వేరియంట్ పుట్టుకొస్తుంది. మళ్ళీ మనందరినీ లాక్‌డౌన్‌లోకి నెట్టి వేస్తుంది. మహమ్మారి కోవిడ్–19ని అంతమొందించాలంటే ఏకైక మార్గం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ రోగ నిరోధకతను కల్పించడమే. అందరూ సురక్షితంగా ఉండనంతవరకు ఏ ఒక్కరూ సురక్షితంగా ఉండరు అనేది మన నినాదం కావాలి. ఇది నేడు మనం ఎదుర్కొంటున్న సాంక్రమిక కాల వాస్తవికత. వ్యాక్సిన్లను కూడా తట్టుకునేలా సార్స్ కోవిడ్–2 రకాలు ఎక్కడైనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో మరోసారి మనం లాక్‌డౌన్ పాలబడాల్సి వస్తోంది. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బ్రిటన్ ఇలా అన్ని చోట్లా వైరస్ కొత్తరకాలు పుట్టుకొస్తున్నందున కోవిడ్ వైరస్ ఇక ఏమాత్రం ఊహాత్మకమైన, అనిశ్చయకరమైన ప్రమాదం కానేకాదు.
ఏప్రిల్ చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 120 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను మాత్రమే ఉత్పత్తి చేశారు. అంటే ఈ లెక్కన 2023 నాటికి కానీ వాక్సిన్ ప్రపంచంలోని ప్రజలందరికీ అందుబాటులోకి రాదు. వ్యాక్సిన్‌ల విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ మేధో సంపత్తి నిబంధనలను వెంటనే మాఫీ చేయాలని వంద దేశాలు కోరుతున్నాయి. డబ్ల్యూటీఓ ఒప్పందంలోని ఈ అడ్డంకులను తాత్కాలికంగా నైనా తొలగిస్తే టీకాలు ఉత్పత్తికి, పంపిణీకి చట్టబద్ధ వెసులుబాటు కలుగుతుంది. ఇలాంటి మాఫీకి సంబంధించిన చర్చలను నిరోధించడానికి గతంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని ధనిక దేశాలను కూడగట్టాడు. దీనిని తిప్పి కొట్టడానికి నూతన అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇలా ఒత్తిడి పెట్టేవారిలో 200 మంది నోబెల్ అవార్డు గ్రహీతలు, మాజీ దేశాధినేతలు, నూతన ఉదారవాదులు, అమెరికా ప్రతినిధుల సభలో 110 మంది సభ్యులు, 100 మంది సెనెట్ సభ్యులు, సెనెటర్లు, 400 మంది అమెరికా సివిల్ సొసైటీ గ్రూపు సభ్యులు, 400 మంది యూరోపియన్ పార్లమెంటు సభ్యులు కూడా ఉండటం విశేషం.
అనవసరమైన సమస్య
టీకా తయారీదారులు తమ గుత్తాధిపత్యాన్ని, లాభాలను కొనసాగించడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లకు కొరత ఏర్పడుతోంది. వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడానికి అర్హత కలిగిన అనేక ఔషధ తయారీ దారులు సాంకేతికతను బదిలీ చేయాలంటూ చేస్తున్న అభ్యర్థనలను అంగీకరించడానికి కానీ, స్పందించడానికి కానీ ఎమ్‌ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల తయారీదారులైన ఫైజర్, మోడెర్నా సిద్ధంగా లేవు. కరోనా టీకాలను అభివృద్ది చేసిన ఈ సంస్థలు ఆ టెక్నాలజీని పేదదేశాలతో పంచుకోవడానికి ఇష్టపడటంలేదు. కార్పొరేట్ ఔషధ సంస్థలు ప్రధానంగా ఆరోగ్య రంగంపై దృష్టి సారించాయి. అది సంపాదన కోసమే కానీ, ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ కోసం కాదు. లాభాలను పెంచుకోడానికి వీలైనంత దీర్ఘకాలం, వీలైనంత బలమైన మార్కెట్ శక్తిగా కొనసాగడమే వాటి ధ్యేయం.
కోవిడ్–19 టీకాల పేటెంట్ హక్కుల రద్దును నిరోధించడం కోసం రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తేవటానికి ఔషధ సంస్థల మధ్యవర్తుల సైన్యం వాషింగ్టన్‌లో ఏర్పడింది. అయితే పేటెంట్ హక్కుల మాఫీని నిరోధించడానికి బదులు ఈ సంస్థలు టీకా ఉత్పత్తిని పెంచినట్టయితే సమస్య పరిష్కారమయ్యేది. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమ నిబంధనల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందని, ఈ చట్టం ఇతరులు చేసే ఉత్పత్తిని కూడా అనుమతించేంత సరళమైందని, అందుచేత పేటెంట్ హక్కుల మాఫీ అవసరం లేదని ఔషధ కంపెనీలు వాదిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలోనివారు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి సమర్థులు కారని, అందువల్ల మాఫీతో ఎలాంటి ఉపయోగం లేదని వారు పేర్కొంటున్నారు. పైగా ఎంతో శ్రమపడి చేసిన పరిశోధనకు ప్రోత్సాహకాలు కోల్పోతామని, అది లాభాలను తగ్గించి, కంపెనీల అభివృద్ధికి ఆటంకంగా తయారవుతుందని వీరు అంటున్నారు.
తమ స్వప్రయోజనాల కోసం చేస్తున్న ఇలాంటి వాదనలు విఫలమైనప్పుడు వీరు మరొక కొత్త వాదనను తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా చైనా, రష్యాలను ఓడించడానికి, పశ్చిమ దేశాల భౌగోళిక రాజకీయాలకు ఇది ఉపయోగపడుతుందట! టీకాల పేటెంట్ మాఫీ చర్చల్లో బైడెన్ ప్రభుత్వం పాల్గొంటుందని ప్రకటించిన కొద్ది సేపటికే, షేర్ మార్కెట్‌లో వ్యాక్సిన్ ప్రధాన తయారీ దారుల వాటా ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. పేటెంట్ హక్కుల రద్దుతో మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయి, వాటి ధరలు తగ్గుతాయి. పైగా వారికి లాభాలు కూడా తగ్గుతాయి.
ఇంగితజ్ఞానమే అసలైన పరిష్కారం
కొత్త టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్‌లను తయారు చేసే నైపుణ్యం అభివృద్ధి చెందుతున్న దేశాలకు లేదన్నది ఎంతమాత్రం పసలేని వాదన. అమెరికా, యూరోపియన్ ఉత్పత్తిదారులు, విదేశీ ఉత్పత్తిదారులతో భాగస్వామ్యాలకు అంగీకరించినప్పుడు వాటికి చెప్పుకోదగ్గ ఉత్పాదక సమస్యలేమీ రాలేదు. ప్రపంచంలోని అతిపెద్ద టీకా ఉత్పత్తిదారులైన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో, దక్షిణాఫ్రికాలోని ఆస్పెన్ ఫార్మకేర్‌లతో అమెరికా, యూరోపియన్ ఉత్పత్తి దారులు భాగస్వామ్యాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. అదే సామర్థ్యంతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి, సరఫరాను పెంచే సంస్థలు చాలా ఉన్నాయి. వారికి కావలసింది కేవలం నూతన పరిశోధనల సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే. టీకాలు తయారు చేయగల 250 కంపెనీలను నూతన ఆవిష్కరణల కూటమి గుర్తించింది. వాస్తవానికి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల వద్ద అధునాతన శాస్త్రీయ, సామర్థ్యాలు ఉన్నాయి. పేటెంట్ హక్కులున్న కంపెనీల వల్లనే టీకా ఉత్పత్తి, సరఫరాల కొరత ఏర్పడుతోంది. ఈ కంపెనీలు ప్రజల ప్రాణాలను కాపాడడం కన్నా, తమ గుత్తాధిపత్యం, లాభాలు పోగేసుకునే ఒప్పందాలను చేసుకుంటున్నాయి.
మేధోపరమైన సంపత్తి దారులకు రావలసిన రాయల్టీలు, ఇతర పరిహారాలను, ఇతర జాతీయ చట్టపరమైన అవసరాలను ఈ పేటెంట్ హక్కుల మాఫీ ఎంతమాత్రం రద్దుచేయదు. కాగా, గుత్తాధిపతులకు ఉన్న.. ఉత్పత్తిని నిరోధించే ఎంపికను తొలగించడం ద్వారా ఔషధ సంస్థలు స్వచ్ఛంద ఏర్పాట్లలోకి ప్రవేశించడానికి ఇది ప్రోత్సహిస్తుంది. టీకా అసలు తయారీదారులు ధన సంపాదన పక్షాన్నే నిలబడతారు. కోవిడ్–19 వ్యాక్సిన్ తయారీ వల్ల 2021లో ఫైజర్ కంపెనీకి 1,500 కోట్ల డాలర్లు, మోడెర్నోకు 1,840 కోట్ల డాలర్లు ఆదాయం చేకూరుతుందని అంచనా. అయితే వాస్తవానికి, అక్కడి ప్రభుత్వాలు ఈ కంపెనీలకు ప్రాథమిక పరిశోధనకోసం నిధులు సమకూర్చాయి. వాక్సిన్‌లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి గణనీయంగా నిధులను అందించాయి.
లాభాలకున్న విలువ జీవితాలకు లేదా?
వాస్తవానికి కరోనా టీకా అమెరికా సృష్టి కాదు. భారత దేశంలో కోవిడ్ మహమ్మారి రెండవ దశ విజృంభించినప్పుడు అమెరికా తాను ఉపయోగించని అస్ట్రా జెనెకా విడుదల చేయాలని భావించింది. ఈ సమయంలో రష్యా, చైనా తమ టీకాలను అందుబాటులో ఉంచడమే కాకుండా, తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. వైవిధ్యంగల ప్రమాదకరమైన కొత్త వైరస్ వ్యాపిస్తున్న ఈ క్లిష్ట సమయంలో తమకు ఏ దేశాలు సహాయపడ్డాయో, ఏవి అడ్డం కులు సృష్టించాయో ప్రపంచం తప్పనిసరిగా గమనిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితాల కంటే లాభాలు ఎక్కువనే భావన ఔషధ కంపెనీలకు ఉండకూడదు.
జోసెఫ్ ఇ స్టిగ్లిజ్, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత, కొలంబియా యూనివర్సిటీ
లోరీ వాలక్, గ్లోబల్ ట్రేడ్ వాచ్ డైరెక్టర్
సంక్షిప్త అనువాదం : డాక్టర్ ఎస్. జతిన్ కుమార్
మొబైల్: 98498 06281
Comments
Please login to add a commentAdd a comment