నక్కకూ... నాకలోకానికీ! | Vaddadi Srinivas Opinion On Chandrababu Mahanadu | Sakshi
Sakshi News home page

నక్కకూ... నాకలోకానికీ!

Published Thu, Jun 2 2022 8:14 AM | Last Updated on Thu, Jun 2 2022 8:29 AM

Vaddadi Srinivas Opinion On Chandrababu Mahanadu - Sakshi

రాజకీయ నేతలు తాము అద్దాల మేడలో కూర్చున్నామనే వాస్తవాన్ని సదా గుర్తుంచుకుని మరీ రాజకీయాలు చేయాలి. ఎదుటివారి మీద తాము ఒక రాయి వేయాలని చూస్తే... అంతకు పదింతల రాళ్లు తమ అద్దాల మేడపై పడతాయి. మొన్నటి మహానాడులో చంద్రబాబు అబద్ధాల డోసు అమాంతంగా పెంచారు. విడ్డూరం ఏమిటంటే, సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు మాట్లాడటం. సాధికారత, పారదర్శకతలను ప్రస్తావించడం. వ్యవసాయం గురించి వల్లించడం.

విద్య, వైద్య రంగాల గురించి నీతులు చెప్పడం. తాము సంక్షేమానికి ఏకంగా 51 శాతం నిధులు కేటాయించామనీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం 41 శాతమే నిధులు సమకూర్చిందనీ కాకిలెక్కలతో కనికట్టు చేసేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏ ప్రచారమూ అవసరం లేదు. గ్రామాల్లోకి వెళితే మార్పు కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ప్రజల అన్ని అవసరాలూ తీర్చే విధంగా గ్రామీణ వ్యవస్థ స్వరూపం సమూలంగా మారిపోతోంది. ఈ అభివృద్ధికి ప్రజలే బ్రాండ్‌ అంబాసిడర్లు.

సీఎంగా ఉన్న 14 ఏళ్లలో చంద్రబాబు సంక్షేమ పథకాలను విస్మ రించి, సామాజిక న్యాయాన్ని నట్టేట్లో ముంచి, పేదోడి సొంతింటి  కలను కల్లలు చేసి, వ్యవసాయం దండగని ప్రకటించేసి, విద్య, వైద్య రంగాలను భ్రష్టుపట్టించి మరీ కార్పొరేట్‌ దోపిడీకి బాటలు పరచి, జన్మభూమి కమిటీల పేరిట టీడీపీ తమ్ముళ్ల దోపిడీకి రాజముద్ర వేశా రని తెలుగు నాట చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అలాంటి చంద్ర బాబు మహానాడులో కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన మీద  నిస్సిగ్గుగా బురద జల్లేందుకు యత్నించి నవ్వుల పాలయ్యారు.  

సొంత ఇల్లు అన్నది పేదోడి కలే కాదు, ఆత్మగౌరవానికి ప్రతీక అనే వాస్తవాన్ని చంద్రబాబు తాను సీఎంగా ఉన్నన్నాళ్లూ గుర్తించ లేదు.  టిడ్కో కింద జీ+3 తరహాలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి పేదల నుంచి 300 చదరపు అడుగుల ఒక్కో ఇంటికి రూ. 2.65 లక్షల రుణాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించాలన్నారు. పేదలు వడ్డీతో సహా ఇంటి అప్పు తీర్చాలంటే 20 ఏళ్ల సమయం పడుతుందన్నది పట్టించు కోలేదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అవే టిడ్కో ఇళ్లను పేదలకు కేవలం ఒక్క రూపాయికే పూర్తి హక్కులతో ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కడుతోంది ఇళ్లు కాదు, ఏకంగా 17 వేల ఊళ్లు! పేదలం దరికీ ఇళ్ల పథకం కింద ఏకంగా 31 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. అమరావతిలో పేద లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అమరా వతిలో ‘సామాజిక సమతౌల్యం’ దెబ్బతింటుందని నిస్సిగ్గుగా టీడీపీ వాదించింది. పేదలు, దళితులు, బలహీనవర్గాలు అమరావతికి అవ తలే ఉండాలని చెబుతూ పెత్తందారీ పోకడలను ప్రదర్శించడం 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబుకే చెల్లింది. 

మహానాడు వేదిక మీద చంద్రబాబు నోటినుంచి జాలువారిన మరో రెండు పదాలు – సామాజిక న్యాయం, సాధికారత. సీఎం హోదాలో ఉండి కూడా ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని ప్రశ్నించి రాజ్యాంగ స్ఫూర్తినే అపహాస్యం చేయడం చంద్రబాబుకే చెల్లింది. నాయీ బ్రాహ్మణులను తూలనాడుతూ ‘తోక కత్తిరిస్తా’ అన్నా... మత్స్యకారులపై మండిపడుతూ ‘తోలు తీస్తా’ అని గెంటివేయించినా అది చంద్రబాబే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారు’ అని సీఎం హోదాలో ఏకంగా లేఖ రాయడం ద్వారా, తాను ఎంతటి బీసీ వ్యతిరేకో వెల్ల డించారు. ‘కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దంటుందా’ అని వివక్షాపూరితమైన వ్యాఖ్యలతో మహిళలను హేళన చేశారు. మహిళా తహశీల్దార్‌ వనజాక్షి జుట్టు పట్టుకుని దాడి చేసిన తమ పార్టీ ఎమ్మెల్యేకు కొమ్ముకాశారు. అటువంటి చంద్రబాబు సామాజిక న్యాయం, సాధికారత అంశాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం రాజకీయ వైచిత్రి కాక మరేమిటి!

వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక విప్లవాన్ని తీసుకు రావడమే కాదు... ఆ దిశగా దేశానికి దిశానిర్దేశం చేశారు. మంత్రి వర్గంలో ఏకంగా 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించడం దేశంలోనే రికార్డు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించారు. పెద్దల సభకు 50 శాతం మంది బీసీలను పంపిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు కనీసం 50 శాతం కేటాయించడమే కాదు.. నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో ఆ వర్గాలకు 50 శాతం రిజర్వ్‌ చేస్తూ చట్టం చేయడం ద్వారా చరిత్ర సృష్టించారు.

అనుభవజ్ఞుడిని అని ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నించే చంద్ర బాబు తాను సీఎంగా ఉన్నకాలంలో తీసుకువచ్చిన పరిపాలనా సంస్కరణ ఏమైనా ఉందా అని భూతద్దం పెట్టి వెతికినా ఒక్కటీ కనిపించదు. అందుకు భిన్నంగా వినూత్న సంస్కరణలతో పరిపాల నను ప్రజల గడప వద్దకు తీసుకువెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఆయనకు కంటగింపుగానే ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15,400 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు వలంటీర్‌ వ్యవస్థ ద్వారా మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని ప్రజల ముంగి టకు తీసుకువచ్చింది. ప్రభుత్వం అంటే ఎక్కడో రాజధానిలో బ్యూరోక్రాట్‌ వ్యవస్థ గుప్పిట్లో ఉంటుందన్న భ్రమలను తొలగిం చింది. ఇంతటి విప్లవాత్మక వ్యవస్థను ఎన్నో రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.

ప్రజల్ని మనుషులుగా కాకుండా ఓటర్లుగా చూడటం చంద్ర బాబు నైజం. తమకు ఓటు వేస్తేనే... ఇంటిపై టీడీపీ జెండా కడితేనే... ప్రభుత్వ పథకాలు అందిస్తామన్న దుర్నీతిని టీడీపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా పాటించింది. అందుకోసం ఏకంగా జన్మభూమి కమిటీలు అనే రాజ్యాంగేతర వ్యవస్థను ఏర్పాటు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇస్తేనే... దాంతో వారు సిఫార్సు చేస్తేనే ఏ ప్రభుత్వ పథకమైనా అందుతుంది. లేకుంటే అర్హులు అయినప్పటికీ జాబితాలో పేర్లు ఉండవు. అటువంటి చంద్రబాబు నుంచి పారదర్శకతను ఆశించడం నేతి బీరలో నెయ్యి కోసం వెతికిన చందంగానే ఉంటుంది. అందుకే  పారదర్శకంగా అర్హులు అందరికీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ఆయన సమ్మతిం చలేకపోతున్నారు.

పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శిస్తుండటం... అర్హులు ఎవరికైనా పథకాలు అందక పోతే వెంటనే సరిచేసి వారికి కూడా అందిస్తుండటమన్నది మింగుడు పడటం లేదు. అందుకే కిందపడ్డా తనదే పైచేయి అని నమ్మించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకత లేదంటూ అవాస్తవిక ఆరోప ణలతో ఎదురుదాడికి దిగారు. కానీ ప్రజలు వివేకవంతులు. చంద్ర బాబు కువిమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. ఎందుకంటే మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 100 శాతం పార దర్శకతతో... నేరుగా నగదు బదిలీ పథకాల(డీబీటీ) ద్వారా ఏకంగా రూ. 1.41 లక్షల కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేసింది. పరోక్ష నగదు బదిలీ(నాన్‌–డీబీటీ) పథకాల రూపంలో రూ. 43,682.65 కోట్లు ప్రయోజనం కలిగించింది.  మొత్తం మీద రాష్ట్రంలో అర్హులైన ‘9.58 కోట్లమంది’ లబ్ధిదారులకు రూ.1.41 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. చాలామంది లబ్ధిదారులు ఒకటి కంటే ఎక్కువ పథకాలకు అర్హులు కావడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో లబ్ధిదారుల కొనుగోలు శక్తి పెరిగింది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి.  

చంద్రబాబు ప్రభుత్వం చేసిన మరో దుర్మార్గం – విద్యా వ్యవస్థను పూర్తిగా కార్పొరేటీకరించడం. కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాసరే నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం. అటు వంటి చంద్రబాబు విద్యా రంగం గురించి మాట్లాడుతుండటం దయ్యాలు వేదాలు వల్లించడమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకువస్తోంది. నాడు–నేడు కార్యక్రమం కింద పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, ఫౌండేషన్‌ స్కూల్స్‌ (అంగన్‌వాడీ కేంద్రాలు), గురుకుల పాఠశాలలు కలిపి ఏకంగా 61వేల విద్యా సంస్థల రూపురేఖలను సమూలంగా మార్చి వేస్తోంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఈ మూడేళ్లలోనే కొత్తగా 6 లక్షల మందికి పైగా విద్యార్థులు చేరడం వైఎస్సార్‌సీపీ విధానానికి ప్రజలు తెలిపిన ఆమోదమే. తల్లులు తమ పిల్లల్ని బడులకు పంపేందుకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద రెండు దశల్లో రూ.13 వేల కోట్లు పంపిణీ చేశారు. మూడో దశ కింద రూ. 6,500 కోట్లు పంపిణీకి సిద్ధమవుతున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సంస్క రించి జగనన్న గోరుముద్ద పథకం కింద పౌష్టికాహారాన్ని అందిస్తు న్నారు. జగనన్న విద్యా కానుక కింద మూడు జతల యూనిఫాం, షూ, బెల్డ్, బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల కిట్‌ ఇస్తున్నారు.

100 శాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యా దీవెన పథకంతో పాటు హాస్టల్‌ విద్యార్థులకు ఏటా రూ. 20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన పథకాలు అందిస్తున్నారు. ఉపాధి అవకాశాలు కలిగించేలా డిగ్రీ, ఇంజినీరింగ్‌  కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టారు. ఆ విధా నాన్ని ఏకంగా యూజీసీ కూడా అనుసరించడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతకు నిదర్శనం. అన్నింటికంటే మించీ... పోటీ ప్రపంచంలో ప్రభుత్వ విద్యార్థులు నెగ్గుకు వచ్చేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం జగన్‌ ఘనత అయితే... దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో కేసులు వేయడం టీడీపీ దిగజారుడు రాజకీయాలను తేటతెల్లం చేస్తోంది. 

చంద్రబాబు వేటుకు నిర్వీర్యమైన మరో వ్యవస్థ ప్రభుత్వ వైద్య రంగం. ప్రభుత్వ వైద్య రంగం శిథిలాల మీద కార్పొరేట్‌ వైద్య సామ్రాజ్యాన్ని నిర్మించిన శిల్పి చంద్రబాబే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏనాడూ ఒక డాక్టర్‌ను నియమించడంగానీ, మౌలిక వసతులు సమకూర్చడంగానీ, తగినన్ని మందులు సరఫరా చేయడంగానీ చేయనే లేదన్నది చేదు నిజం. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లు వెచ్చిస్తూ ప్రభుత్వ వైద్య వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చివేస్తోంది. కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో వసతులు మెరుగుపరుస్తోంది. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు చేస్తుండటంతోపాటు... పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. గిరిజన ప్రాంతాల్లో అయిదు మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు ఇతర సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తోంది. 


ఏకంగా దండగ అని సూత్రీకరించి చంద్రబాబు పూర్తిగా విస్మరించిన రంగం వ్యవసాయం. వ్యవసాయ రుణాల మాఫీ అని నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత హామీని గాలికొదిలేసిన చరిత్ర ఆయన సొంతం. అటువంటి చంద్రబాబు ప్రస్తుతం రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం విడ్డూరం. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత, మద్దతు ధర లేక టీడీపీ ప్రభుత్వంలో అన్నదాత అన్ని విధాలుగా నష్టపోయారన్నది కఠోర సత్యం. అందుకు భిన్నంగా వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నిస్సిగ్గుగా చంద్రబాబు విమర్శలు చేస్తుండటం ఆయన రాజకీయ దిగజారుడుతనం కాక మరేమిటి? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తూ 10,778 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పింది. విత్తు నుంచి విపణి వరకు అన్నీ రైతులకు అందుబాటులోకి తెచ్చింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అన్నీ అందిస్తోంది. ఈ–పంట నమోదు చేస్తోంది. పంటలను కొనుగోలు చేస్తోంది. రైతు భరోసా కేంద్రాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుండటంతోపాటు అంతర్జాతీ యంగానూ ప్రశంసలు పొందుతూ అవార్డులు గెలుచుకుంటున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం  రైతులను, కంపెనీలను ఒకే వేదిక మీదకు తీసుకువస్తూ ఇ–ఫార్మ్‌ మార్కెట్‌ విధానాన్ని తెచ్చింది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ.13,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. మూడేళ్లలో 50.10 లక్షలమంది రైతు కుటుంబాలకు రూ.23,875 కోట్ల పెట్టుబడి సహాయం అందించింది. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏ మీడియా ప్రచారం అవసరం లేదు. గ్రామాల్లోకి వెళితే మార్పు ప్రజల కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ప్రజల అన్ని అవసరాలూ తీర్చే విధంగా గ్రామీణ వ్యవస్థ స్వరూపం సమూలంగా మారిపోతోంది. ఏ గ్రామానికి వెళ్లినా రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. గ్రామ సచివాలయంలో ఏకంగా 745 సేవలు అందుతున్నాయి. సకల వసతులతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి.

ఫౌండేషన్‌ స్కూల్స్‌గా రూపాం తరం చెందిన అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఆటపాటలతో విద్యను నేర్చుకుంటున్నారు. ఆ సమీపంలోనే వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ప్రజల ఆరోగ్య అవసరాలను తీరుస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది ప్రజలకు అందు బాటులో ఉంటూ వైద్యం చేస్తున్నారు. అక్కడే మందులు ఉచితంగా ఇస్తున్నారు. మండలానికి ఒక్కోటి చొప్పున 108, 104 వాహనాలతో పాటు వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రజలకు ముఖ్యమైన విద్య, వైద్య, వ్యవసాయ అవసరాలన్నీ గ్రామాల్లోనే తీరుతున్నాయి.

గ్రామీణ వ్యవస్థ సుభిక్షంగా ఉంది. పట్టణాల అవసరాలు తీరుస్తూ, పారిశ్రామిక రంగానికి ముడిసరుకు అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలుస్తోంది. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్ముని మాటను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తోంది. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలే బ్రాండ్‌ అంబాసిడర్లు. 
– వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement