మూడు రాజధానుల బిల్లును వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడం వ్యూహాత్మకం అనిపిస్తోంది. న్యాయపరమైన అవరోధాలను దాటడం, ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుకుని దీన్ని విధానపర నిర్ణయంగా మార్చడం ఇందులో ఉన్నాయి. అన్ని ప్రాంతాలవారు చెల్లించే పన్నులను ఒకేచోట ఖర్చు చేయడం మీద రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతున్న సమయంలో... భిన్న వర్గాల నిపుణులు వికేంద్రీకరణను సమర్థిస్తున్న సందర్భంలో... ఉపసంహరణ నిర్ణయం ఆశ్చర్యం కలిగించినా, తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందని పేరున్న జగన్ ప్రభుత్వం ఏ గందరగోళం నెలకొనకుండా తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. అందుకే ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు.
కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలో రెండు వ్యాసాలు వచ్చాయి. ఆ రెండింటిని ప్రముఖులే రాశారు. ఒకరు రిటైర్డు న్యాయమూర్తి చంద్రు అయితే, మరో వ్యాసాన్ని ఇద్దరు పట్టణీకరణ నిపుణులు కె.టి. రవీం ద్రన్, అంజలి కర్జాయ్ మోహన్ కంట్రిబ్యూట్ చేశారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న తీరుకూ, కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను విరమించుకున్న వైనానికీ పోలిక లేదంటూ ఏపీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కుంటున్న సమస్యలను చంద్రు వివరించారు. రెండో వ్యాసంలో వికేంద్రీకరణతో కూడిన అభి వృద్ధి, కేంద్రీకృతం కాని పరిపాలన ఏపీ అభివృద్ధికి దోహదపడతా యని స్పష్టం చేశారు. ఈ వ్యాసంలో గతంలో శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫారసులను ప్రస్తావించారు.
మూడు రాజధానులకు సంబంధించిన సీఆర్‌డీఏ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం వెనుకడుగు అవుతుందా? ఈ పరిణామాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు నిరాశ కలిగించ వచ్చు. కానీ సీఎం జగన్ ప్రకటన వారి ఆశలను సజీవంగా నిలిపిం దని చెప్పాలి. ప్రస్తుతం ఆ చట్టాలను విరమించుకుంటున్నామనీ, కానీ సమగ్రమైన వివరాలతో, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలతో చర్చించి తిరిగి బిల్లు పెడతామనీ జగన్ అన్నారు. ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... 1936 నుంచి తెలుగు ప్రజలకు సంబంధించి జరిగిన వివిధ పరిణామాలు, శ్రీబాగ్ ఒప్పందం నేపథ్యం, హైదరాబాద్‌లో అన్నీ కేంద్రీకృతం అవడం వల్ల జరిగిన నష్టం, ఇతర రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులను వివరించారు. ఆ తర్వాత జగన్ తాను అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదనీ, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందనీ పేర్కొన్నారు. అమరావతిలో కనీస సదు పాయాల కల్పనకే లక్ష కోట్ల రూపాయలు కావాలని గత ప్రభుత్వమే చెప్పిందనీ, కాలం గడిచే కొద్దీ అది ఆరేడు లక్షల కోట్లకు చేరవచ్చనీ వివరించారు. శివరామకృష్ణన్ కమిటీ, తమ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ, బోస్టన్ గ్రూప్ మొదలైనవి చేసిన సిఫారసుల మేరకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసుకోవడం సరైనదే. అమరావతిలో మాదిరి భారీ ఎత్తున వ్యయం చేయవలసిన అవసరం ఉండదు. కర్నూలులో హైకోర్టు, న్యాయ విభాగానికి చెందిన సంస్థలు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజల సెంటి మెంటే. రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండా లన్నది శ్రీబాగ్ ఒడంబడికలోని ప్రధాన అంశం. అయినా టీడీపీ మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకు వెళ్లడానికి న్యాయ వ్యవస్థ ద్వారా బ్రేక్ వేయగలిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ఇందులో రెండు లక్ష్యాలు కనిపిస్తాయి. చట్టపరమైన అవరోధా లను అధిగమించడం, న్యాయపరంగా వచ్చే చిక్కుల నుంచి తప్పు కోవడం. క్రితం తీర్మానం చేసినప్పుడు శాసనమండలిలో వైసీపీకి బలం లేదు. వికేంద్రీకరణ బిల్లు వచ్చిన ప్పుడు చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చుని మరీ డైరెక్షన్ ఇచ్చి గందరగోళం సృష్టించారు. బిల్లును ఆమోదించకుండా, తిరస్కరిం చకుండా చేశారు. తదుపరి సెలెక్ట్ కమిటీ అంటూ కొత్త వివాదం తెచ్చారు. ఈ పాయింట్ల మీద కూడా హైకోర్టులో వ్యాజ్యాలు పడ్డాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికి మండలిలో వైసీపీకి మెజారిటీ వచ్చింది. మరికొద్ది రోజులు పోతే వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య మరింత పెరుగుతుంది. అప్పుడు ఈ బిల్లులను సునాయాసంగా ఆమోదింప చేసుకోవచ్చు. విధానపరమైన నిర్ణయం కనుక కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం తక్కువ.
హైకోర్టు మూడు రాజధానులపై ముందుకు వెళ్లవద్దని గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. విశాఖలో ఏ నిర్మాణం చేపట్టినా టీడీపీ అనండి, ఆయా పక్షాలు అనండి... స్టేలు తెచ్చాయి. కాగా హైకోర్టులో ఈ కేసు లను విచారించడానికి ఏర్పాటైన ధర్మాసనం కూర్పుపై ప్రభుత్వం అధికారికంగా అభ్యంతరం చెప్పినా, హైకోర్టు వారు అంగీకరించ లేదు. కొందరు న్యాయమూర్తులకు ఇక్కడ భూములు ఉన్నాయనీ, పరస్పర విరుద్ధ ప్రయోజన అంశం వర్తిస్తుందనీ ప్రభుత్వం పేర్కొంది. విచారణ సందర్భంలో న్యాయమూర్తులు ఫలానా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఎక్కువ భాగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న భావన కలి గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన వైపు వీక్ పాయింట్‌ను సమీ క్షించుకున్నట్లు అనుకోవాలి. శాసనమండలిలో అప్పట్లో జరిగిన పరి ణామాల ఆధారంగా కోర్టువారు వ్యతిరేక తీర్పు ఇస్తే, అది ప్రభు త్వానికి చికాకు అవుతుంది. ఆ తర్వాత మూడు రాజధానుల అంశంపై ముందుకు వెళ్లడంలో చిక్కులు రావచ్చు.
రాజకీయంగా చూస్తే ఈ పరిణామాల వల్ల వైసీపీకి పెద్ద నష్టం ఉండదు. మూడు రాజధానులపై ముందుకు వెళితే ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషిస్తారు. వెళ్లలేకపోతే, రాయల సీమ, ఉత్తరాంధ్రలలో టీడీపీపై పూర్తి వ్యతిరేకత రావచ్చు. ఇక బీజేపీ తన డబుల్ గేమ్ ఆరంభించినట్లుగా ఉంది. కర్నూలులో హైకోర్టు కావాలన్న డిమాండుతో గతంలో బీజేపీ ఆందోళనలు చేసింది. కానీ అమరావతి రైతుల పేరుతో సాగుతున్న పాదయాత్రలో వీరు పాల్గొని ఒకే రాజధాని ఉండాలన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు వీరు ఇలా చేశారని చెబు తున్నారు. అదే నిజమైతే బీజేపీ ఇంతగా డబుల్ గేమ్ ఆడటానికి బహుశా టీడీపీ నుంచి బీజేపీలో సుజనా చౌదరి, సి.ఎం. రమేష్ వంటివారి పెత్తనం పెరగడమే కారణం కావచ్చు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అభివృద్ధి అవుతుందా అని కొందరు అంటున్నారు. అది అవుతుందా, కాదా అన్నది వేరే విషయం. కోట్లాది ప్రజల మనోభావాలను గౌరవించకపోతే మరో తలనొప్పిగా మారవచ్చు. రాజధాని రైతుల పేరుతో సాగుతున్న పాదయాత్రకు నిరసనగా రాయలసీమలో ర్యాలీలు జరుగుతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని ఆశపెట్టి, దానిని నెరవేర్చకపోతే అది కూడా సమస్యలకు దారి తీయవచ్చు. అమరావతిలో శాసన రాజధాని ఉండాలన్నది ప్రభుత్వ అభిమతం. ముఖ్యమంత్రి జగన్ ఈ కొత్త బిల్లులు ప్రవేశ పెట్టడానికి ఎంతకాలం తీసుకుంటారో చెప్పలేం. ఒక ఏడాది పట్టవచ్చన్న అంచ నాలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుకడుగుగా కనిపించే వ్యూహాత్మక ముందడుగు అని ఎందుకు అనవలసి వస్తున్నదంటే, వర్తమాన పరిస్థితులను గమనంలోకి తీసుకుని చట్టాలను వెనక్కి తీసుకోవడం ద్వారా కొన్ని సమస్యల నుంచి తప్పుకుని, ఆ తర్వాత అనుకూల వాతావరణం ఏర్పాటు చేసుకుని మూడు రాజధానుల ప్రతిపాదనపై ముందుకు వెళ్లే అవకాశం ఉండటమే. హైకోర్టు ఈ కేసును డిసెంబర్ 27కి వాయిదా వేస్తూ, అభివృద్ధి పనులపై ఉన్న స్టేలను తొలగించడం ఒకింత శుభపరిణామం అని చెప్పాలి. అదే సమయంలో కార్యాలయాల తరలింపుపై స్టే కొనసాగించింది. ఈ చట్టాల ఉపసంహరణకు సంబంధించిన బిల్లులను గవర్నర్ ఆమో దించవలసి ఉంది కనుక కోర్టు కేసును వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి జగన్ సాధారణంగా ఒకసారి ఒక నిర్ణయం తీసు కున్న తర్వాత వెనక్కి వెళ్లరన్నది ఎక్కువ సందర్భాలలో రుజువైంది. దానికి తగినట్లే అసెంబ్లీలో ప్రస్తుతానికి సంబంధిత చట్టాలను వెనక్కి తీసుకున్నా, మళ్లీ బిల్లులు పెడతామని నిర్మొహమాటంగా చెప్పారు. అది ఆయన కమిట్‌మెంట్‌గా భావించవచ్చేమో! ఇది నెరవేరితే ప్రస్తు తానికి వెనుకడుగుగా కనిపించే ఈ నిర్ణయం అప్పుడు వ్యూహాత్మక ముందడుగు కావచ్చు.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment