సరైన మార్గంలో కొత్త ప్రభుత్వం | New government on the right track | Sakshi
Sakshi News home page

సరైన మార్గంలో కొత్త ప్రభుత్వం

Published Sat, Dec 30 2023 3:34 AM | Last Updated on Sat, Dec 30 2023 3:34 AM

New government on the right track - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో సాధించిన విజయాన్ని గుర్తుచేస్తోంది. తెలంగాణ పాలనలో కూడా రాజశేఖర రెడ్డి స్ఫూర్తి కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ‘కక్ష సాధింపు ధోరణులు ఉండవు’ అన్న స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును పరామర్శించిన తీరూ, ఎన్నికల సమయంలో తమ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల వాగ్దానంతో పాటు తాము ప్రజా స్వామ్యబద్ధంగా పాలన చేయనున్నామనే వాగ్దానాన్నీ ఏడో గ్యారెంటీగా ఇస్తున్నామనీ పేర్కొనడం ప్రజల్లో ఆశను రేకెత్తిస్తున్నఅంశాలే! 

రేవంత్‌ రెడ్డి తీరు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి నైజాన్నీ, ఆయన స్వభావాన్నీ తలపి స్తున్నది. ఒకరకంగా తెలంగాణ నేటి ముఖ్య మంత్రి.. ఆ మహానేతచే ప్రభావితమయ్యా రేమో అనిపిస్తోంది. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్య మంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్‌ మీద తొలి సంతకం చేశారు. ‘ప్రజా దర్బారు’ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. ప్రజల్లో ఉండే పాల నను కొనసాగించారు. అనుచిత రాతలను మాత్రమే ఖండిస్తూ ప్రతికా స్వేచ్ఛను గౌర వించారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి కూడా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ప్రగతి భవన్‌ చుట్టూ ఆరడగుల ఎత్తులో పాతుకుపోయిన ఇనుపకంచెను తొల గించేశారు.

ప్రగతి భవన్‌ను ‘ప్రజా భవన్‌’గా మార్చారు. ‘ప్రజల సమస్యలు తెలుసుకోని పాలన ఏంటీ? ప్రజా వాణి వినని ప్రజా స్వామ్యం ఏంటని’ రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవచ్చని ‘ప్రజా వాణి’ పేరుతో ప్రజా దర్బా రును పునః ప్రారంభించారు. తామిచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచడం అనేరెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చారు. లక్ష ఉద్యోగాల హామీకీ కసరత్తు మొదలు పెట్టారు. రూ. 500కు సిలిండర్, కుటుంబానికి ఆర్థిక బాసటగా ఉన్న మహిళలకు నెల నెలా 2,500 రూపాయలు ఇవ్వడం వంటి హామీలకూ తెల్లరేషన్‌ కార్డుల వెరిఫై,మంజూరు వంటి ఎక్స్‌ర్‌సైజులు మొదలై పోయాయి. 

వీటన్నిటి కంటే ముందు... నాడు తెలుగుదేశం ఉప్పెనలో మిణుకు మిణుకు మంటూ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రె స్‌కి ఎలాగైతే రాజశేఖర రెడ్డి తన పాద యాత్రతో ఊపిరి పోసి మళ్లీ అధికారంలోకి తెచ్చారో... అలాగే తెలంగాణలో రేవంత్‌కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఎన్నికల సమయంలో సీనియర్‌ లీడర్లందరికీ సము చిత గౌరవం, బాధ్యతలూ ఇచ్చి మంచి ఫలి తాలు రాబట్టారు.

నాడు పాదయాత్రతో రాష్ట్ర అవసరాల మీద ఒక అంచనాకు వచ్చి ఎలా గైతే రాజశేఖర్‌ రెడ్డి సంక్షేమ పథకాలు.. అభి వృద్ధి ప్రణాళికలను రచించారో.. అలాగే రేవంత్‌ రెడ్డి కూడా ఎన్నికల కంటే ముందే రాష్ట్ర సమస్యల మీద ఒక అవగాహన ఏర్ప రచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతటా తిరిగి ఆ అవగాహన మీద ఒక స్పష్టతను తెచ్చుకున్నారు. నిండు అసెంబ్లీలో ‘మేం పాలకులం కాం సేవకులం’ అంటూ ఆయన చూపిన వినమ్రత, విజ్ఞతే ఆయన ప్రజాస్వామ్యయుత పాలనా నిబద్ధతకు ప్రత్యక్ష ఉదాహరణ. 

ఆ మాటను చెప్పడమే కాదు.. ఆ బాటలో నడుస్తున్నారు కూడా. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ శాఖ మొదలు శాఖ లన్నిటిలోని అవకతవకల మీద దృష్టి పెట్టారు. తద్వారా ఏ ప్రభుత్వమైనా తమ చర్యల పట్ల ప్రజలకు జవాబుదారీగా ఉండా లని చెబుతూ పాలనలో పారదర్శకత తీసు కొస్తున్నారు. డ్రగ్స్‌ వంటి వాటిని రాష్ట్రంనుంచి తరిమికొట్టేందేకు ఆయన పడుతున్న తాపత్రయం మన యువత పట్ల ఆయనకున్న కన్‌సర్న్‌ను చూపెడుతోంది. 

రాష్ట్ర అభివృద్ధి... పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం సమష్టి బాధ్యతగా భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన పాలనా దక్షత, విజన్‌తో తెలంగాణను 5 లక్షల కోట్ల రూపాయల రుణం నుంచి విముక్తం చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తారని యావత్‌ తెలంగాణ విశ్వసిస్తోంది.

- డా‘‘ వర్రె వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement