ఆర్థికంగా కోలుకోవాలంటే పర్యాటకం ఉరకలెత్తాలి | Tourism Must Flourish To Recover Financially Guest Column | Sakshi
Sakshi News home page

ఆర్థికంగా కోలుకోవాలంటే పర్యాటకం ఉరకలెత్తాలి

Published Sat, Jan 9 2021 12:41 AM | Last Updated on Sat, Jan 9 2021 12:43 AM

Tourism Must Flourish To Recover Financially Guest Column - Sakshi

దాదాపు 12 నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో పర్యా టకం అగ్రభాగంలో ఉంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు నిబంధనలు సరళీకృతం చేయ డంతోపాటు వివిధ విభాగాల తోడ్పాటు అవసరం. వరల్డ్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌ (డబ్ల్యూటీటీసీ) ప్రకారం పర్యాటక రంగం అంతర్జాతీయంగా 3,815 బిలియన్‌ డాలర్లు నష్ట పోయినట్లు అంచనా. పర్యాటక రంగాన్ని దీర్ఘకాలంగా వెంటిలేటర్‌పై ఉంచిన ఈ విపత్తు తొలగాలంటే మార్కె ట్‌లోకి విజయవంతంగా పరీక్షించిన పలు టీకాలు రావడమే ఏకైక మార్గం.

పలు దేశాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తోంది. మాల్దీవుల్లో 56.6 శాతం, థాయ్‌లాండ్‌లో 19.8 శాతం, మలేసియాలో 18.8 శాతం, ఆస్ట్రేలియాలో 10.8 శాతం, జపాన్‌లో 7 శాతం, భారత్‌లో 6.8 శాతం వరకు టూరిజంతో ఆదాయం వస్తోంది. అయితే, సంక్షోభాల కారణంగా పర్యాటకరంగం ఒడిదుడుకులకు గురికావడం చరిత్రలో ఇదే తొలిసారి కాదు. 2003లో సార్స్‌ కారణంగా అతలాకుతలమైన టూరిజం గాడిన పడేందుకు పదకొండు నెలలు పట్టింది. 2001లో అమెరికాలో జరిగిన 9/11 దాడుల అనంతరం పర్యాటకం దాదాపు పద్నాలుగు నెలల పాటు నేలచూపులు చూసింది. 2009లోనూ ఆర్థికమాంద్యం వల్ల ఊబిలోకి జారిన టూరిజం గట్టెక్కడానికి పంతొమ్మిది నెలలు పట్టింది. డబ్ల్యూటీటీసీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2020 సెప్టెంబర్‌ నాటికి 14.26 కోట్ల ఉద్యోగాలు పోయినట్లు అంచనా. ఈ ఏడాది చివరి నాటికి ఇది 19.7 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. వీరిలో 43 శాతం మంది పర్యాటక రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు. ఈ మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా ఆగ మనాలు (ఎరైవల్స్‌) 65 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడి స్తున్నాయి. 

కోవిడ్‌ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా టూరిజం విధానాల్లో సమూల మార్పులు రావాలని ‘దర్యా’(సౌదీ అరేబియా)లో జరిగిన జీ–20 పర్యాటక శాఖ మంత్రుల సమావేశం సూచించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు పర్యాటక పునరుజ్జీవం ఆవశ్యకమని ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రపంచవ్యాప్తంగా 220 దేశాలను పరిశీలించిన అనంతరం 167 దేశాలు సంక్షోభాన్ని అధిగమించేందుకు వేగంగా నిర్దిష్ట చర్యలు చేపట్టాయని ఐరాస అంతర్జాతీయ టూరిజం ఆర్గనైజేషన్‌ (యూఎన్‌ డబ్ల్యూటీవో) తెలిపింది.

పర్యాటక రంగం పునరుజ్జీవం కోసం ప్రభుత్వాలు, ఆర్థిక వ్యవస్థలు తమ విధానాలను సవరించడంతోపాటు ఉపశమన చర్యలు చేపట్టడం అవసరం. ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణ, ఉత్పత్తుల పరిశోధన దిశగా కార్య కలాపాలు సాగాలి. పలు దేశాలతో పాటు డిజిటల్‌ సంస్థలు, సేవా సంస్థలు వైద్య సదుపాయాలపై ప్రయాణికులకు విస్తృత అవగాహన కల్పించి విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశాయి. సామాజిక దూరాన్ని పాటించేలా యాప్‌ల వినియోగం, సాంకేతిక సేవలను అందుబాటులోకి తెచ్చాయి. 

కోవిడ్‌ కారణంగా కొన్ని దేశాలు తమ ద్రవ్య నిర్వహణ విధానాన్ని మార్చుకున్నాయి. 2020 మార్చిలో అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్‌ ఎయిడ్, రిలీఫ్, ఎకనామిక్‌ సెక్యూరిటీ చట్టం ద్వారా ప్రజారోగ్యం, సహాయ ప్యాకేజీ కింద 2.2 ట్రిలియన్‌ డాలర్లను కేటాయించింది. ఈ నిధిని దశలవారీగా పంపిణీ చేశారు. ఈ చట్టం అమెరికా కార్మికులు, కుటుంబాలు, చిన్న వ్యాపారులకు వేగంగా, నేరుగా సాయాన్ని అందచేయడం, ఉద్యోగ భద్రతకు తోడ్పడింది. వ్యాపార ఒడిదుడుకులు ఎదుర్కొన్న కంపెనీ లకు లక్ష యూరోల వరకు గ్రాంట్లు అందచేసేలా కరోనా వైరస్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఏర్పాటు చేసింది ఫిన్‌లాండ్‌. పర్యాటక రంగంలో ప్రయాణాలు, వసతుల కల్పనపై నూతన విధానాలు, సృజనాత్మక చర్యలు చేపట్టే సంస్థలకు నిధులు కేటాయించింది. పర్యాటక రంగం కోలుకునేందుకు 18 బిలియన్‌ యూరోలు కేటాయించేందుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఇక ఐస్‌ల్యాండ్‌ ప్రత్యేంగా 18 బిలియన్ల ఐస్‌లాండిక్‌ క్రోనాల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించింది. భారీ పర్యాటక కేంద్రాలు, జాతీయ పార్కుల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఎయిర్‌పోర్టుల టెర్మినళ్లను పొడిగించడంతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించారు. నౌకాశ్ర యాలు, రోడ్లను అభివృద్ధి చేశారు. పర్యాటక రంగంలో వచ్చే మూడేళ్లలో 3.4 బిలియన్‌ యూరోలను పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా సమీకరించేలా స్పెయిన్‌ పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక శాఖ ప్రణాళిక సమర్పించింది. స్పానిష్‌ రికవరీ విధానంలో భాగంగా దీన్ని సిద్ధం చేశారు. తమ దేశానికి వచ్చే పర్యాటకులు కోవిడ్‌ బారిన పడితే 3,000 డాలర్లు పరిహారంగా చెల్లిస్తామని ఉజ్బెకిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటిం చడం విశేషం. సైప్రస్‌ ప్రభుత్వం ఇంకా ముందుకెళ్లి, కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన పర్యాటకుల వసతి, భోజనం, మందుల ఖర్చును తామే భరిస్తామని ప్రకటించింది. విదేశీ పర్యాటకులు తిరిగి వెళ్లేందుకు విమాన ఖర్చులు మాత్రమే భరిస్తే చాలని పేర్కొంది. సహ ప్రయాణికుల ఖర్చును కూడా భరిస్తామని తెలిపింది.

ఇక మన దేశానికి వస్తే– కోవిడ్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాలపై ఆర్బీఐ నియమించిన నిపుణుల కమిటీ పేర్కొన్న ఆరు రంగాలలో ఆతిథ్యం, టూరిజం పరిశ్రమలున్నాయి. ఇబ్బందుల్లో ఉన్న సంస్థల పునర్ని ర్మాణం, యాజమాన్య మార్పిడి లాంటివి కమిటీ సిఫా రసుల్లో కీలకం. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా రూ.3 లక్షల కోట్ల వరకు కొల్లేటరల్‌ సెక్యూరిటీ లేకుండా రుణాలను ప్రకటించారు. 12 నెలల మారటోరియంతోపాటు నాలుగేళ్ల కాల పరిమితి విధించారు. భారత్‌ను సందర్శించే విదేశీ పర్యాటకులకు భరోసా కల్పించేలా డిజిటల్, టీవీల్లో పర్యాటక శాఖ విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించ నుంది. పర్యాటకుల భద్రత, ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాంతాలను అనుసంధానించే రోడ్డు సదుపాయాలపై ప్రచారం చేపట్టనుంది. స్థానిక భాషలు తెలిసిన వారికి పర్యాటకం ద్వారా ఉపాధి కల్పించేలా ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా టూరిస్ట్‌ ఫెసిలిటేటర్‌ సర్టిఫికెట్‌ కోర్సుల ద్వారా అవకాశం కల్పిస్తోంది. కోవిడ్‌ టీకా ఆవిష్కరణ ప్రయత్నాలు ఫలిస్తుండటంతో 2021లో పర్యాటక రంగం కోలుకుని గాడిన పడుతుందని పర్యాటక శాఖ ఆశాజనకంగా ఉంది.

-జి. కమల వర్ధన రావు 
వ్యాసకర్త ఐఏఎస్, చైర్మన్‌ అండ్‌ ఎండీ, ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement