కేంద్ర పభుత్వ పెద్దలకు వాగ్దానాలు చేయడం తప్ప వాటిని నిలుపుకోవడం తెలియదని గత ఏడేళ్లుగా వారి పాలన చూస్తే అర్థమవుతుంది. 2016, ఫిబ్రవరి 28న దేశ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా ఒక రోజు ముందు దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తాం అని ప్రధానమంత్రి ప్రకటించారు. కానీ రైతుల ఆదాయం ఏమాత్రం పెరగలేదు. ఎరువులపై సబ్సిడీని ఎత్తివేసి వాటి ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది కేంద్రం. ఇలా కేంద్రం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నా తెలంగాణ ప్రభుత్వం... సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ... ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, మద్దతు ధరను రైతులకు అందిస్తూ సరైన దార్శనికతతో ముందుకు సాగుతోంది.
అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక సాగుభూమి కలిగి ఉన్నది భారతదేశం. కానీ వ్యవసాయ ఉత్పత్తులలో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. 60 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధార పడి ఉన్న దేశం మనది. ముందుచూపు ఉన్న ఏ పాలకుడైనా దేశంలో వ్యవసాయరంగ బలోపేతానికి కృషి చేస్తారు. కానీ మన పాలకులకు ఆ స్పృహ లోపించిందని భావించడంలో తప్పులేదు. అందుకే ఈ దేశ రైతాంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశపాలకులు వ్యవసాయానికి ప్రోత్సాహం అందించకపోగా ఆ దిశగా కృషిచేస్తున్న రాష్ట్రాలకు వెన్నుదన్నుగా కూడా నిలవడం లేదు.
కేంద్ర సహాయ నిరాకరణను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి, గోదావరి నది మీద ప్రపంచంలోనే ఎత్తయిన ఎత్తిపోతల పథకం– కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేసి సాగునీరు అందుబాటు లోకి తెచ్చింది. 45 లక్షల ఎకరాలకు సాగునీటికి ఢోకా లేకుండా చేసింది. కృష్ణా నది మీద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం. 70 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా లలో 12 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందనుంది. కేంద్రం నుంచి నిధులు అందకపోయినా... తెలంగాణ ప్రభుత్వమే సొంత నిధులతో ప్రాజెక్టులను నిర్మించుకుంటున్నది.
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలోనే కాదు... అసలు కేంద్ర ప్రభు త్వానికి ఏ విషయంలోనూ ఒక స్పష్టమైన జాతీయ విధానం లేదని పిస్తుంది. 2016, ఫిబ్రవరి 28న దేశ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా ఒక రోజు ముందు దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతుల ఆదాయం రెట్టింపునకు ఎలాంటి విధా నాలను అనుసరించాలి, సాగు విషయంలో, పంటల కొనుగోళ్ల విష యంలో ఎలాంటి ప్రోత్సాహకాలు అందివ్వాలి, వ్యవసాయ పరిక రాలు, యంత్రాలకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వాలి లాంటి వాటిపై కేంద్రా నికి కార్యాచరణ లేదు. రైతుల ఆదాయం రెట్టింపునకు సంబంధించి 2018 సెప్టెంబరులో ‘డబులింగ్ ఫార్మర్స్ ఇన్‌కం కమిటీ’ (డీఎఫ్‌ఐసీ) నివేదిక ఇస్తుందని ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత డీఎఫ్‌ఐసీ రిపోర్టు ఇచ్చింది. దానిని యథావిధిగా పట్టించుకోకుండా పక్కనబెట్టారు. 2020లో ఇదే కమిటీ గ్రామీణ రైతుల ఆదాయాన్ని పరిశీలించి 2014లో రైతుల ఆదాయం ఏడాదికి రూ.70 వేలు ఉందని, 2020 నాటికి అది స్వల్పంగా తగ్గిందనీ, ద్రవ్యోల్బణం పెరిగిన మాదిరిగా రైతుల ఆదాయం పెరగలేదనీ నివేదిక ఇచ్చింది. వ్యవసాయ గ్రాస్ వ్యాల్యూ అడిషన్ యూపీఏ ప్రభుత్వంలో 4.6 శాతం ఉంటే, మోదీ ప్రభుత్వంలో అది ఎన్నడూ 3.3 శాతానికి మించలేదు. కేంద్రం చెప్పిన డబులింగ్ ఫార్మర్స్ ఇన్‌కం లెక్కల ప్రకారం 2016 నుంచి ఏడాదికి 14 శాతం చొప్పున రైతుల ఆదాయం పెరిగితే తప్ప రైతుల ఆదాయం రెట్టింపు అవ్వదు. కానీ ఎన్నడూ 3.3 శాతానికి మించకపోవడం గమ నార్హం. ఆయా రాష్ట్రాలలో వివిధ పంటల సాగుకు ఆయా ప్రాంతాన్ని బట్టి సాగు ఖర్చులు ఉంటాయి. కానీ దేశం మొత్తం అన్ని పంటలకూ ఒకే రకమైన మద్దతు ధర ఇవ్వడం అశాస్త్రీయమే.
ఇదే కమిటీ లెక్కల ప్రకారం 2002లో రైతులకు వచ్చిన ఆదాయం, 2022లో రైతులకు వస్తున్న ఆదాయం ద్రవ్యోల్బణం ప్రకారం చూస్తే సమానంగా ఉంది. దీన్నిబట్టి కేంద్రం రైతుల ఆదాయం రెట్టింపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలి పోతున్నది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలో విఫలమైన కేంద్రం హడావిడిగా నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చి మద్దతు ధరకు మంగళం పాడి, రైతు ఎక్కడయినా పంటలు అమ్ముకోవచ్చు అని ప్రకటించి, మార్కెట్ యార్డులను ఎత్తేసి, అసలు రైతులు ఎవరికీ మొరపెట్టుకునే పరిస్థితి లేకుండా చేయాలని ప్రయత్నించింది. రైతులు సంఘటితంగా 15 నెలల పాటు చారిత్రాత్మక ఆందోళనలు చేయడంతో తిరిగి నల్లచట్టాలను రద్దు చేసుకున్నారు. సాక్షాత్తు ప్రధాని దేశ రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పి వేడుకున్నారు.
ఎరువులు, బీమా సౌకర్యం...
ఎరువుల తయారీకి అవసరమైన ముడిపదార్థాలు దిగుమతి చేసు కుంటున్నది భారత్. దిగుమతి సుంకం భారం రైతుల మీద వేయ డంతో పాటు ఎరువులపై సబ్సిడీ ఎత్తేసి రైతుల నడ్డి విరుస్తున్నది. గత ఏడేళ్లలో ఎరువుల ధరలు విపరీతంగా పెంచింది. 28:28:0 ఎరువు ధర రూ. 1,275 నుండి రూ. 1,900, ఎంఓపి (పొటాష్) రూ. 850 నుండి రూ.1,700కి పెరగగా... 14.35.14 ఎరువు ఏకంగా రూ.1,000 పెరిగి రూ. 2,000కి చేరింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం స్పందిం చడం లేదు. దీంతో రైతులకు కూలీల కొరత కొనసాగుతూనే ఉంది.
రైట్ ఫర్ ఫుడ్ అనే ప్రాథమిక హక్కును కేంద్రం ఎఫ్‌సీఐ చేతిలో పెట్టింది. దశాబ్దాలుగా కేంద్రం ఆధీనంలోని ఎఫ్‌సీఐ దేశవ్యాప్తంగా పంటలను సేకరిస్తూ ఉంది. కానీ మోదీ హయాంలో ఎఫ్‌సీఐ నిర్వీ ర్యమవుతోంది. అది ధాన్యం సేకరణ బాధ్యతను రాష్ట్రాలపైకి నెడు తోంది. రాష్ట్రాలు కొన్న తర్వాత తీరికగా ఆ సంస్థ వాటిదగ్గర కొనుగోలు చేస్తోంది. దేశంలో 51 రకాల పంటలు పండుతుండగా కేవలం 23 రకాల పంటలకే కేంద్రం మద్దతుధర ప్రకటిస్తుంది. ప్రకటించిన ధరలకు మొత్తం కొనుగోళ్లు ఉండవు.
దిగుబడులు పెంచేందుకు నిరంతరం నూతన వంగడాలను సృష్టించి రైతులకు అందించాలి. ఇది కేంద్ర ప్రభుత్వ (ఐసీఏఆర్) విధి. కానీ కేంద్రం నూతన వంగడాల సృష్టికి కృషి చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీమా విషయంలోనూ అంతే. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధాన ఉద్దేశం పంటల నష్టాలు తలెత్తితే బీమా ద్వారా ఆర్థిక చేయూత అందించడం. ఈ పథకంలో రైతులు చెల్లించే ప్రీమియం ఎక్కువ. రైతులకు దక్కేది తక్కువ. రైతు కేంద్రంగా బీమా వర్తించదు. ఒక ప్రాంతం మొత్తంలో వేసిన పంటలో కనీసం 40% పైగా దెబ్బతిని ఉండాలి. అందుకే మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, బెంగాల్, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు ఈ పథకం నుంచి వైదొలగాయి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ పథకం అమలులో లేదు. కేంద్ర ప్రభుత్వ నూతన ప్రతిపాదిత కరెంట్ చట్టాలతో ఈ పథకం అమ లుకు ఇబ్బందులు ఏర్పడతాయి. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని, సబ్సిడీలు ఎత్తేయాలని ఇందులో పేర్కొన్నారు.
ఈ విధంగా సాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మద్దతుధర, మార్కెటింగ్ వసతులు... ఏ విషయంలోనూ రైతు, వ్యవసాయ అనుకూల నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. పైగా కేంద్ర అసంబద్ధ విధానాలు, నిర్ణ యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందువల్ల రైతులు వ్యవసాయం చేయటం దుర్లభంగా మారుతున్నది. పెట్టుబడులు గణ నీయంగా పెరిగిపోవడం, ఆదాయం ఆ మేరకు పెరగకపోవటం మూలంగా సాగు ఏ మాత్రం లాభసాటి కానిదిగా భావిస్తున్నారు రైతులు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కేంద్రం పాత్ర ఏ మాత్రం లేక పోయినా కేసీఆర్ ఒక దార్శనిక దృష్టితో సాగును లాభసాటి చేసేం దుకు 24 గంటల ఉచిత విద్యుత్, ఉచిత సాగు నీరు, ఎదురు పెట్టు బడి (రైతుబంధు) నియంత్రణతో ఎరువులు–విత్తనాల సరఫరా చేస్తూ అన్నదాతల ఆత్మస్థైర్యం పెంచుతున్నారు. ఇదే సమయంలో కేంద్రం రైతాంగ సాగు వ్యతిరేక విధానాలు దేశాన్ని ‘అన్నమో రామ చంద్రా’ అనేలా చేస్తాయేమో అనే ఆందోళన సర్వత్రా కన్పిస్తున్నది.
వ్యాసకర్త: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు, తెలంగాణ
విజన్ కావాలి విజన్!
Published Wed, Jan 19 2022 12:39 AM | Last Updated on Wed, Jan 19 2022 12:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment