ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్‌లో చేసిన రెండు రోజుల పర్యటన వల్ల ఆ పార్టీకి ఏం ఒనగూరిందో అర్థం కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీగా తాము దేశానికి ఏం చేశామో చెప్పడం కన్నా... స్థానిక రాజకీయాల పైనే నడ్డా దృష్టి్ట పెట్టినట్లు కనిపిస్తుంది. ప్రజలలో వైసీపీ బలమేమిటో ఆయనకు బాగా తెలుసు.
అందుకే పెద్దగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. చేసిన కొన్ని విమర్శలు కూడా వ్యంగ్య వ్యాఖ్యానాలకు కారణమయ్యాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సమయంలో దేశానికి బీజేపీ ఏం చేసిందన్నది ముఖ్యం. రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇచ్చిందా అన్నది ముఖ్యం. వాటికి బీజేపీ నేతలు సమాధానం చెప్పే పరిస్థితి ఉందా అన్నది డౌటే.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన ఏం ఫలితాలు ఇస్తుందన్నది పక్కన బెడితే, ఆయన చేసిన ప్రసంగంలో మాత్రం కాస్త మారిన బీజేపీ వైఖరి కనిపిస్తుంది. జాతీయ అంశాలను పక్కనబెట్టి రాష్ట్రాలలో తాము ఏం చేశామన్నదానిపైనే బీజేపీ దృష్టి పెట్టింది. నడ్డా రెండు రోజుల కార్యక్రమాలను పరిశీలిస్తే, ఆయన ఉబుసుపోక ఆంధ్రాకు వచ్చినట్లు అనిపిస్తుంది.
ఎందుకంటే ఏపీలో బీజేపీ పరిస్థితి ఆయనకు తెలుసు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజలలో ఏ విధమైన పట్టు కలిగి ఉందన్న సమాచారమూ వారికి ఉంటుంది. పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటివారితో సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు.
అలాగే ప్రతిపక్ష టీడీపీ తీరుపై కూడా వారికి అవగాహన ఉండి ఉండాలి. ఈ మూడేళ్లలో టీడీపీ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ కొంత యత్నం చేసిందికానీ సఫలం కాలేకపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ తీసుకుని బీజేపీలోకి వెళ్లినవారు మినహా, ఇంకెవరూ ఆ పార్టీలో చేరలేదు.
టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపు అందరూ బీజేపీలో చేరిపోతారనీ, 2019 తర్వాత బీజేపీ ఢిల్లీ నేతలు గంభీరమైన ప్రకటనలు చేస్తుండేవారు. కానీ టీడీపీ తెలివిగా ముందు గానే బీజేపీలో కోవర్టులను తయారు చేసుకుని ఆ అవకాశం ఇవ్వ కుండా జాగ్రత్తపడిందని అనుకోవాలి. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నేతలలో కూడా అంత సత్తా ఉన్నవారు కొరవడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు ఉందని చెప్పుకొంటున్నా, అది ఉందో లేదో అన్న అయోమయ పరిస్థితి రెండు పార్టీలలోనూ నెలకొంది.
ఈ నేపథ్యంలో నడ్డా పర్యటనకు పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఇక ఆయన ప్రసంగం పరిశీలిద్దాం. ప్రజల వద్దకు బీజేపీ కార్యకర్తలు వెళ్లి కేంద్ర ప్రభుత్వ స్కీముల గురించి ప్రచారం చేయా లని కోరారు. కానీ విస్తారంగా ప్రచారం చేసేంత సీన్ ఇంకా బీజేపీకి ఏపీలో రాలేదనే చెప్పాలి. ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిర్దిష్ట వాటా ప్రకారం నిధులు ఇవ్వవలసిందే.
ఆయా కేంద్ర స్కీములను అన్ని రాష్ట్రాలకూ అందించవలసిందే. కానీ ఏపీకి సంబంధించి నంత వరకూ ప్రత్యేక హోదా, వెనుక బడిన ప్రాంతాల ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులు, రెవెన్యూలోటు వంటివి కీలకం అవుతాయి. వాటిమీద ప్రజలు ఎవరైనా అడిగితే బీజేపీ నేతలు ధైర్యంగా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా అన్నది డౌటే. అలాగని అసలు ఏమీ చేయలేదని అనజాలం.
ఆయా విద్యా సంస్థలను ఏపీకి ఇచ్చిన మాట నిజం. కానీ వాటి అభివృద్దికి అవసరమైన నిధులను కేంద్రం తగు స్థాయిలో ఇవ్వడం లేదన్న విమర్శ ఉంది. తెలుగు రాష్ట్రాల సమస్యలలో ముఖ్యమైనది ఆస్తుల విభజన అని చెప్పాలి. విభజన చట్టంలోని చివరి పాయింట్ ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని సమస్యలపై కేంద్రమే నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇందుకు కేంద్రం కూడా ధైర్యం చూపలేకపోతోంది. దీనికి రాజకీయ కారణాలే కారణం అని వేరే చెప్పనవసరం లేదు. వీటి గురించి నడ్డా ఒక్క ముక్క మాట్లాడలేదు.
నడ్డా ఏపీ ప్రభుత్వంపైన సాధారణ విమర్శలే తప్ప మరీ తీవ్రమైన ఆరోపణలు చేయలేదు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందన్న విమర్శ చేశారు. ఇది తరచుగా ఉండే విమర్శే. స్థూలంగా చెప్పాలంటే ఏపీలో జగన్ ప్రభుత్వం చేపట్టిన వివిధ స్కీములను బీజేపీ కూడా వ్యతిరేకించలేదు.
అంతేగాక ఆ స్కీములలో కేంద్రం నిధులే అధికంగా ఉన్నాయనీ, దానిని ప్రచారం చేయాలనీ నడ్డా సూచించారు. ఏపీలో అమలవుతున్న ‘ఆరోగ్యశ్రీ’ కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ తర్వాత వచ్చిన స్కీముగా చెప్పి, దానివల్లే ఇతర రాష్ట్రాలలో కూడా ప్రజలు చికిత్స పొందే అవకాశం ఉందని ‘తప్పు’లో కాలేశారు.
నడ్డాకు ఎవరు బ్రీఫ్ చేశారో తెలియదు కానీ, వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆరంభమైన ‘ఆరోగ్యశ్రీ’ ఇప్పుడు జగన్ హయాంలో మరింత విస్తా రంగా అమలవుతోంది. దీంతో నడ్డా ప్రసంగంపై వ్యంగ్య వ్యాఖ్యా నాలు వచ్చాయి. ఏపీ చేసిన అప్పు ఎనిమిది లక్షల కోట్లకు చేరిందని అన్నారు.
టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పు ఎంత?ౖ వెసీపీ వచ్చాక ఎంత? కరోనా సమయంలో అప్పులు చేయా లని కేంద్రమే ఎందుకు సలహా ఇచ్చింది? ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ. 85 లక్షల కోట్ల అప్పు చేసింది. ఆ అప్పు గురించి వివ రించి, అప్పుడు రాష్ట్రాల అప్పులపై మాట్లాడితే బాగుంటుంది.
మిత్రపక్షం ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ గురించి ఒక్క ముక్కా ప్రస్తావించలేదు. ఎన్నికల పొత్తుల గురించీ, అలాగే పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయం గురించీ ఒక్క మాటా లేదు. దీంతో జనసేన నేతలు నీరుగారిపోయారు. వారు దీనిపై ప్లకార్డులు పట్టుకున్నా పరువు పోవడం తప్ప ప్రయోజనం దక్కలేదు.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి అయింది. 2014లో ఎన్నికల ప్రచారంలో గానీ, మానిఫెస్టోలో గానీ ఏం చెప్పారన్నది ప్రాధాన్యం కలిగిన అంశంగా భావించాలి. ఆ తర్వాత వాటిలో ఎన్ని సాధించిందీ నడ్డా వివరించి ఉంటే మరింత అర్థవంతంగా ఉండేది. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి ఎక్కువగా ప్రచారం చేయమంటున్నారు తప్ప, బీజేపీ జాతీయ స్థాయిలో నోట్ల రద్దు ద్వారా సాధించిన ఘనత గురించి పెద్దగా చెబుతున్నట్లు లేదు.
ఈ మధ్యనే వచ్చిన ఒక నివేదిక ప్రకారం మళ్లీ యథాప్రకారం నకిలీ నోట్లు వ్యాప్తిలోకి వచ్చాయట. మరి అలాం టప్పుడు నోట్ల రద్దు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఎందుకు ఉపయోగపడినట్లు అన్న ప్రశ్న వస్తుంది. అయితే డిజిటలైజేషన్ వరకు ప్రభుత్వ కృషి కొంతవరకు ఫలిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడుతున్నారు.
అది మంచిదే. కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో పాటు, లదాఖ్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం వల్ల ఒన గూరిన ప్రయోజనం గురించి నడ్డా చెప్పి ఉండాల్సింది. దీనివల్ల ఉగ్ర వాదం మరింత పెచ్చరిల్లి, ఇప్పుడు అది కశ్మీరీ పండిట్లను బలిగొనే పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరం. ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు పలుమార్లు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు కూడా అదే రకంగా అక్కడి రాజకీయ పక్షాల నేతలు నెలల తరబడి గృహ నిర్బంధంలో ఉంటున్నారు.
అంతర్జాతీయంగా మోదీకి మంచి పేరు, ప్రఖ్యాతులు వచ్చినా... వాటివల్ల దేశానికి కలిగిన లాభాల గురించి చెప్పాల్సింది. దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయన్నదానికి జవాబిచ్చి ఉండాల్సింది. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు తీసుకు రావడం ద్వారా ప్రతి ఒక్కరికీ 15 లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం వస్తుందన్న మోదీ వ్యాఖ్యలు ఏమేరకు ఫలించాయో చెప్పాల్సింది. గత ఎన్నికలలో పుల్వామా ఉగ్రదాడి ఘటనలో మన సైనికులు నలభైమంది వీరమరణం పొందారు.
ఆ తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసింది. ఈ పరిణామాలు బీజేపీకి రాజకీయంగా కూడా ఉపయోగ పడ్డాయి. ప్రజలలో దేశభక్తి సెంటిమెంట్ ప్రబలడం కలసి వచ్చింది. అలాంటివి ఎప్పుడూ జరగవు. వచ్చే ఎన్నికలలో జాతీయ స్థాయి అంశాలు ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చెప్పలేం. దానికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంపై ప్రజలలో అసంతృప్తి ఉంది.
కొంతమేర ధరలు తగ్గించినా అది పూర్తి సంతృప్తి కలిగించేది కాదు. అసలు ఈ సభ బీజేపీ ఎదుగుదలకు ఎంతవరకు ప్రయోజనం చేకూర్చుతుందన్నది సంశయమే. అందు వల్లే నడ్డా రెండు రోజుల పర్యటన ‘టైమ్ పాస్’గా సాగిందన్న అభిప్రాయం కలుగుతుంది.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment