ఉక్రెయిన్ సరిహద్దు దేశాల ప్రయాణానికి వెళ్లడమా మానడమా అని అనుకుంటుండగా ‘అర్బన్ వన్’ రేడియో నుంచి కాల్.
‘‘అనుదినమూ ప్రసారమయ్యే మా ‘మార్నింగ్ హసిల్’ కార్యక్రమానికి ఇవాళ గానీ, రేపు గానీ, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగిసేలోపు ఎప్పుడైనా గానీ.. రెండు నిముషాలు మీ వాయిస్ ఇవ్వగలరా మిస్ వైస్ ప్రెసిడెంట్?..’ అని హెడ్‌క్రాక్ అనే వ్యక్తి హృదయవిదారక విజ్ఞప్తి!
నవ్వు ఆపుకొన్నాను.
కాల్‌ని హోల్డ్ చేసి, ‘‘ఎవరతను?’’ అని ఇంటర్‌కమ్‌లో సబ్రీనాను అడిగాను. సబ్రీనా వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ.
‘‘యా.. మేమ్. హెడ్‌క్రాక్ అనే ఆ వ్యక్తి, అతడికి జోడీ అయిన అమ్మాయి లోరెల్.. ఇద్దరూ కలిసి రోజూ రేడియోలో ‘మార్నింగ్ హసిల్’ ని హోస్ట్ చేస్తుంటారు. ఉదయరాగంలా ‘మార్నింగ్ హసిల్’ ఒక ప్రాతఃకాల కర్ణకఠోర కార్యక్రమం..’’ అని గలగలా నవ్వుతూ చెప్పింది సబ్రీనా.
‘‘వెల్ మిస్టర్ హెడ్‌క్రాక్! మీ విజ్ఞప్తిని నిరాకరించేందుకైతే నేను అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవలేదు..’’ అన్నాను గట్టిగా నవ్వుతూ.
ఇంటర్వ్యూ మొదలైంది.
‘‘థ్యాంక్యూ మిస్ వైస్ ప్రెసిడెంట్.. మీరిప్పుడు మా శ్రోతలకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు జరుగుతోందో రెండు మూడు తేలికపాటి మాటల్లో చెప్పాలి..’’ అన్నాడు హెడ్‌క్రాక్.
‘‘రెండు మూడు తేలికపాటి మాటల్లోనా! ఓకే దెన్. కానీ మీరన్నట్లు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం చేసుకోవడం లేదు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందంతే..’’ అన్నాను.
‘‘రైట్ మిస్ హ్యారిస్. మీరొక సాధారణ సిటిజెన్‌గా సాధారణమైన భాషలో మాత్రమే మా శ్రోతలకు చెప్పండి. ఉక్రెయిన్‌పై రష్యా ఎందుకు దాడి చేస్తోంది?’’.
‘‘యా.. మిస్టర్ హెడ్‌క్రాక్... నాటో అని, వార్సా అని ప్రపంచంలో రెండు గ్రూపులు ఉన్నాయి. నాటో అమెరికా గ్రూపు; వార్సా రష్యా గ్రూపు. అమెరికా గ్రూపులో పశ్చిమ ఐరోపా దేశాలు ఉన్నాయి. రష్యా గ్రూపులో తూర్పు ఐరోపా దేశాలు ఉన్నాయి..’’
‘‘నో నో నో నో.. మిస్ హ్యారిస్. ఈ గ్రూపుల గొడవ లేకుండా విషయాన్ని మరింత తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పండి..’’ అన్నాడు హెడ్‌క్రాక్.
‘‘ముందు ఈ గ్రూపుల గొడవ గురించి చెబితేనే.. విషయం తేలికగా అర్థమౌతుంది మిస్టర్ హెడ్‌క్రాక్..’’ అన్నాను.
‘‘కానీ మీరేం చెప్పబోతారో మా శ్రోతలు చక్కగా ఊహించగలరు మిస్ హ్యారిస్. అందరూ చెబుతున్నట్లే.. 1991లో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై 15 దేశాలుగా విడిపోయాక మళ్లీ వాటిని కలిపే ప్రయత్నంగా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందనేగా మీరూ చెబుతారు..’’ అన్నాడు హెడ్‌క్రాక్.
‘‘సరే. ఇంకోలా ట్రై చేస్తాను.. ఉక్రెయిన్ అన్నది ఐరోపాలోని ఒక దేశం. అది రష్యా పక్కనే ఉంది. రష్యా పెద్ద దేశం. ఈ పెద్ద దేశం ఆ చిన్న దేశంపై దాడి చేస్తోంది. అది తప్పు. మనం ఏ విలువల కోసం అయితే నిలబడ్డామో ఆ విలువలకు వ్యతిరేకమైన దాడి అది..’’ అని చెప్పాను.
‘‘బాగా చెప్పారు మిస్ హ్యారిస్. కానీ ఇంతకన్నా తేలికైన సమాధానం మీ నుంచి మా శ్రోతలకు లభించదా అని నేను ఆలోచిస్తున్నాను. పెద్ద దేశం, చిన్న దేశం; నాటో, వార్సా; పుతిన్ పన్నాగం, ఉక్రెయిన్ పరాక్రమం.. ఇవన్నీ అందరూ వింటున్నవీ, అందరూ చెబుతున్నవే కదా! అసలేమీ తెలియని వారికి కూడా అర్థమయ్యేలా చెప్పవలసి వచ్చినప్పుడు మనమూ అసలేమీ తెలియని వ్యక్తిగా మారి, విషయాన్ని తేలిగ్గా చెప్పలేమా..?’’ అంటున్నాడు హెడ్‌క్రాక్!!
ఉఫ్! ఏమీ తెలియని మనిషిగా ఎవరినీ మిగలనివ్వని ఈ ప్రపంచంలో.. దేనినైనా తేలిగ్గా చెప్పడం.. అంత తేలికా?!
ఎట్లీస్ట్.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినంత తేలికైతే కాదు.
-మాధవ్ శింగరాజు
కమలా హ్యారిస్ (యూఎస్ వైస్–ప్రెసిడెంట్) రాయని డైరీ
Published Sun, Mar 6 2022 1:40 AM | Last Updated on Sun, Mar 6 2022 1:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment