ప్రశ్నపత్రాల లీకులను నిరోధించడానికి కఠినమైన చర్యలు తాత్కాలికంగా అవసరమే కావొచ్చు. కానీ ఈ సమస్యకు నిజమైన పరిష్కారం, పరీక్షల వ్యవస్థలోనే సంస్కరణ జరగడం! ఇప్పుడు జరుగుతున్న పరీక్షల్లో గుర్తుపెట్టుకోవడమే ప్రధానం. ఇదే లీకులకు, కాపీలకు కారణమవుతోంది. దీన్ని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో ముఖ్యమైనవి: కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించడం, జ్ఞాపకశక్తిని పరీక్షించడం కాకుండా అవగాహనతో కూడిన సమాధానాలిచ్చే ప్రశ్నలను ఎక్కువగా ఇవ్వడం. కంప్యూటర్లను అందించడంలో మౌలిక వసతుల ఖర్చు పెరుగుతుంది. కానీ ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా, భద్రత అంశాల్లో ఖర్చులు తగ్గుతాయి. పైగా లీకుల వల్ల ఉత్పన్నమయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది.
ప్రతి పరీక్షా సీజన్ కూడా ప్రశ్నపత్రాల లీకులు, కాపీయింగులు, అవి జరగకుండా భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామనే హామీలకు సంబంధించిన వార్తలను ప్రవాహంలా మోసుకొస్తుంది. ఆ ప్రమాణాల ప్రకారం చూసినా కూడా గత కొన్ని నెలల్లో తలెత్తిన వరుస వివాదాలు ఎంతో చెరుపుచేశాయి.
గత నెలలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం, రాష్ట్ర నియామక పరీక్షల్లో ఎవరైనా మోసానికి పాల్పడుతూ పట్టుబడితే కనీసం 10 సంవత్సరాల జైలుశిక్ష విధించేలా చట్టాన్ని చేసింది. కొన్ని రోజుల తర్వాత, ప్రశ్న పత్రాల లీకులను నిరోధించడానికి గుజరాత్ శాసనసభ ఏకగ్రీవంగా ఒక బిల్లును ఆమోదించింది. దోషులుగా రుజువైన వారికి పదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానాను ఈ బిల్లులో ప్రతిపాదించారు. అదే రోజు, రాజస్థాన్ ఉపాధ్యాయుల అర్హతా పరీక్ష పత్రాలు పరీక్ష తొలి రోజునే లీక్ అయ్యాయి.
అవి వ్యాప్తి చెందకుండా వెంటనే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఇక, గత వారంలోనే అస్సాంలో 10వ తరగతి ప్రశ్నపత్రాలు మళ్లీ మళ్లీ లీక్ అవుతుండటం రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రశ్నపత్రాల లీకులను నిరోధించడానికి కఠినమైన, దండనాత్మక చర్యలు తాత్కాలికంగా అవసరమే కావొచ్చు. కానీ ఈ సమస్యకు నిజమైన పరిష్కారం ఏమిటంటే, మన పరీక్షల వ్యవస్థలోనే సంస్కరణ జరగడం! ఇది కాపీలను, లీకులను తగ్గించ డమే కాదు, రానున్న సంవత్సరాల్లో అభ్యర్థులకు అవసరమైన సము చిత నైపుణ్యాలను పరీక్షించేలా ఉపకరిస్తుంది.
1970ల నుండి జాబ్ మార్కెట్ అవసరాలను పరిశీలిస్తే – సాధా రణ అభిజ్ఞా నైపుణ్యాలు, శారీరక నైపుణ్యాలను పణంగా పెట్టి, రొటీనుకు తావులేని మానవ సహసంబంధాలు, విశ్లేషణాత్మక నిపు ణతలు అనేవి నాటకీయంగా పెరుగుతూ వచ్చాయని ఒక పరిశోధన చెబుతోంది. ఆఫీస్ సెక్రటరీ లేక స్టెనోగ్రాఫర్, మానవ బ్యాంక్ టెల్లర్ వంటి సాంప్రదాయికమైన పాత్రలు వాస్తవంగా అదృశ్యమైపోవడం దీనికి ఉదాహరణ. ఇవన్నీ పునరుక్త శారీరక లేక అభిజ్ఞాపరమైన నిపుణతలను ఆశిస్తాయి.
జాబ్ మార్కెట్లో ప్రవేశించేవారు అత్యున్నత నైపుణ్య స్థాయితో పోటీపడాల్సిన అవసరాన్ని కృత్రిమ మేధ (ఏఐ) ఉపకరణాల పెరుగుదల తప్పనిసరి చేసింది. ఈరోజు భారతీయ పరీక్షలు చాలావరకు సాధారణ అభిజ్ఞా నైపుణ్యాలను కొలవడం పైనే దృష్టి పెడుతున్నాయి. ఇదే లీకులకు, కాపీల వైపు మొగ్గుచూపే సమస్యలకు కారణమవుతోంది. దీన్ని పరిష్కరించడానికి స్వతంత్ర మైనవే అయినా, పరస్పర అనుసంధానిత నాలుగు చర్యలు తీసు కోవచ్చు.
మొదటిది, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అభ్యర్థులకు విభిన్నమైన ప్రశ్నపత్రాలు ఇవ్వ వచ్చు. మొత్తం ప్రశ్నల పూల్ చాలా పెద్దదిగా ఉండటం వల్ల లీకుల సమస్య తగ్గిపోతుంది. కాపీ చేయడం కష్టతరమైపోతుంది. వీటి ముద్రణ, రవాణా ప్రక్రియలు గణనీయంగా తగ్గిపోతాయి లేదా దాదాపుగా లేకుండా పోతాయి. పైగా, విభిన్న ప్రశ్నపత్రాలు ఉన్నప్పటికీ ఆధునిక గణాంక టెక్నిక్కులు అభ్యర్థుల తులనాత్మక పనితీరును అత్యంత కచ్చితంగా, వాస్తవంగా తక్షణం కొలవడానికి ఉపకరిస్తాయి.
అలాంటి పరీక్షలు అత్యున్నత నైపుణ్యాలను పరీక్షించే నిర్దిష్ట కర్తవ్యాలను కూడా అభ్యర్థులకు ఇవ్వగలుగుతాయి. పైగా కంప్యూ టర్‌తోనే దిద్దించవచ్చు (ఉదాహరణకు, గ్రాఫ్ లేదా మ్యాపుపై పాయింటును గుర్తించడం, ఒక ప్యాసేజీలోని పదాన్ని మార్చడం). ఇప్పటికే అతి పెద్ద, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతీయ పరీక్షలను చాలావరకు కంప్యూటర్లలో నిర్వహిస్తున్నారని గుర్తుంచుకోవాలి. పరీక్షలు జరపడం కోసం కంప్యూటర్లను అందించడంలో మౌలిక వసతుల ఖర్చు పెరుగుతుంది. కానీ ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా, భద్రత అంశాల్లో ఖర్చులు తగ్గుతాయి. లీకుల వల్ల ఉత్పన్నమయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. (ఇది అనివార్యంగానే పునఃపరీక్షలకు దారితీస్తుంది).
రెండు, ఓపెన్ బుక్ పరీక్షలను మరింతగా పెంచడం. ఈ విధానం పరీక్షా హాల్‌లోకి నిర్దిష్ట సామగ్రిని తీసుకెళ్లడానికి అభ్యర్థులను అనుమ తిస్తుంది. ఇవి వాస్తవాలతోపాటు ప్రాథమిక ఫార్ములాలను కలిగి ఉన్న బుక్‌లెట్ల లాంటివి కావొచ్చు. సులభంగా కాపీ చేసే సమస్య దీంతో తొలగిపోతుంది. దీనివల్ల అభ్యర్థులు తమ జ్ఞానాన్ని వాస్తవ జీవి తానికీ, మరింత పెద్ద సమస్యలకూ వర్తింపజేసుకోగలుగుతారు.
మూడు, కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించడం కాకుండా అవగా హనతో కూడిన సమాధానాలు అవసరమైన ప్రశ్నలను ఎక్కువగా ఇవ్వడం. ఒకవేళ కంప్యూటర్లు లేక ఓపెన్ బుక్ పరీక్షలను ఉపయోగించనప్పటికీ, కేవలం గుర్తు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా అర్థం చేసుకుని, అన్వయించడంపై ఆధారపడిన నైపుణ్యాల కోసం అభ్య ర్థులను పరీక్షించాలి. ఇప్పుడు జరుగుతున్న పరీక్షల్లో గుర్తు పెట్టు కోవడమే ప్రధాన అవసరంగా ఉంటోంది. ఈ విధంగా ప్రశ్న లను మెరుగుపర్చినప్పుడు, సమాధానాలు ఇవ్వడం అనేది ఎప్పుడూ యాంత్రికంగా ఉండదు (ఈ విధానంలో కూడా ప్రశ్నలు ఆబ్జెక్టివ్ లేదా మల్టిపుల్ ఛాయిస్‌గానే ఉండవచ్చు).
ఇలాంటి అనేక ప్రశ్నలు ఒక అపరిచిత నేపథ్యం నుంచి ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు వాటి సందర్భాన్ని అర్థం చేసుకుని ఆ తర్వాతే ప్రశ్నకు సమాధానం ఇవ్వ వలసి ఉంటుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా అత్యుత్తమ పరీక్షలు ఇప్పటికే ఇలా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలను గూగుల్ చేయలేము. పైగా, జీపీటీ–4 వంటి విధానంలో కూడా సులువుగా వీటికి సమాధానాలు కనుగొనలేమని గుర్తించారు (కాకపోతే నెమ్మ దిగా అదీ సాధ్యమవుతోంది).
నాలుగు, పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడం. సులువుగా పరీక్షా ప్రక్రియను మెరుగుపర్చడానికి ఉన్న అవకాశం, పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాల గురించి దేశ, రాష్ట్రాల స్థాయుల్లో ప్రజావగాహన ప్రచారాలు నిర్వహించాలి. అభ్యర్థులు లేక వారి కుటుంబ సభ్యులు తరచుగా పరీక్షల సంస్కరణలను వ్యతి రేకిస్తుంటారు. ఎందుకంటే పరీక్షల్లో మార్పు చేస్తే తమకు తెలియని పద్ధతిని ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడతారు. నష్టం కలుగుతుందని భావిస్తారు.
ఈ కొత్త పరీక్షల గురించిన ప్రచారం అవెందుకు మెరుగో వివరిస్తుంది. సాపేక్ష గ్రేడింగ్, పర్సెంటైల్స్ వంటి భావనలను కూడా సరిగ్గా వివరించలేకపోతే వ్యతిరేకత మూటగట్టుకుంటాయి. కొన్నిసార్లు కోర్టుల్లో కూడా వీటికి వ్యతిరేకత వ్యక్తం కావొచ్చు.
చివరగా, పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే కాకుండా, ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో కూడా మంచి స్కోర్ సాధించేలా అభ్యర్థులకు ఈ ప్రచారాలు టిప్స్ అందిస్తాయి. ఇలాంటి ప్రచారాలు జరగకపోతే, అభ్యర్థులు జరిగే మార్పుల గురించి తెలుసుకోలేరు. ట్యూషన్, కోచింగ్ క్లాసుల నుంచి అందే వాస్తవాలే వీరికి ప్రామాణికం అవుతాయి. ఇవి దాదాపుగా యథాతథ స్థితినే నిలిపి ఉంచుతాయి.
నియామకాల కోసం గానీ లేక అకెడమిక్ కోర్సుల కోసం గానీ నిర్వహించే పరీక్షల నాణ్యత అనేదే మానవ పెట్టుబడి నాణ్యతను నిర్దేశిస్తుందని చాలా దేశాలు గుర్తించాయి. అందుకే మనం దీనికి గొప్ప ప్రాముఖ్యతను ఇవ్వడానికి ఇదే మంచి తరుణం. కాపీలు, లీకులు అనేవి కునారిల్లుతున్న వ్యవస్థ తాలూకు లక్షణాలను విస్తృతంగా ప్రదర్శిస్తుండటాన్ని మనం చూశాము. అందుకే ఈ రంగంలో మార్పు తప్పనిసరి.
శ్రీధర్ రాజగోపాలన్
వ్యాసకర్త సహ–వ్యవస్థాపకుడు, ‘ఎడ్యుకేషనల్ ఇనీషియేటివ్స్’
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment