దేశంలో సకల పీడనలకు గురై, పేదరికంతో మగ్గుచున్న బడుగులకు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే విముక్తి కల్పిస్తే, అణగారిన వర్గాల ఆర్థిక పురోభివృద్దికి బాటలు వేసిన గొప్ప నేత వైఎస్ జగన్. బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు వాటి చైర్మన్ల నియామకం గురించిన ప్రకటనపై ఏపీ ప్రజలు నీరాజనాలుపడుతున్నారు. ఈ చర్యతో వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాధికారం అనివార్యమని చెప్పినట్లయింది.
వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 56 బీసీ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో బీసీ జాతికి ఒక చరిత్రాత్మక విజయంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దీన్ని రాజ్యాధికారం దిశగా బీసీలు వేస్తున్న తొలి అడుగులుగా భావిస్తున్నారు. ప్రతి కార్పొరేషన్లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా చైర్మన్, డైరెక్టర్ల పదవుల్లో ఆయా కులాల ప్రాతినిధ్యానికి అవకాశం కల్పిస్తూ, బీసీ, కార్పొరేషన్‌లో కూడా 50 శాతం మహిళలకు డైరెక్టర్లుగా.. చైర్మన్‌గా అవకాశం కల్పిస్తూ మహాత్మా జ్యోతిరావ్ పూలే, సావిత్రీబాయి ఆలోచనలను సాకారం చేసిన వైఎస్ జగన్ నిర్ణయాన్ని ఏపీలోని బీసీ కుల సంఘాలు స్వాగతించి బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆయన తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని బీసీలు ఎన్నటికీ మర్చిపోలేరు. విద్య, ఉద్యోగాలకు దూరమైన ప్రజలను చైతన్యపరిచే దిశగా చర్యలు చేపట్టిన వైఎస్ జగన్ దానికి బీసీ కార్పొరేషన్లతో శ్రీకారం చుట్టి, చరిత్ర పుటల్లో్ల నిలిచి నారని విద్యావంతులు, మేధావులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.
కాగా 2019, ఫిబ్రవరిలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ వెనుకబడిన కులాలకు పెద్దపీట వేసినారు అనడంలో అతిశయోక్తి లేదు. బడుగుల స్థితిగతులను అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో వారికి కావాల్సినటువంటి అవసరాలు గుర్తించి, ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే అంశాలను తెలుసుకుని, సమాజంలో గౌరవం లేనటువంటి జీవితాలను బాగుచేయాలన్న ఉద్దేశంతో తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బీసీ, కార్పొరేషన్‌లు ప్రతి కులానికి ఏర్పాటు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానం చేసిన సంగతి విదితమే.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అట్టడుగు వర్గాల్లో 30 వేలకు పైగా జనాభా ఉన్న ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిర్ణయం వైఎస్ జగన్ ఎట్టకేలకు తీసుకోవడంతో బడుగు, బలహీన వర్గాల, ఆయా జాతుల, కులాల సంతోషానికి అవధుల్లేవు. ఈ నిర్ణయం వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రోజు వెనుకబడిన కులాల జీవితాల్లో వెలుగు నింపిన రోజుగా నిలిచిపోతుంది. తరతరాలుగా మారని బీసీ కులాల తలరాతను, బీసీలు పడ్డ కష్టాలను అర్థం చేసుకుని, 70 ఏళ్లుగా అట్టడుగు వర్గాల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరూ లేని నేపథ్యంలో.. బీసీ కార్పొరేషన్లపై వైఎస్ జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ద్వారా ఆయా కులాల ఆర్థిక పురోభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. నిజంగానే ఇది చరిత్రలో మరిచిపోలేని ఒక చారిత్రక నిర్ణయమనీ, బడుగులకు దీనివల్ల విముక్తి కలుగుతుందని మేధావులు భావిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి అణగారిన వర్గాలకు ఉన్నత విద్య దూరమవుతుందని గ్రహించి, అందరికీ ఉన్నతవిద్య చదివే అవకాశం కల్పించడంలో భాగంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల ట్యూషన్ ఫీజును తిరిగి చెల్లించేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకం కారణంగా రాష్ట్ర ఖజానాపై అపారమైన భారం పడ్డప్పటికీ ఆయన లెక్కచేయలేదు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ కోర్సులతో సహా ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న వెనుకబడిన తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు 2008లో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి, బడుగుల ఆరాధ్యదైవంగా మిగిలారాయన. ఇప్పటికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన పెట్టిన పథకం తమ పిల్లలకు కలిగించిన మేలు అంతా ఇంతా కాదని కృతజ్ఞతలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటిలో వైఎస్‌ఆర్ గుర్తులు ఇప్పటికీ మిగిలే ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా ఆయన వారసత్వంలోనే నడుస్తూ నేడు వైఎస్ జగన్ బడుగులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఏపీలోని బడుగు ప్రజలకు శుభపరిణామం. దేశంలో ఏ నేతకూడా చేపట్టని విధంగా వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం బడుగుల ఆర్థిక పురోభివృద్ధికి ఎంతో మేలు చేకూరుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
డా. సంగని మల్లేశ్వర్
వ్యాసకర్త జర్నలిజం విభాగాధిపతి,
కాకతీయ విశ్వవిద్యాలయం ‘ మొబైల్: 98662 55355
Comments
Please login to add a commentAdd a comment