ఆయన నమూనా దేశానికే ఆదర్శం! | Prof Tatikonda Ramesh Article On Kcr Seven Years Rule Of Telangana | Sakshi
Sakshi News home page

ఆయన నమూనా దేశానికే ఆదర్శం!

Published Thu, Feb 24 2022 12:40 AM | Last Updated on Thu, Feb 24 2022 12:42 AM

Prof Tatikonda Ramesh Article On Kcr Seven Years Rule Of Telangana - Sakshi

ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమం, వనరుల వినియోగం, ఆధునికీకరణ, నవ కల్పనతో తెలంగాణ రాష్ట్రం అద్భుత మైన  ప్రగతిని సాధించింది. పారి శ్రామికీకరణ, వ్యవసాయం,  కుటీర పరిశ్రమలు, కుల వృత్తులకు ప్రోత్సా హకాలు, గ్రామీణాభివృద్ధి, పట్టణాభి వృద్ధి, ప్రజారోగ్యం, జీవన ప్రమాణాల పెంపు అంశాలలో ప్రగతిశీల రాష్ట్రంగా నిలిచింది. అనేక నూతన పథకాలకు రూపకల్పన చేసి సబ్బండ వర్గాల జీవితాలలో కాంతులు నింపింది. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, తలసరి ఆదాయం పెంపు, స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి రేటుని సాధించింది.
 
సాగునీటి వసతుల కల్పన వల్ల రాష్ట్రం అద్భుతమైన ఫలితాలను సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో జలకళను నింపింది. పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్, మిడ్‌ మానేరు, సింగూరు, ఎల్లం పల్లి, కిన్నెరసాని, దేవాదుల, మల్లన్న సాగర్‌ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. పాలమూరు–రంగారెడ్డి, భక్త రామ దాసు – సీతారామ ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయి. 

రాష్ట్రం ఏర్పడే నాటికి యాసంగి, వానాకాలం కలిపి 1.40 కోట్ల ఎకరాలు సాగులో ఉండగా 2021 నాటికి అది 2.09 కోట్లకు చేరింది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ప్రపంచంలోని 20 వినూత్న పథకాలలో ఒకటిగా ఐక్య రాజ్యసమితి ప్రకటించింది.  

రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు రైతులకు ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తోంది. గత ఏడేళ్ళ కాలంలో 33,722 కోట్లు ఖర్చు చేసి  2014లో 7,778 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు ఉత్పత్తిని  2021 నాటికి  16,623 మెగావాట్లకు పెంచింది. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ‘ఇన్నోవేషన్,  ఇంక్యుబేషన్, ఇన్‌ కార్పొరేషన్‌’ నినాదంతో నూతన పారి శ్రామిక విధానానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. అలాగే సరైన శాంతి భద్రతలు ఉన్నపుడే పారిశ్రామిక వేత్తలు పెట్టు బడులకు ముందుకు వస్తారని భావించి శాంతిభద్రతల నిర్వహణ కోసం రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2014– 20 మధ్య రూ. 33,820 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. గత 7 సంవత్సరాల వ్యవధిలో రూ. 1,01,976 కోట్లు విద్యా రంగంపై వెచ్చించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం విస్తృతంగా గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలు సైతం ప్రారంభించింది. 

తెలంగాణ ఆవిర్భావానికి ముందు చాలా తక్కువ మొత్తంలో పెన్షన్లు ఇచ్చేవారు. కానీ వాటిని ఊహించని పరి మాణంలో పెంచారు. ప్రస్తుతం 13,45,348 వృద్ధాప్య పింఛన్లు, 4,76,864 దివ్యాంగ పెన్షన్లు, 13,91,041 వితంతు, 35,527 నేత కార్మిక, 59,920 గీత కార్మిక, 4,07,757 బీడీ కార్మిక, 1,19,640 ఒంటరి మహిళ, 43, 504  దీర్ఘకాలిక వ్యాధి పెన్షన్లు పొందుతున్నారు. నిరుపేద ఆడపిల్లలకు వివాహం జరపడానికి ఆర్థిక సాయం చేసే పథకం ఎంతో ఉపయోగ పడుతోంది. అలాగే ఉద్యోగుల జీతాలు పెంచడం, ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులు, ఆశావర్కర్లు వంటివారి జీవితాల్లో జీతాలు పెంచడం ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం వెలుగులు నింపింది.

 దళితుల అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం గత ఏడేళ్ళ  కాలంలో దాదాపు 1,20,000 కోట్లు కేటాయించింది. దళిత విద్యార్థుల కోసం 2014లో 1గా ఉన్న గురుకులాల సంఖ్యను రెట్టింపు చేశారు. టీ ప్రైడ్‌ ద్వారా దళిత పారిశ్రామికవేత్తలకు 35 నుండి 40 శాతం సబ్సిడీలు అందిస్తున్నారు.

షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి పట్ల ప్రభుత్వం అధికాసక్తిని కనబరచింది. గత ఎనిమిది సంవత్సరాలలో రూ. 68,157 కోట్లు కేవలం షెడ్యూల్‌ తెగల అభివృద్ధికి కేటాయించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం 2020–21లో రూ. 5,522 కోట్లు కేటాయించారు. 2014–15 నుండి 2021–22  వరకు గ్రామీణ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో రూ. 56 వేల కోట్లకు పైగా కేటాయింపులు జరిగాయి. చైనా తరహా ఆర్థిక ప్రగతికి బాటలు వేసేలా కులవృత్తులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
ఇంతటి అద్భుతమైన అభివృద్ధి నమూనాతో... సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన అనే లక్ష్యాలను ఏడు సంవత్స రాల్లోనే చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. 

వ్యాసకర్త: ప్రొ. తాటికొండ రమేష్‌
కాకతీయ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement