యాభై ఏళ్లుగా అమెరికా మహిళలు ఆస్వాదిస్తున్న అబార్షన్ హక్కు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్జర్వేటివ్ న్యాయమూర్తులు అబార్షన్ చట్టాన్ని రద్దు చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్ జడ్జీల మెజారిటీ ఉన్న సుప్రీంకోర్టు ఈ విషయమై వెలువరించాల్సిన తీర్పుపాఠం లీక్ కావడం సంచలనమైంది. దీంతో తమ శరీరం మీద నిర్ణయాధికారం తమదేనంటూ అమెరికా మహిళలు వేలాదిగా వీధుల్లోకి వస్తున్నారు. అందుకే అబార్షన్లపై నిషేధం విధించడం ప్రజావ్యతిరేకతను కొనితెస్తుందని రిపబ్లికన్లకు తెలుసు. కాబట్టే లీక్ అయిన తీర్పుప్రతిపై కాకుండా లీక్ కావడాన్నే సమస్యగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. గతేడాది అమెరికా కాంగ్రెస్ భవనంపై జరిగిన దాడిని మించిన పెద్ద సంక్షోభంలోకి అమెరికా కూరుకుపోనుంది.
అమెరికా మరో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. గత సంవత్సరం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తృణీకరించడానికి అమెరికా ప్రతినిధుల సభ ఆవరణపై పథకం ప్రకారం జరిగిన దాడి కంటే మరింత తీవ్రమైన సంక్షోభంగా ఇది మారనుంది. అయితే తాజా సంక్షోభంలో అమెరికన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కీలకపాత్ర పోషించ నున్నారు. వాస్తవానికి అబార్షన్లు ఉండాలా, వద్దా అనే విషయంలో 1960ల నుంచి అమెరికా రెండుగా చీలిపోయింది.
‘రో వర్సెస్ వేడ్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో అమెరికాలో అబార్షన్ హక్కులకు రక్షణ లభించింది. రో అంటే ఆబార్షన్ల కేసులో అప్పీలుదారు అయిన నోర్మా మెక్‌కార్వే మారుపేరు. వేడ్ అంటే డిస్ట్రిక్ అటార్నీ హెన్రీ వేడ్ మారుపేరు. నోర్మా తన మూడవ గర్భాన్ని తొలగించుకోవాలని భావించినప్పుడు హెన్రీ వేడ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 1973లో చట్టంగా మారినప్పటినుంచీ, సుప్రీంకోర్టులోని కన్జర్వేటివ్ న్యాయమూర్తులు అబార్షన్ చట్టాన్ని రద్దు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారు. అనేక కేసుల్లో అబార్షన్లను చట్టవిరుద్ధం అని ప్రకటించడానికి పలు ప్రయత్నాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో వీరికి సమయం కలసి వచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాస నాల్లో జడ్జీల మరణం, రిటైర్మెంట్ ఫలితంగా రిపబ్లికన్ అధ్యక్షుడు ట్రంప్ ఉన్నత న్యాయస్థానంలో మూడింట ఒకవంతు స్థానాలను రైట్ వింగ్ మెజారిటీతో స్పష్టంగా భర్తీ చేశారు.
అయితే యాభై ఏళ్ల క్రితం నాటి రో వర్సెస్ వేడ్ కేసును తిరగ దోడటం కోసం కొత్త న్యాయమూర్తులను ట్రంప్ నియమించలేదు. మొదట్లో ట్రంప్ అబార్షన్‌కు అనుకూలంగా ఉండేవారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న తొలిదశలో అస్పష్ట వైఖరితో ఉండేవారు. అయితే వైట్ హౌస్ అత్యున్నత పదవికి పార్టీ నామినేషన్ విషయంలో తనకు అనుకూలతను ఏర్పర్చగలదని స్పష్టం కాగానే ట్రంప్ ఒక్కసారిగా అబార్షన్ల వ్యతిరేకిగా మారిపోయారు.
డెమొక్రాటిక్ అభ్యర్థిగా జో బైడెన్ విజయంలో చట్టబద్ధత లేదనీ, ఆయన అధ్యక్ష పదవి చెల్లదనీ న్యాయస్థానాల్లో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టులో తాను నియమించిన రైట్ వింగ్ నామినీలు తనకు ఉపయోగపడతారని ట్రంప్ భావించారు. అయితే సుప్రీంకోర్టులో ఆయన నియమించిన నామినీలు 2020లో అమెరికన్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ, ఫలితాలకు వ్యతిరేకంగా రిపబ్లికన్లు పెట్టిన కేసులను తోసి పుచ్చారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను రద్దు చేసేటటువంటి నిర్ణయా లను తీసుకోవడానికి ఇతర కన్జర్వేటివ్ న్యాయమూర్తులు కూడా తిరస్కరించారు.
అధ్యక్ష పదవిని మరోసారి ఆకాంక్షిస్తున్న ట్రంప్ వ్యక్తిగత అదృ ష్టాన్ని ఎత్తిపెట్టడం కంటే సుప్రీంకోర్టులో మితవాద న్యాయమూర్తుల పాత్ర పోషణ మరింత లోతుగా ఉంటూవస్తోంది. పైగా వారి ప్రయోజనాల విలువ అధ్యక్ష పదవి విలువ కంటే ఎక్కువ. ఇంకా పుట్టని బిడ్డకు జన్మించే హక్కు అనేది అమెరికాలో చాలామంది కన్జర్వేటివ్‌లకు చెక్కుచెదరని విశ్వాసంగా ఉంటోంది.
డిజిటల్ న్యూస్ అవుట్‌లెట్ అయిన ‘పొలిటికో’ అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదాను ప్రచురించి సంచలనం కలిగించింది. ఈ తీర్పులో తదుపరి మార్పులు ఏవీ చేయనట్లయితే అతి త్వరలో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పు సారాంశం వాస్తవంగానే అబార్షన్లను రద్దు చేయనుంది. ఆ మరుసటి దినమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఒక ప్రకటన చేస్తూ ముందుగానే లీక్ అయిన తీర్పు ముసాయిదా సాధికారిక డాక్యుమెంటేనని చెప్పేశారు. పొలిటికో ప్రచురించిన కథనాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి వెంటనే నిర్ధారించేశారంటే, అమెరికా సంస్థలు, ప్రత్యేకించి దాని ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా తిరుగులేని శక్తికి అదొక తిరుగులేని సాక్ష్యంగానే చెప్పాల్సి ఉంటుంది.
సుప్రీంకోర్టు అబార్షన్లను రద్దు చేస్తూ తీర్పు ప్రకటించనుందని ప్రధాన న్యాయమూర్తి ప్రకటన సూచించిన వెంటనే అమెరికాలో ఉదారవాద నగరాలైన న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్, చికాగో వంటి నగరాల్లో వేలాదిమంది మహిళలు తమ శరీరాలపై, తమ జీవితంపై నిర్ణయించుకునే హక్కు తమదేనని నినదిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. టెక్సాస్, ఉతాహ్ వంటి కన్జర్వేటివ్ భావజాలాన్ని విశ్వసించే నగరాల్లో కూడా మహిళలు వీధుల్లోకి వచ్చారు.
రిపబ్లికన్లు గానీ, రో వర్సెస్ వేడ్ కేసును తిరగదోడాలని భావిస్తున్న కన్జర్వేటివ్ మద్దతుదారులు గానీ కాస్త జాగ్రత్త పాటిం చారు. లీకయిన సుప్రీంకోర్టు తీర్పుపై ఉదారవాదుల తీవ్ర ఆందోళనా స్వరాలను వీరు ఎదుర్కోలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆబార్షన్లపై నిషేధం విధించడం అనేది ప్రజావ్యతిరేకతను కొని తెస్తుందని వీరికి తెలుసు. కాబట్టే లీక్ అయిన సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపై కాకుండా లీక్ కావడాన్నే పెద్ద సమస్యగా మార్చడానికి వీరు ప్రయత్నిస్తున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకటించడానికి ముందుగా రాబోయే కొద్ది వారాలు లేదా నెలలపాటు అమెరికన్ వీధుల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని అమెరికాలో భయాందోళనలు కలుగు తున్నాయి. అలాగే ప్రజా ఒత్తిడి కారణంగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును కాస్త మారిస్తే కూడా అమెరికాలో హింస చెలరేగడం ఖాయ మని చాలామంది భావిస్తున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మహిళలకు ఎంపిక హక్కు ఉంటుందని విశ్వసించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సుప్రీంకోర్టు తీర్పు లీక్ కావడం దేవుడు పంపిన బహుమతి కావచ్చు. వచ్చే నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లోనూ పరాజయం తప్పని ప్రమాదాన్ని బైడెన్ ఎదుర్కొంటు న్నారు. అయితే అబార్షన్లను చట్టబద్ధం చేసిన రో వర్సెస్ వేడ్ కేసులో తీర్పును శాశ్వతం చేయడానికి జరిగే ప్రయత్నాలు, మహిళల పోరాటాలు ఇప్పుడు డెమొక్రాటిక్ పార్టీ పునాదిని మరింతగా బలో పేతం చేయనున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛను అమెరికన్లు జన్మహక్కుగా భావిస్తారని తెలిసిందే.
సుప్రీం కోర్టు తీర్పు లీక్ కావడాన్ని రిపబ్లికన్లు సమస్యగా మార్చడంలో వ్యూహాత్మక కారణం ఉంది. కానీ దీన్ని వారు బహిరంగంగా మాట్లాడలేరు. ఎందుకంటే అది ప్రాథమిక ప్రజాతంత్ర సూత్రాలనే అపహస్యం చేస్తుంది. చాలాకాలంగా వీరు తమ కన్జర్వేటివ్ ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి న్యాయస్థానాలను, మిత వాద న్యాయమూర్తులను ఉపయోగించుకుంటూ వస్తున్నారు. ఈ సమస్యను రిపబ్లికన్లు నేరుగా చేపడితే ఏ ఎన్నికల్లో అయినా వీరు ఓటమి చవిచూడక తప్పదు. స్వేచ్ఛాయుత ప్రజల ఎంపికలో వీరు కుప్పగూలక తప్పదు. 2000 సంవత్సరంలో అమెరికా సుప్రీంకోర్టు జోక్యం కారణంగానే రిపబ్లికన్ అభ్యర్థి జార్జి వి. బుష్ అమెరికా అధ్యక్షు డయ్యారు. పాపులర్ ఓటును బుష్ గెల్చుకోలేకపోయారు. ఎలక్టోరల్ కాలేజీలో బుష్ సాధించిన మెజారిటీనే ఆయన్ని అధ్యక్షుడిని చేసింది. ఉన్నత న్యాయ స్థానం తీర్పు దానికి దోహదపడింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అమెరికా అధ్యక్షుడు నియమి స్తారు. అయితే వీరి నామినేషన్‌ని సెనేట్ నిర్ధారించాల్సి ఉంటుంది. ఒకసారి జడ్జీలు పదవిలోకి వచ్చాక వారు జీవితకాలం పాటు జడ్జీ లుగా ఉంటారు. వీరు ఎవరికీ జవాబుదారీగా ఉండరు. అందుకనే 233 సంవత్సరాలుగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తు లుగా 17 మంది మాత్రమే ఉంటూ వచ్చారు. దీన్ని మార్చడా నికి బైడెన్‌కు అవకాశం వచ్చింది. తన ఎన్నికల ప్రచారంలో ఆయన జడ్జీల శాశ్వత నియామకం గురించి లేవనెత్తారు కూడా. కానీ వైట్ హౌస్‌లోకి వెళ్లాక ఆయన దాన్ని వదిలేశారు.
వ్యాసకర్త: కేపీ నాయర్
వ్యూహాత్మక విశ్లేషకులు
(‘ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
అబార్షన్లపై అమెరికాలో మళ్లీ రచ్చ
Published Fri, May 20 2022 12:47 AM | Last Updated on Fri, May 20 2022 12:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment