భారత స్వాతంత్య్రోద్యమంలో హిందువులూ, ముస్లింలూ గాంధీజీతో కలిసి నడిచారు. అందులో కొందరు ముస్లింల గురించైనా తెలుసుకోవడం సముచితం. గాంధీజీ స్వగ్రామమైన పోరు బందర్‌కు చెందినవారు దాదా అబ్దుల్లా ఆందం జవేరీ. ఆయనకు దక్షిణాఫ్రికాలో వ్యాపారాలు న్నాయి. అక్కడి తన కంపెనీ న్యాయవాదు లకు సహకరించేందుకు గాంధీని దక్షిణాఫ్రికా పిలి పించుకున్నారు. భార తీయులు ఎదుర్కొం టున్న వివక్షను వివ రించి, పోరాడటానికి ‘నాటల్ ఇండియన్ కాంగ్రెస్’ స్థాపించారు. అధ్యక్షులుగా దాదా అబ్దుల్లా, కార్యదర్శిగా గాంధీజీ ఎంపికయ్యారు. ‘ప్రజాసేవ చేయాలనే కోరిక, దానికి కావలసిన శక్తి నాకు దాదా అబ్దుల్లా సాహచర్యంలోనే లభించాయి’ అని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారు.
దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారత్‌కు వచ్చీరాగానే చంపారన్ రైతాంగ పోరాటాన్ని భుజానికెత్తుకున్నారు. చంపారన్ రైతాంగ పోరాట నాయకులు షేక్ గులాబ్, ముహమ్మద్ మోనిస్ అన్సారీ ఆయనకు కుడిభుజంగా సహకరించారు. చంపారన్ రైతుల్లో గాంధీజీకి ఉన్న ఆదరణను పసిగట్టిన ఆంగ్ల అధికారి ఇర్విన్ ఆయన్ని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. ఆయన్ని భోజనానికి ఆహ్వానించి, విషమిచ్చి చంపే బాధ్యతను తన వంటమనిషి బతఖ్ మియా అన్సారీకి అప్పగించాడు. చంపితే ఊహకు అందని బహుమతులతో సత్కరిస్తాననీ, లేకపోతే నరకం చూపిస్తాననీ భయపెట్టాడు. కానీ బతఖ్ మియా తన ప్రాణాలకు తెగించి బాపూజీ ప్రాణాలు రక్షించాడు.
భారత స్వాతంత్య్ర చరిత్రలో ‘అలీ బ్రదర్స్’గా ప్రసిధ్ధి గాంచిన ముహమ్మద్ అలీ జౌహర్, షౌకత్ అలీ జౌహర్ అండ జాతీయోద్యమంలో గాంధీకి కొండంత బలాన్నిచ్చింది. వారితో ఆయన ఎంతగా కలిసిపొయ్యారంటే, ఆబాదీబానూకు తాను మూడో సంతానమని చెప్పుకుంటూ, ఆమెను అమ్మా అని పిలిచేవారు. ఉద్యమ అవసరాల కోసం గాంధీజీని ఆపద్బాంధవుడిలా ఆదుకున్న మరో సహచరుడు ఉమర్ సుభానీ. బొంబాయిలో ఏ మీటింగు జరిగినా అందులో సగానికి సగం ఉమర్ సుభానీ భరించేవారు. 1921లో ‘తిలక్ స్వరాజ్య నిధి’కి విరాళాలు సేకరించే సమయాన గాంధీజీకి బ్లాంక్ చెక్కు ఇచ్చి ‘ఎంత కావాలో రాసుకోండి’ అన్న ఉదార గుణ సంపన్నుడు సుభానీ.
దక్షిణాఫ్రికా నుండి కుటుంబంతో సహా గాంధీ వెంట భారతదేశానికి వచ్చేసిన మిత్రుడు ఇమాం అబ్దుల్ ఖాదిర్ బావజీర్. గాంధీజీ ఆయన్ని ప్రేమగా ‘ఇమాం సాబ్’ అని పిలుచుకునేవారు. ఆయన సతీమణి, ఇద్దరు కుమార్తెలు కూడా ఆశ్ర మంలోని ప్రెస్‌లో పని చేసేవారు. ఇమాం సాహెబ్ కూతురు ఫాతిమా బేగం వివాహాన్ని గాంధీ దగ్గరుండి జరి పించారు. గాంధీతో కలిసి నడిచిన మరో సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్. సరిహద్దు గాంధీగా ప్రసిద్ధుడు.
‘ఆయుధం పట్టుకొని యుద్ధం చేసే పఠాన్ కన్నా, అహింసను ఆయుధంగా ధరించిన ఈ పఠాన్ చాలా ప్రమాదకారి’ అని బ్రిటిష్ పాలకులతో అనిపించుకున్న ధీరోదాత్తుడు. ‘ఖుదాయి ఖిద్మత్గార్’ పేరిట భారత స్వాతంత్య్ర పోరాటానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శాంతికాముకుడు. 1969లో గాంధీజీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ఖాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ, ‘మీరు బుద్ధుడిని మరచిపోయినట్లుగానే గాంధీని మరచి పోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేటి దేశ పరిస్థితుల దృష్ట్యా స్వాతంత్య్రో ద్యమంలో ముస్లింల భాగస్వామ్యాన్ని ప్రజలకు పరిచయం చేయడం మన కర్తవ్యం. (నేడు గాంధీ జయంతి)
ఎం.డి. ఉస్మాన్ ఖాన్
వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్
మొబైల్: 99125 80645
Comments
Please login to add a commentAdd a comment