సాక్షి ప్రతినిధి,గుంటూరు: ఇంతవరకూ అభ్యర్థి దొరకలేదు... భవిష్యత్తుకు మాత్రం మేం గ్యారెంటీ అంటున్న తెలుగుదేశం పార్టీ నేతలను చూసి నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర శనివారం తాడికొండ నియోజకవర్గంలో జరిగింది. ఆదివారం ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు మరో పది నెలల్లో ఉన్నా ఇప్పటికీ నియోజకవర్గంలో పోటీ చేసేది ఎవరో తేల్చుకోలేని పరిస్థితి ఉంది. నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకత్వం లేక బయట నుంచి నాయకులను ఎన్నికల వరకు అరువు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో టీడీపీ ఉంది.
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో, ఇప్పుడు ఆ పార్టీ చరిత్ర ‘గతం’గా మారిపోయింది. ప్రతి ఐదేళ్లకోసారి ఉన్నవారికి పొగబెడుతూ, కొత్త అభ్యర్థులను వెతుక్కుంటూ ఆ పార్టీ అధిష్టానం దిక్కులు చూడాల్సిన పరిస్థితి. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత నియోజకవర్గ సమన్వయకర్తగా చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన మాకినేని పెదరత్తయ్యకు బాధత్యలు కట్టబెట్టారు. ఎస్సీ నియోజకవర్గంలో ఓసీకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో పార్టీలోని కొందరు ఎస్సీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఎన్నికలకు మరో పది నెలల కాలం ఉండగా మాజీ ఐఏఎస్ అధికారి బి.రామాంజనేయులుకు ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచి అభ్యర్థులు ఓడిన వెంటనే నియోజకవర్గంలో ప్యాకప్ చెప్పేస్తున్నారు. అక్కడ చంద్రబాబునాయుడి సామాజికవర్గం నేతల పెత్తనం తట్టుకోలేక పక్క పార్టీల్లో చేరిపోతున్నారు.
► మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య వైఎస్సార్ సీపీలో చేరి మళ్లీ టీడీపీలోకి వెళ్లారు.
► టీడీపీ నుంచి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్న దళితనాయకుడు రావెల కిషోర్‌బాబుకు ఆ పార్టీలోని అగ్ర సామాజికవర్గం పొమ్మనకుండా పొగబెట్టారు. దీంతో ఆయన బీజేపీలోకి అక్కడి నుంచి బీఆర్‌ఎస్‌లోకి జంప్ అయ్యారు.
► 2019లో మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను ప్రత్తిపాడు నుంచి బరిలోనికి దింపారు. ఆయన కూడా ఓడిన తరువాత వైఎస్సార్ సీపీలో చేరారు. దీంతో నాలుగేళ్లుగా పార్టీకి నేత లేకుండా పోయారు. ఓడిన తరువాత పార్టీ మారిన వారిద్దరూ స్థానికేతరులే. తాజాగా ఇప్పుడు మరలా స్థానికేతరుడికే ఇన్‌చార్జిగా అధిష్టానం అవకాశం ఇస్తుందన్న వార్తలతో తెలుగు తమ్ముళ్లు నైరాశ్యంలో పడ్డారు.
విభేదాలతో తలబొప్పి..
పార్టీకి కంచుకోటగా ఉన్న వట్టిచెరుకూరు మండలంలో పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. మాజీ ఎంపీపీ పూనాటి రమేష్ ఒక వర్గం, టీడీపీ మండల అధ్యక్షుడు మన్నవ పూర్ణచంద్రరావుది మరో వర్గం. పూనాటి రమేష్ మాకినేని పెదరత్తయ్య నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగానే ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడంతో మన్నవ వర్గం అధినాయకత్వానికి ఫిర్యాదు చేసింది.
దీంతో పూనాటిని పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో పూనాటి వర్గం నాలుగైదు బస్సుల్లో వెళ్లి చంద్రబాబును కలిసినప్పటికీ ఫలితం లేకపోయింది. కానీ ఆయన పార్టీకి విధేయుడిగానే ఉంటూ పంటికింద రాయిలా మారారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర పేరుతో మళ్లీ పార్టీని సమాయత్తం చేసే ప్రయత్నం తెలుగుదేశం నుంచి కనపడుతోంది. అయితే తెలుగుతమ్ముళ్లు మాత్రం ఆసక్తి చూపకపోవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment