సొంతిల్లు కడుతున్నానని అఫిడవిట్లో చెప్పిన చంద్రబాబు
రెండేళ్ల కిందటే స్థలం కొనుగోలు
ఇప్పటికీ నిర్మాణంలోనే ఇల్లు
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గ ప్రజలు 35 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబును వారి సొంత మనిషిలా ఆదరిస్తూ, ఆయన్ని గెలిపిస్తున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం ఆ నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికీ అదేదో అద్దె ఇంటిలానో, తనకు పట్టని ప్రాంతంలాగానో వ్యవహరిస్తున్నారు తప్పితే, ఆ నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండాలని, అక్కడ తనకంటూ ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఎప్పుడూ భావించలేదు. చంద్రబాబునాయుడు 1983 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆయన ఆ నియోజకవర్గాన్ని ఓ ఓట్ల యంత్రంగానే చూసి, ఏమాత్రం అభివృద్ధి చేయకపోయినప్పటికీ, అక్కడి ప్రజలు మాత్రం చంద్రబాబును ఆదరిస్తూనే వచ్చారు. అయినా చంద్రబాబు ఆ ప్రాంతంపై శీతకన్నే వేశారు. ఆ ప్రాంతం తనను ఆదరిస్తున్నందుకు గుర్తుగా అయినా ఒక ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ చేయలేదు. 1984లో టీడీపీలో చేరగానే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో స్థలం కొని, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ ఆయన సొంతిల్లు కట్టుకోలేదు. తాను రాజధానిని నిర్మిస్తానని గొప్పలు చెప్పుకొన్న అమరావతిలోనూ కట్టుకోలేదు.
విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉండగానే హైదరాబాద్‌లోనే మరో అత్యాధునిక భవంతిని నిర్మించుకున్నారు. అటు సొంత నియోజకవర్గం కుప్పంని, ఇటు ఆయన రోజూ చెప్పే అమరావతి పైనా ఆయనకు ఓట్ల యావే తప్ప వాటిపై ప్రేమ లేదన్న విషయాన్ని బయటపెట్టుకున్నారు. ఆయన సొంతింటితోపాటు ఆస్థిపాస్తులు చాలావరకు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కుప్పం ప్రజలకూ తొలిసారి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయి. దీంతో కుప్పం ప్రజల్లోనూ ఆలోచన మొదలైంది. దీంతోపాటు సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదా అని అందరూ ఎండగట్టడం ప్రారంభించారు.
దీంతో 2022లో అక్కడ స్థలాన్ని కొని, ఇల్లు కడుతున్నట్లు చంద్రబాబు హడావుడి చేశారు. అక్కడ తాను ఇల్లు కట్టుకుంటున్నట్లు శుక్రవారం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోనూ పేర్కొన్నారు. శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ పరిధిలో వ్యవసాయేతర భూమి 95.23 సెంట్లు ఉందని, దాని విలువ రూ.77.33 లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అక్కడే ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభమై సంవత్సరంన్నర అవుతోంది. సాధారణంగా ఒక సొంతింటి నిర్మాణం కొన్ని నెలల్లో పూర్తవుతుంది. కానీ, చంద్రబాబు ఇంటి నిర్మాణం మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. పూర్తి చేస్తారో లేదో కూడా తెలియదు.
భారీగా పెరిగిన ఆస్తులు
అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో భారీగా ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలు, కేసులు ఉన్న చంద్రబాబు.. అధికారంలో లేకున్నా ఆదాయానికి లోటు లేదన్న విషయాన్ని ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తుల విలువలు చెబుతున్నాయి. తనపై ఉన్న కేసులు, తన ఆస్థిపాస్తుల వివరాలను అఫిడవిట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం గత ఐదేళ్లలో చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తుల విలువ 40 శాతం పెరిగింది. 2014లో రూ.176 కోట్లున్న వారి ఆస్తుల విలువ 2019 ఎన్నికల అఫిడవిట్‌లో రూ.700 కోట్లుగా చూపించారు.
ప్రస్తుతం వారిద్దరి ఆస్తుల విలువ రూ.936.58 కోట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. రూ.121.41 కోట్ల చరాస్తులు, రూ.815.17 కోట్ల స్థిరాస్తులు చూపించారు. భువనేశ్వరికి హెరిటేజ్ ఫుడ్స్‌లో ఉన్న షేర్ల విలువే రూ.763 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ఆమెకు రూ.1.84 కోట్ల విలువైన బంగారం, 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు తెలిపారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చంద్రబాబుకు తన కొడుకు లోకేశ్‌తో ఉమ్మడిగా ఉన్న ఇంటి ప్రస్తుత విలువ రూ.70.20 కోట్లుగా చూపించారు.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దీని విలువ రూ.2 కోట్లకుపైనే ఉంటుంది. నారావారిపల్లె శేషాపురంలో ఉన్న ఇల్లు విలువ రూ.43.66 లక్షలుగా చూపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది కూడా సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. తన చేతిలో రూ.11,560 నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 2,45,378, ఒక అంబాసిడర్ కారు ఉన్నట్లు పేర్కొన్నారు.
24 క్రిమినల్ కేసులు.. అందులో 8 అవినీతి కేసులే
తాను 24 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు అఫిడవిట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. అందులో 8 కేసులు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో కూడినవి. ఆయన అరెస్టయి జైల్లో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు అందులో ఒకటి.
ఉచిత ఇసుక పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, మద్యం డిçస్టలరీలు, బ్రాండ్‌లకు అక్రమంగా అనుమతులివ్వడం, రాజధాని ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ కాంట్రాక్టు జారీలో అక్రమాలు, రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించిన కేసులు తనపై విచారణలో ఉన్నట్లు ఆయన అఫిడవిట్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment