పేకమేడలా కూలిపోయిన కంచుకోట! | Kuppam Municipality Election Result: Doctor Vijayakumar Analysis | Sakshi
Sakshi News home page

పేకమేడలా కూలిపోయిన కంచుకోట!

Published Fri, Nov 19 2021 4:26 PM | Last Updated on Fri, Nov 19 2021 4:26 PM

Kuppam Municipality Election Result: Doctor Vijayakumar Analysis - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్ఠా త్మకంగా జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని ప్రథమంగా చెప్పవచ్చు. కుప్పం ఎన్నికల తీర్పు కోసం 17వ తారీఖున దేశం మొత్తంగా ఎదురుచూసింది. కారణం ఇది చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాదాపు 32 ఏళ్లుగా కుప్పం చంద్రబాబు అడ్డాగా, ఆయన కంచుకోటగా చెబుతూ వచ్చారు. 1983లో చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమి చవిచూశారు. తరువాత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి తన జన్మస్థలమైన చంద్రగిరి నియోజకవర్గాన్ని కాదని చిత్తూరు జిల్లా ఆఖరులో, కర్ణాటక – తమిళనాడు సరిహద్దులో ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి 1989లో మొదటిసారి గెలుపు సాధించాడు.

ఈయన విజయ యాత్రకు వైఎస్సార్‌ సీపీ 2019 నుండి బ్రేకులు వేసింది. జగన్‌ పార్టీ వచ్చాక సంక్షేమ ఫలాలు ఇంటింటికీ అందడంతో ప్రజల్లో ఎనలేని చైతన్యం వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులకు తప్ప చంద్రబాబు వల్ల తమకు ఎలాంటి మేలు జరగలేదని గ్రహించారు. ఏడెనిమిది సార్లు వరుస విజయాలతో చంద్రబాబుకు కుప్పం ప్రజలను బాగు చేయాలన్న బుద్ధి మాత్రం పెరగలేదు.  ఇన్నేళ్లుగా చంద్రబాబు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోవడంతో ఇప్పటికీ 50 వేలమంది పేదలు పొరుగు రాష్ట్రానికి వలస వెళుతుంటారు. ఈరోజు కుప్పం ప్రజల హృదయంలో చంద్రబాబు పటం పూర్తిగా చెరిగిపోయింది. దీంతోనే చంద్రబాబు చక్రం రివర్స్‌ ఆరంభం అయింది.

మొన్న జరిగిన మండల ఎన్నికల్లో, సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు పార్టీకి పెద్ద గండే కొట్టారు. జగన్‌ పార్టీ 70 శాతం పైగా సీట్లను గెలుచుకొని చంద్రబాబుకు కనువిప్పు కలిగించింది. ఈనెల 14న జరిగిన కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, లేకుంటే కుప్పంపై తాను పట్టు కోల్పోతానని బాబు బృహత్తర పథకం రూపొం దించారు. అక్టోబర్‌ 29, 30 తారీఖులలో కుప్పంలో పర్యటించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. సెంటిమెంట్లు కూడా తీసుకొచ్చారు. చివరికి ఒక వీధి రౌడీలా మీసం తిప్పే మాటలు కూడా చెప్పారు. కుప్పం ప్రజలే నాకు దేవుళ్ళు అన్నారు. తన అడ్డాలో మరొకరికి చోటే లేదన్నారు. రాజకీయాల్లో తన సమకాలికుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పట్టుకుని అనరాని మాటలు అన్నారు. ఆ మాటలతో కుప్పం ప్రజలు నివ్వెరపోయారు. 2019 ఎన్నికల్లో ఏ నాయకులపైన ప్రజలు తిరగబడ్డారో ఆ టీడీపీ నాయకులు మున్సిపల్‌ ఎన్నికల్లో చక్రం తిప్పారు. వీరి కుట్రలు, మోసాలను తెలిసిన కుప్పం ఓటర్లు ఫలితాల్లో తెలుగుదేశం నడ్డి విరిచారు. 

ఏ నాయకుడికైనా కావాల్సింది ప్రజల విశ్వాసం అది కోల్పోయినవాడు నాయకుడే కాదు. ఉత్తుత్తి మాటలతో, శూన్య హస్తాలతో ఎవరూ అన్ని వేళలా ప్రజలను మోసం చేయలేరు. కొంతకాలమే అందరినీ మోసం చేయగలరు. వయసు పెరిగేకొద్దీ చంద్రబాబు ఎందుకో ప్రజల అవి శ్వాసం పూర్తిగా కోల్పోతున్నారు. కారణాలు ఇప్పటికీ ఆయన విశ్లేషించుకోవడం లేదు. పచ్చ పత్రికలు ఉన్నాయి కదా అని అవాకులు చవాకులు మాట్లాడి సంబరపడకూడదు. నానాయాగీ చేసినంత మాత్రాన విజయం వరించదని కుప్పం తీర్పే తెలుపుతున్నది. తెలుగుదేశం పార్టీ ఎంతో రచ్చ చేసింది. చివరికి కోర్టు తలుపులు కూడా తట్టి కౌంటింగ్‌కు అబ్జర్వర్‌ను పెట్టేలా చేశారు. ఎన్ని విమర్శలు చేసినా, కోర్టులు చెప్పినా ప్రజలు మాత్రం ‘జై జగన్‌’ అన్నారు. కుప్పంలో వైఎస్సార్‌సీపీ గెలుపును చంద్రబాబు కలలో కూడా ఊహించలేదు. తెలుగుదేశం కేవలం ఆరు స్థానాలలో గెలిచి, చావుతప్పి కన్నులొట్టపోయినట్లు అయింది. చంద్రబాబు కలల కంచుకోట పేకమేడలా కూలిపోయింది. 

కుప్పం విజయం పూర్తిగా ఇద్దరికీ చెందుతుంది. ఒకరు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి, మరొకరు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నవరత్నాల పథకాల ద్వారా కుప్పంలోని ప్రతి వ్యక్తి మనసును జగన్‌ గెలుచుకున్నారు. ఇక ప్రజలను పోలింగ్‌ స్టేషన్ల వైపు పరుగులెత్తించిన ఘనత పెద్దిరెడ్డిదే. కుప్పంలో ఎక్కువ శాతం మంది పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. కుప్పం పట్టణంలోని ప్రతి ఇంటికి జగన్‌ ఫలాలు అందాయి. ఎక్కడున్నా, ఏ ఇంట్లో వున్నా, పింఛన్లుగానీ, రైతు భరోసా డబ్బులు కానీ కరెక్ట్‌గా అందడంతో కుప్పం ప్రజల్లో జగన్‌ పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంచింది. 

రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. చంద్రబాబు ఇంతకాలం కుప్పంలో హాయిగా గుర్రపు స్వారీ చేస్తూ వచ్చారు. ఆయన గుర్రం అలసి సొలసి చెక్క గుర్రంగా మారి చతికిలపడింది. చంద్రబాబు తన తప్పులు తాను తెలుసుకోకుండా జగన్‌ని తిట్టడమే ప్రధానంగా పెట్టుకోవడం చాలా తప్పు. గెలిస్తే తమ సామర్థ్యం, ఓడితే ఎదుటివారి దౌర్జన్యం, గూండాగిరి అని చెప్పడం ఏ పార్టీకైనా తగదు. జగన్‌ అధికారం చేపట్టి 30 నెలలు అవుతున్నది. ఇప్పటికైనా తెలుగుదేశం ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. మూస ధోరణిలో వెళితే ఆ పార్టీకి నూకలు చెల్లినట్లే. కుప్పం ప్రజలకు చంద్రబాబు దూరమై, తాగునీరు, కనీస అభివృద్ధి కూడా చేయక, హంద్రీ–నీవా నీళ్లు తెప్పిస్తానన్న మాట వమ్ముచేసి ప్రజల్లో తన స్థానాన్ని కోల్పోయారు. 

వైఎస్‌ జగన్‌ 2019లానే జనం హృదయాల్లో ఇప్పటికీ నిలిచి ఉన్నారు. ‘ప్రజలే దేవుళ్ళు’ అని ఎన్టీఆర్‌ ప్రతి సభలో చెప్పేవారు. ఆ మాటల్ని పూర్తిగా నిజం చేస్తున్న వ్యక్తి జగన్‌. పెద్దిరెడ్డి కుప్పంలో వైసీపీ జెండా ఎగరేసి చంద్రబాబు కుంభస్థలాన్ని కొట్టారు. దీంతో చంద్రబాబు నిర్మించుకున్న సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. ఓటమిని తెలుగుదేశం పార్టీ సమగ్రంగా విశ్లేషణ చేసుకోవడం మాని మాకు 13 శాతం ఓట్లు పెరిగాయి అని డంబాలు పలకడం వారికే నష్టం. ఓట్ల శాతాలు చర్చలకు పనికొస్తాయి తప్ప ప్రజలకు ఉపయోగపడవు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థలను మేనేజ్‌ చేయడంతోనో, పచ్చపత్రికల ప్రచారంతో సంబరపడటమో మాని ప్రజల్లోకెళ్లి వాళ్లతో మమేకమై హృదయాన్ని చూరగొనాలి.

డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ 
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement