అతడో...మాటల మంత్రశాల | Suddala Ashok Teja Article On SP Balasubrahmanyam | Sakshi
Sakshi News home page

అతడో...మాటల మంత్రశాల

Published Sun, Sep 27 2020 1:18 AM | Last Updated on Sun, Sep 27 2020 1:18 AM

Suddala Ashok Teja Article On SP Balasubrahmanyam - Sakshi

పాటల నెలరేడు, పాటల చెలికాడు, పాటల విలుకాడు.. అసలు పాటల ‘కల’వాడు బాలుగారు.
నిజానికి నిజమైన బాలుగారి జీవితం ఇప్పుడు ప్రారంభమైంది. భౌతిక రూపం అదృశ్యమై జ్ఞాపక రూపం దృశ్యమానమవడం మొదలైంది. బాలూ సర్‌ లైఫ్‌ స్టార్టెడ్‌ నౌ...
బాలుగారి గానం విశ్వలీనమై విశ్వగానం మారింది.
పాట ప్రేమికులారా వినపడుతుందా. కళ్లు తెరిస్తే బాలు విషాద అంతిమయాత్ర దృశ్యం. కళ్లు మూసుకుంటే బాలు విశ్వగానాలాపనా దృశ్యం. కారణజన్ముల మరణమంటే కళ్లముందు దీర్ఘ శయ్యపై పడుకోవడం కాదు. గుండె గుండెలో మేల్కోవడం...
మరణ భవంతిలోకి పోవడంకాదు. జ్ఞాపకాల జనన స్రవంతిలోకి రావడం కదా మరణమంటే..
బాధోంకి బర్‌సాతే కాదూ
యాదోంకి బారాత్‌ కూడా..
ఒక్కసారే కోట్ల హృదయాల్లో మేల్కోవడం ఒక్కడికి సాధ్యమవుతుందా. హంస ఎగిరిపోయాక కూడా ఈ ఒక్కడికే సాధ్యమైంది. డెబ్బె నాలుగేళ్ల జీవన మధురిమలో యాభై నాలుగేళ్ల సరిగమ. యాభై నాలుగేళ్ల పరిశ్రమంలో యాభై ఆరక్షరాల పరాక్రమం.
ఒకేరోజు 21 కన్నడ పాటల రికార్డింగ్, 19 తమిళ పాటలు మరో రోజు హిందీలో 16 పాటలు పాడటం గాయకమాత్రులకు సాధ్యమా. గంధర్వ గాత్రుడికది సుసాధ్యమైంది. సులభసాధ్యమైంది. తొలి తొలి తొలకరి రోజుల్లోనే మహానటుడు, మహా నాయకుడు ఎంజీఆర్‌ బాలుగారితో పాడించటానికి మూడువారాలు నిరీక్షించడం జరుగుతుందా? జరిగి తీరింది బాలు గంధర్వుడికి. అది ఎంజీఆర్‌ సహృదయమైనా బాలుగారికి సాక్షాత్‌ సరస్వతీ ఆశీర్వాదం కదా.
మహర్జాతకుడు. కఠోరదీక్షాపరుడు. సమయ నిబద్ధుడు, అనన్యసామాన్య ప్రతిభావం తుడు బాలు. ఆయనకే చెల్లింది. తన పూజా మందిరంలో తన పాటే ప్రార్ధన కావడం. తన అంతిమయాత్రలో తనను తనపాటే సాగనంపడం ఎవరికి జరిగింది? ఏ గుడికెళ్లినా తన పాటే నివాళిగా ఉంది.
దాదాపు 11 భాషల్లో 37 వేల పైగా పాటలు పాడటం మధుర గేయాలు పాడేవేళ పాటల నెలరేడు, పాటల చెలికాడు.. రుధిర గేయాలు పాడేవేళ పాటల విలుకాడు. అగ్ని కురిపించినా.. అమృతం ఒలికించినా అశ్రుధార వర్షించినా ఆ శ్వేత మేఘం బాలు కంఠం. ‘చూడు పిన్నమ్మా’ అన్న గొంతు వేయి గొంతుకల విప్లవ శంఖమైంది. విశాల గగనంలో చంద మామ అన్న గళం అగ్నినేత్ర మహోగ్ర జ్వాలా నిగళమై నాకు జాతీయ పురస్కార మందించింది.
పాటల విశ్వరూపమతడే. మాటల విశ్వవిద్యా లయమ తడే. పాట గురించి చెబుతున్నపుడు పాటల పాఠశాల అతడే. మాటల మానవ సంబంధాల గురించి చెబుతున్నపుడు మాటల మంత్రశాల అతడే... అమృతం ఆయన స్వరభాష. వినమృతం ఆయన శరీర భాష. కృతజ్ఞత ఆయన జీవన పర్యంత భాష. శబరిమలకు వెళ్లినప్పుడు తనను డోలీలో మోసుకెళ్లిన కూలీలకు పాదాభివందనం చేయడం. సభ జరిపే వారికి ‘నా పేరుకు ముందు డాక్టర్‌–పద్మ భూషణ్‌ గానగంధర్వ ఇలా విశేషణాలు పెట్టొద్దని లేఖ రాయడం.
నేనోసారి పాడుతా తీయగాలో ఒక పక్షి జీవిత కాలంలో ఎప్పుడూ నేలపై కాలూనదు. అందుకే ఆ పక్షిని భారతీయ ధ్వజంగా భావించి భరద్వాజ పక్షి అంటా రని చెబితే చేతులు జోడించి ‘నిజంగా ఈ విషయం నాకు తెలియదు తేజాగారూ’ అనడం. ఏ కృతజ్ఞత, వినమ్రతా విభాగం లోకి వస్తుందో.. బాలుగారిని అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాను. వీలు కాలేదు. ఇప్పుడు అసలు వీలు కాదుగా. ఎన్నో నేర్చుకున్నాం తన నుండి. తెలుగు భాష– తెలుగు శ్వాస– తెలుగుపై ఆశ.
తన ‘పాడుతా తీయగా’ పాఠశాల (పాటశాల)లో ఎన్ని కొత్త గొంతుకలు ప్రాణం పోసుకున్నాయి. పాఠాలు నేర్చు కున్నాయి. ఇంతవరకు ఏ గాయకుడిలా ‘ఆచార్య’ పాత్ర పోషించాడు. ఏ మైకెల్‌జాక్సన్, ఏ మహ్మద్‌రఫీలు చేయగలిగారు. 
‘పాడుతా తీయగా’ తరతరాలకు చెరిగిపోని స్వర విశ్వవిద్యాలయంగా సుస్థిరం చేసి వెళ్లిపోయాడు. ఎక్కడికెళ్లాడు. తెలుగుభాషా భారతి ‘కంఠాభరణం’గా యాభైనాలుగు సంవత్సరాలు మెరసి ఇపుడు స్వర్గలోక భారతీ ముంజేతి కంకణంగా మారడానికి వెళ్లిపోయాడు.
అక్కడ గంధర్వ బాలబాలికలకు సినారేను ముఖ్య అతిథిగా కూచోబెట్టి తెలుగు పాట నేర్పించడానికి ‘పాడుతా తెలుగు పాట తీయగా’ కార్యక్రమ నిర్వహణకు వెళ్లాడు. నారద తుంబురులకు కనువిందుగా వీనుల విందుగా అచ్చెరువుగా.. అల్విదా బాలుగారు. అక్కడ నిరంతరం మీ గాన అధ్యాపనం సాగించండి. ‘ఏ కరోనా’ ఢరోనాలు అక్కడ లేవు. ‘తెలుగు పాట గ్యారంటీ’...
వ్యాసకర్త: సుద్దాల అశోక్‌తేజ, ప్రముఖ సినీ గీత రచయిత, జాతీయ అవార్డు గ్రహీత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement