ఏపీ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి మరో మూడు నెలల్లో మూడు ఏళ్లు పూర్తి చేసుకుంటారు. అంటే ఎన్నికలు జరగడానికి రెండేళ్ల గడువు మాత్రమే ఉంటుంది. అందులోను ఎన్నికలకు ఆరు నెలల ముందే వాతావరణం బాగా వేడెక్కుతుంది. ఇంతకాలం జగన్ ప్రభుత్వం డిఫెన్స్ ఆటనే నడిపిందని చెప్పాలి. ఒకవేళ అఫెన్స్ ఆడడానికి ప్రయత్నించినా.. ఆయా వ్యవస్థలలో తనకు ఉన్న పూర్వ పలుకుబడి అనండి లేదా మానిప్యులేషన్‌లో నైపుణ్యం అనండి, అలాంటి వాటి ద్వారా తెలుగు దేశం అడ్డుకోగలిగింది. తెలుగుదేశం హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు, అక్రమాలను వెలుగులోకి తీసుకుని వచ్చి ఆ పార్టీని ప్రజలలో నిలబెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ టీడీపీ ఆ ప్రయత్నాన్ని తన వర్గం మీడియా సహకారంతో ‘కక్ష సాధింపు’ గా ప్రచారం చేసింది. ప్రభుత్వపరంగా ఏమి జరిగినా, వాటికి న్యాయవ్యవస్థలో ఎదురుదెబ్బ తగిలేలా చేయడానికి కృషి చేసింది. చివరికి ఈ విషయంలో ఆయా వ్యవస్థలపై ప్రజలలో పలు సందేహాలు వ్యక్తం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా జగన్ ప్రభుత్వం అఫెన్స్‌లోకి వెళ్లనవసరం లేకుండానే టీడీపీ ఆత్మరక్షణ పడవలసి వచ్చిందన్నది వేరే సంగతి.
కుయుక్తుల నేర్పరి
అమరావతి భూముల కుంభకోణాలు, ఈఎస్‌ఐ స్కామ్, మద్యం సేవించి గొడవ చేసిన వైద్యుడి ఉదంతం, జడ్జిల ఫోన్‌లు టాప్ అయ్యాయంటూ జరిగిన ప్రచారం, ఇంగ్లిషు మీడియంని వ్యతిరే కించడం వంటి వాటిల్లో చంద్రబాబు మానిప్యులేషన్ స్కిల్స్‌ను ప్రజ లంతా అర్థం చేసుకోగలిగారు అయినా జగన్ ప్రభుత్వంపై వివిధ అంశాలలో టీడీపీ ఆరోపణలు చేయడం, లేదా ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా దుష్ప్రచారం చేయడం వంటివి అధికంగా జరిగాయి. వాటిపై ప్రభుత్వం వివరణ ఇస్తూ.. ప్రతిపక్షంతో పాటు ఆ వర్గం మీడియా కుయుక్తులను బట్టబయలు చేస్తూ ఉండవలసి వచ్చింది. ఇది ఒక రకంగా డిఫెన్స్ ఆట గానే కనిపించింది. అయితే ఆయా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జగన్ విజయవంతం అవడం వల్ల టీడీపీ, ఆ పార్టీ మీడియా ఎంత విష ప్రచారం చేసినా జగన్‌పై ప్రజలలో ఉన్న ఆదరణ తగ్గించలేక పోయాయి.
రోజుకో దుష్ప్రచారం
నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజునుంచే ఆ వర్గం పత్రికలు రేపో, మాపో ఎన్నికలు అన్నట్లుగానే వ్యవహరిస్తు న్నాయి. నిత్యం ఏదో ఒక విమర్శో, ఆరోపణో చేస్తూ ప్రతిపక్షం; వ్యతిరేక వార్తలు వండి వడ్డిస్తూ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆ పార్టీ మీడియా.. విశ్వయత్నం చేస్తున్నాయి. ఎన్నికల మానిఫెస్టోలో ఉన్న అంశాల అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా, లేదా అన్నదానికి ప్రాధాన్యం ఇవ్వకుండా.. ప్రభుత్వం ఏమి చేసినా తప్పుపడుతూ, అడ్డగోలు ఆరోపణలతో కథనాలు ఇస్తూ ప్రజలను ప్రభావితం చేయా లన్న ధ్యేయంతో అవి పనిచేస్తున్నాయి. ఇవి వచ్చే రెండేళ్లు మరింత విజృంభించే అవకాశం ఉంటుంది కనుక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మరింత అప్రమత్తం కావల్సి ఉంటుంది. 2019 ఎన్నికలలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఏ ఎన్నికలు జరిగినా విజయం వైయస్సార్ కాంగ్రెస్‌దే అయినా, పలు రకాల సమస్యలు సృష్టించడంలో తెలుగు దేశం, ఆ పార్టీ మీడియా కలిసికట్టు విజయం సాధించాయనే చెప్పాలి.
విలువల్లేని కథనాలు
గతంలో ఒక ప్రముఖ పత్రిక అధిపతి ఒక మాట చెప్పేవారు. అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉండేది. ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షహోదా లేదు. దాని ఆధారంగా ఆ యజ మాని.. ఆయా పార్టీలకు అసెంబ్లీలో ఉన్న బలా లను బట్టి కవరేజీ ఉండాలని ఆదేశించేవారు. దాని ప్రకారం ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వార్తలలో స్పేసే పెద్దగా ఉండేది కాదు. అప్పటికే సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసి. పీసీసీ అధ్యక్షుడిగా, పలు ఇతర పదవులు నిర్వహించిన కొణిజేటి రోశయ్య పెట్టే మీడియా సమావేశాల వార్త లను కూడా కనీసం జిల్లా ఎడిషన్ లలో కూడా వేసేవారు కారు. కేవలం జోనల్ పేజీలలో ప్రచురించేవారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాద యాత్రకు తప్పనిసరి పరిస్థితిలోనే కొద్దిపాటి ప్రాముఖ్యత ఇచ్చేవి. కాని 2004 లో టీడీపీ ఓడిపోవడంతోనే ఆ రూల్ మారిపోయింది! ఏ అవకాశం వచ్చినా అధికార పక్షంపై విరుచుకుపడుతుండేవి. దాంతో వై.ఎస్. ‘ఆ రెండు పత్రికలను నమ్మవద్దు’ అన్న పదం ఖాయం చేసి ప్రజలలోకి తీసుకువెళ్లగలిగారు.
2014లో చంద్రబాబు మళ్లీ ముఖ్య మంత్రి అయ్యాక ఇదే మీడియా ఆయన ప్రభుత్వం ఏమి చేసినా, ఆకాశానికి ఎత్తుతూ కధనాలు ప్రచురించేది. అప్పుడు ప్రభుత్వం అప్పులు చేసినా, రైతుల రుణమాఫీ హామీని నెరవేర్చకపోయినా వాటి గురించి రాసేవికావు. పైగా రైతులకు అంత మేలు చేస్తున్నారు.. ఇంత మేలు చేస్తున్నారు అన్న చందంగా
కథనాలు ఇచ్చేవారు. అక్కడొకలా.. ఇక్కడొకలా!
ఇక్కడ ఒక ఉదాహరణ పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణలో మల్లన్న సాగర్ రిజర్వాయిర్ నిర్మాణానికి భూములు తీసుకున్నారు. భూములు ఇచ్చినవారిలో ఒక రైతు తనను అధికారులు లంచాలు అడుగుతున్నారని వాపోతూ ఆత్మహత్య చేసుకున్నాడు. దానిని ఇవే పత్రికలు కనిపించీ, కనిపించని విధంగా లోపలి పేజీలలో ప్రచురించాయి. అదే అలాంటి ఘటన ఏపీలో జరిగితే బానర్ కథ నంగా అది మారేది. చంద్రబాబు నాయుడో, లేక ఆయన కుమారుడో అక్కడికి వెళ్లి హడావుడి చేసేవారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని, మరికొన్ని పక్షాల వారు కానీ కాని అక్కడకు చేరుకుని వివాదాన్ని పెంచడానికి యత్నించేవారు. ఇది నిత్యకృత్యంగా మారింది. ఏపీలో గతంలో పరిశ్రమలు వచ్చినా, రాకపోయినా, ఏదో జరిగిపోయిందని, అభివృద్ధి వాయువేగంతో జరుగుతోందన్న పిక్చర్ ఇచ్చేవారు. కాని జగన్ ప్రభుత్వంలో వివిధ ప్రాంతాలలో పరిశ్రమలు వచ్చినా వాటి గురించి పెద్ద ప్రాముఖ్యత ఇచ్చిందే లేదు. ఎన్జీవోల ఆందోళన విషయమే చూడండి. ప్రతిరోజూ వారిని రెచ్చగొట్టే రీతిలో వార్తలు ఇచ్చేవి. తీరా వాటిని పరిష్కరించితే అటు తెలుగుదేశం కాని, వారి మీడియా కాని తెగ బాధ పడిపోయేవి. సర్దుకుపోయారు అనో, మరొకటనో రాసి ఎన్.జి.ఓ నేతలు రాజీపడితే ఎలా అన్నట్లుగా వార్తలు రాసేవి. సినీ పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్‌ను కలవడాన్ని కూడా చంద్రబాబు ఓర్చుకోలేకపోయారు. జగన్ వారిని భయపెట్టారని, చిరంజీవి అలా ప్రాధేయపడతారా అంటూ విమర్శలు చేసి వారిని కూడా ఆ వర్గం మీడియా అవమానించింది.
సమయం వచ్చేసింది
ఇవన్నీ ఎందుకు చెప్పవలసి ఉంటుందంటే.. వచ్చే రెండేళ్లు జగన్‌కు అత్యంత కీలకం. వచ్చేసారి తెలుగుదేశం గెలవలేకపోతే, తమకు ఇక భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ అధినాయకత్వం భయపడుతోంది. అందుకే మంచి, చెడులతో నిమిత్తం లేకుండా తెలుగుదేశం అన్ని వ్యూహాలనూ పన్నుతుంది. వాటిని ఎదుర్కోవడానికి జగన్ సిద్ధపడాలి. ముందుగా పార్టీ క్యాడర్‌లో మరింత విశ్వాసం పెంపొందించేలా ఆయన పర్యటనలు చేయాలి. తన స్కీముల ప్రభావం, ఏవైనా వర్గాలలో వ్యతిరేకత ఉంటే అందుకు కారణాలు ఏమిటన్నదానిపై ఆరా తీయడం, సర్దుబాటు చర్యలు చేపట్టడం, ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేయడం, వారితో తరచుగా సమావేశాలు జరపడం వంటివి చేయాలి. కొత్తగా జిల్లాల ఏర్పాటుపై ఆయా చోట్ల ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. కేవలం పార్లమెంటు నియోజకవర్గం అన్నదానికి పరిమితం కాకుండా మరిన్ని జిల్లాలను పెంచుకుంటే పెద్ద తప్పు కాదు. తెలంగాణలో ఏకంగా 33 జిల్లాలు చేశారు. అలాగే ఏపీలో కూడా మరికొన్నిటిని పెంచవచ్చేమో ఆలోచించాలి.
వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
విమర్శలు తప్ప వాస్తవాలేవీ!
Published Wed, Feb 23 2022 12:13 AM | Last Updated on Wed, Feb 23 2022 12:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment