నిజమైన ప్రజానాయకుడు ప్రజలు కోరుకున్నది ఇవ్వడం కాకుండా ప్రజలకు ఏది అవసరమో అది చేస్తారు. అలా చేసిన వారే చిరకాలం ప్రజలలో ఉంటారు. అలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నేత వైఎస్సార్. తెలుగు రాష్ట్రాల వరకు నీటికి సంబంధించి ఆంగ్లేయుల తర్వాత సమగ్రమైన ప్రణాళికను రూపొందించినవారు వైఎస్సార్ మాత్రమే అని చెప్పక తప్పదు. కేసీ కెనాల్, కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ ఆంగ్లేయులను గుర్తుతెస్తే, పులిచింతల, పోలవరం, శ్రీశైలం కనీస నీటిమట్టం, పోతిరెడ్డిపాడు వెడల్పు, ప్రాణహిత చేవెళ్ల, దుమ్ముగూడెం టెయిల్ పాండ్, పాలమూరు ఎత్తిపోతల పథకం లాంటివి వైఎస్సార్‌ను గుర్తుకుతెస్తాయి. వైఎస్సార్ అన్ని ప్రాంతాల నీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలో కొందరు ఒకేసారి ప్రాజెక్టులు చేపట్టకుండా ప్రాధాన్యత క్రమంలో చేస్తే బాగుంటుందన్నారు. (చదవండి: ఇక్కడెవరైనా అమృతం తాగి ఉన్నారా? )
ఆ సమయంలో వైఎస్సార్, ‘అన్ని ప్రాంతాలకు ఉపయోగపడే ప్రాజెక్టుల రూపకల్పన చేసి ప్రజల ముందు ఉంచితే కాల క్రమంలో వాటిని ప్రజలు సాధించుకుంటారు’ అన్నారు. నేడు చాలా ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రజలు పోరాడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వాలు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. నాగార్జున సాగర్ జలాశయం నిర్మాణానికి నాటి ప్రభుత్వం 92 కోట్ల రూపాయల అప్పుతెచ్చి నిర్మించింది. అప్పు చేసి కట్టడం అవసరమా? అని చర్చ జరిగింది. అప్పును తీర్చడమే కాదు, అపారమైన సంపదను నీటి ప్రాజెక్టులు సృష్టిస్తాయని నాటి ప్రధాని నెహ్రూ ముందుకు సాగారు. వైఎస్సార్ కూడా అదే స్ఫూర్తితో ప్రాజెక్టుల విషయంలో వ్యవహరించారు.( చదవండి: అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం)
దశాబ్దాల కల పోలవరం నేడు సాకారం వైపు అడుగులు వేస్తోంది అంటే అందుకు వైఎస్ చొరవ కీలకం. వారు చేపట్టిన కుడికాల్వ పైనే పట్టిసీమ, ఎడమ కాల్వపై పురుషోత్తమ పట్నం రూపుదిద్దుకున్నాయి. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి వారి ఆలోచనే. డెల్టా అవసరాలకు పులిచింతల రూపకల్పన చేశారు. దుమ్ముగూడెం పథకం ఆయన దూరదృష్టికి ఉదాహరణ. ఆయనపై రాజకీయ కోణంలో పోతిరెడ్డిపాడు విషయంలో నాడు వివాదం చేశారు. నేడు తెలంగాణ ప్రాజెక్టులకు సీమలో తలపెట్టిన నిర్మాణాల వల్ల నష్టం అని విమర్శలు చేస్తున్న వారు గుర్తుకుతెచ్చుకోవాల్సిన అంశం దక్షిణ తెలంగాణలో ఏ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారో వాటి రూపకల్పన చేసింది వైఎస్సార్ అన్న విషయాన్ని మరువకూడదు.( చదవండి: నాకు తెలిసిన మహనీయుడు )
రాయలసీమ ఉద్యమం ప్రధాన లక్ష్యం నీరు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాడు వెడల్పు, శ్రీశైలం నీటిమట్టం, గండికోట రిజర్వాయర్, కుందూ నదిపై నిర్మాణాలు, గాలేరు నగరి, హంద్రీనీవా పనులకు ప్రాధాన్యత ఇచ్చినారు. నాడు వారు చేసిన కృషి వల్లే కొంత మేరకు అయినా రాయలసీమకు నీరు అందుతోంది. ప్రజానాయకుడు తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు వారి తర్వాత కూడా ప్రాధాన్యత కలిగివుంటాయి. అదే ఆ నాయకుడి దూరదృష్టిని తెలియజేస్తుంది.
- మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి
సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం
Comments
Please login to add a commentAdd a comment