
నగరంపాలెం: వినాయక చవితి పండుగ సందర్భంగా ఈనెల 18న గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరగాల్సిన ‘స్పందన’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత
గుంటూరు మెడికల్: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ చూసుకోవాలని, ఈ బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు రీజియన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.నారాయణ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆదివారం గుంటూరు గాంధీపార్కు వద్ద, మార్కెట్‌సెంటర్‌లో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎనలిస్ట్ వెంకటేశ్వరరావు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.90 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 855.20 అడుగుల వద్ద ఉంది.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద ఆదివారం 2,212 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 76, బ్యాంక్ కెనాల్‌కు 532, తూర్పు కెనాల్‌కు 340, పశ్చిమ కెనాల్‌కు 130, నిజాంపట్నం కాలువకు 270, కొమ్మమూరు కాల్వకు 532 క్యూసెక్కులు విడుదల చేశారు.
