ఎనిమిదేళ్లే... కానీ ఎన్నో విజయాలు..! | JP Nadda Special Article On BJP 8 Years Rule | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్లే... కానీ ఎన్నో విజయాలు..!

Published Tue, May 31 2022 12:20 AM | Last Updated on Tue, May 31 2022 12:36 AM

JP Nadda Special Article On BJP 8 Years Rule - Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఈ ఎనిమిదేళ్ల పాలనాకాలంలో ఇప్పటికే మైలురాళ్లు అనదగిన విజయాలు చేకూరాయి. పేదరికం రేటు 22 నుండి 10 శాతానికి తగ్గింది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద రోడ్డు నెట్‌వర్క్‌ ఏర్పడింది. 6.53 లక్షల పాఠశాల భవనాలు నిర్మిత మయ్యాయి. రెండు ‘మేడిన్‌ ఇండియా’ వ్యాక్సిన్లు అందించింది. కోవిడ్‌ కాలంలోనూ గతేడాది ఎగుమతుల్లో భారతదేశం 418 బిలియన్‌ డాలర్లతో రికార్డు సృష్టించింది. ఇక ఆహారధాన్యాల ఉత్పత్తి ఇండియా చరిత్రలోనే అత్యధికంగా 316.06 మిలియన్‌ టన్నులకు పెరిగింది. వైభవోపేతమైన భారత దేశ ఔన్నత్యాన్ని తిరిగి సాధించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందడుగులు వేస్తోంది.

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ, క్రియాశీల, నిర్ణయాత్మక నాయకత్వంలో విజయవంతంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కుల రాజకీయం, కుటుంబ పాలన, అవినీతి రాజకీయాల వంటి అనేక సంకెళ్లను తెంచుకుని... అభివృద్ధి, ఎదుగుదల, ఐక్యత, జాతీయవాద రాజకీయాల వైపునకు మళ్లిన గత 8 సంవత్సరాల కాలం భారతదేశానికి ఒక మేలిమి మలుపు!

మన సమాజంలోని అట్టడుగు వర్గాలకు– పేదల నుండి వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు, గిరిజనులు, అణ గారిన వర్గాలు, మహిళలు, యువత వరకు సాధికారత కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దాని నిజమైన అర్థంలో బలోపేతం చేయడం ఒక అద్భుతమైన ప్రయాణం. ఇది ‘ఈ దేశంలో ఏదీ సాధ్యం కాదు’ అనే ధోరణి నుండి, ‘ప్రభుత్వం, ప్రజలకు సంకల్పం, నిబద్ధత ఉంటే ప్రతిదీ సాధ్యమే’ అనే స్థాయికి భారతీయ మనస్తత్వాన్ని మార్చే ప్రయాణం కూడా! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత పట్ల 135 కోట్ల మంది భారతీయుల నిబద్ధత నేడు క్షేత్ర స్థాయిలో ప్రతిబింబిస్తోంది. 

నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం కేవలం మారడం మాత్రమే కాదు... ‘వేగవంతమైన అభివృద్ధి’ అనే కొత్త అధ్యాయాన్ని లిఖి స్తోంది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను దేశం జరుపుకొంటున్న సందర్భంగా–  దేశం ముందున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించి గతకాలపు వైభవాన్ని పునరుద్ధరించేందుకు మోదీ దృఢమైన సంకల్పం తీసుకున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో భారతదేశంలో చోటుచేసుకున్న మార్పు ప్రతి భారతీయుడి కళ్లలో ప్రతిబింబిస్తోంది. గడచిన ఎనిమిదేళ్ళలో మన పేదరికం రేటు 22% నుండి 10 శాతానికి తగ్గింది, అయితే కటిక పేదరికం 1% కంటే తక్కువకు పడిపోయి 0.8% వద్ద స్థిరంగా ఉంది. గడచిన ఎనిమిదేళ్ళలో మన తలసరి ఆదాయం రెట్టింపు కాగా, మన విదేశీ మారక నిల్వలు కూడా రెండు రెట్లు పెరిగాయి. 

గత 70 ఏళ్లలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ కేవలం 6.37 లక్షల ప్రాథమిక పాఠశాల భవనాలు మాత్రమే నిర్మించారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకూ 6.53 లక్షల పాఠశాల భవనాలు నిర్మితమయ్యాయి. ఈ ప్రభుత్వ హయాంలో 15 కొత్త ‘ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ (ఎయిమ్స్‌)లు మంజూరయ్యాయి. వీటిలో 10 ఎయిమ్స్‌లు ఇప్పటికే పని చేస్తుండగా, మరో ఐదు నిర్మాణ దశలో ఉన్నాయి. అదేవిధంగా, వైద్యుల సంఖ్య 12 లక్షలకు పైగా పెరిగింది. గత ఎనిమిది ఏళ్లలో భారత దేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద రోడ్డు నెట్‌ వర్క్‌ను ఏర్పరిచింది. ఇంకా గత ఐదు సంవత్సరాలలో మన సోలార్, పవన విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింçపు అయింది.

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ప్రతి సంవత్సరం రికార్డులను తిరగ రాస్తోంది. 2012–13లో మన ఆహారధాన్యాల ఉత్పత్తి 255 మిలియన్‌ టన్నులు కాగా, 2021–22 నాటికి ఇది ఇండియా చరిత్రలోనే అత్యధికంగా 316.06 మిలియన్‌ టన్నులకు పెరిగింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో భారతదేశం 418 బిలియన్‌ డాలర్లతో రికార్డును సాధించగలిగింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో దేశ సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమంలో దేశం అనేక మైలురాళ్లను అధిగమించింది. కరోనా మహమ్మారిపై భారతదేశ సాహసోపేత పోరాటాన్ని ప్రధాన మంత్రి ముందుండి నడిపించారు. ఆయన భారతదేశానికి ఒకటి కాదు, రెండు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ వ్యాక్సిన్లు ఇవ్వడమే కాకుండా, గత రెండు సంవత్సరాలుగా 80 కోట్ల మందికి పైగా భారతీయులకు రూ. 3.40 లక్షల కోట్ల వ్యయంతో ఉచిత రేషన్‌ అందించారు.  భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తుండగా, ఆహార పంపిణీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా కొనసాగుతోంది. భారతదేశ ఈ రెండు ముఖ్యమైన విజయాలను ప్రపంచం ప్రశంసించింది.

గత ఎనిమిదేళ్ల మోదీ ప్రభుత్వంతో ముడిపడి అనేక ‘ఫస్టులు’ ఉన్నాయి. ‘ఆయుష్మాన్‌ భారత్‌ యోజన’ ద్వారా సామాన్యులకు ఉచిత వైద్య బీమా కవరేజీ లభించగా, రైతులు, కార్మికులకు నెలవారీ పెన్షన్‌ లభించింది. మొదటిసారిగా రైతులు వ్యవసాయ అవసరాల కోసం ‘కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ ప్రయోజనాన్ని పొందారు. అలాగే, మన ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం కోసం ఒక విధానాన్ని రూపొందించింది. ఇంకా ‘జన్‌ ధన్‌ యోజన’, ‘ఉజ్వల యోజన’, ‘గరీబ్‌ కల్యాణ్‌ యోజన’, ‘స్వచ్ఛ భారత్‌ యోజన’, ‘ఆవాస్‌ యోజన’, ‘జల్‌ జీవన్‌ మిషన్‌’, ‘డిజిటల్‌ ఇండియా’, ‘గ్రామ వికాస్‌ యోజన’ వంటి అనేక వినూత్న పథకాలు ఉన్నాయి. ఇవి పౌరులకు సాధికారతను అందించడమే కాకుండా మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. అలాగే దేశం ఎదుర్కొన్న సమస్యల నుంచి త్వరగా కోలుకొని స్వావలంబన స్థితికి వచ్చేలా చేశాయి. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’, ‘ఓకల్‌ ఫర్‌ లోకల్‌’, ‘గతి శక్తి యోజన’, ‘పీఎల్‌ఐ’ (ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌) వంటి పథకాలు భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపాయి.

ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, సీఏఏను ఆమోదించడం, సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేయడం వంటి చర్యలకు ప్రధాని దృఢ సంకల్పం కారణం. నిరుపయోగంగా మారిన 1,800 పాత చట్టాలను గుర్తించి, ఇప్పటివరకు వాటిలో 1,450 రద్దు చేయడం ప్రధాన మంత్రి ప్రత్యేక శైలికి నిదర్శనం. 

భారతదేశ విదేశాంగ విధానాన్ని దేశ ప్రయోజనం కోసం తిరిగి మార్చడం జరిగింది. ఇరాక్, యెమెన్, అఫ్గానిస్థాన్, ఉక్రెయిన్‌లలో భారతీయ పౌరుల ప్రాణాలను కాపాడటంలో మన విదేశీ విధానం ఎంతగానో ఉపయోగపడింది. మోదీ విదేశాంగ విధానానికి ‘క్వాడ్‌’ ఒక మచ్చుతునక.

నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ళ పాలన భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన కాలం కూడా. యోగా, ఆయుర్వేదం ప్రపంచ దృష్టిని ఆకర్షించగా... భారతదేశం కోల్పోయిన సాంస్కృతిక, మతపరమైన చిహ్నాలు వాటి వైభవాన్ని తిరిగి పొందాయి. వీటిలో కాశీ విశ్వనాథ్‌ ధామ్, కేదార్‌నాథ్‌ ధామ్‌ వంటి మన పవిత్ర ప్రదేశాలలో చోటుచేసుకున్న మార్పులూ ఉన్నాయి. భారతదేశం తన అద్భుత చరిత్రను తిరిగి సాధించడంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమే!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారతీయ జనతా పార్టీ కూడా వివిధ రికార్డులను బద్దలుకొట్టి కొత్త శిఖరాలకు చేరుకుంది. నేడు బీజేపీ 18 కోట్లకు పైగా సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ సంస్థ! 2014లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 7 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కలిగి ఉండగా, నేడు 18 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. తొలిసారి రాజ్యసభలో బీజేపీ 100 ఎంపీ మార్కును దాటింది. మోదీ హయాంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవా, మణిపూర్, త్రిపురల్లో బీజేపీ ఎన్నికల రికార్డులను బద్దలు కొట్టింది. 

135 కోట్ల మంది భారతీయుల నుండి పొందిన నమ్మకం, ఆశీర్వాదాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం వెనుక ఉన్న రహస్యం. తమ సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం కేంద్రంలో ఉందనీ, ‘సబ్‌ కా సాథ్‌’, ‘సబ్‌ కా వికాస్‌’,‘ సబ్‌ కా విశ్వాస్‌’,‘ సబ్‌ కా ప్రయాస్‌’లకు అది కట్టుబడి ఉందనీ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలుసు. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశాన్ని సంతోషకరమైన, సౌభాగ్యవంతమైన దేశంగా మార్చేందుకు కష్టపడి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మరోసారి ప్రతిజ్ఞ చేయవలసిన సమయం ఇది.


వ్యాసకర్త భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు
జగత్‌ ప్రకాశ్‌ నడ్డా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement