మేడికొండూరు : విషదళ సమీపంలోని ఎన్నారై కళాశాల వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మేడికొండూరు సీఐ నాగూర్ మీరా సాహెబ్ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు మేడికొండూరు మండల పరిధిలోని సరిపుడి గ్రామంలో గుడారాలు నిర్మించుకొని నివసిస్తున్నారు. రోజూ కూలి పనుల కోసం పొన్నూరు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం కూడా తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పేరేచర్ల గ్రామ శివారు దాటిన తర్వాత ఎన్నారై కళాశాల సమీపంలో అతివేగంగా అజాగ్రత్తగా వస్తున్న ప్రైవేట్ బస్సు కూలీల ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో త్కోసారిగా పల్టీ కొట్టి పక్కకు బోల్తా పడింది. ప్రమాదంలో తుపాకుల జయమ్మ, తుపాకుల సుబ్బారావు, మాణిక్యమ్మ, తుపాకుల లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు సిఐ నాగూర్ మీరా సాహెబ్ తెలిపారు.
కళాశాల బస్సును దొంగిలించి ఆటోను ఢీకొట్టాడు
వలస కూలీలను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన బస్సు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది ఎన్నారై కళాశాలకు చెందిన బస్సుగా తెలిసింది. ఈ బస్సును పేరేచర్ల జంక్షన్ వద్ద ఆపి డ్రైవర్ మందులు కొనుక్కుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి నడుపుకుంటూ తీసుకెళ్లిపోయాడు. దీంతో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మేడికొండూరు పోలీసులు పల్నాడు జిల్లా లిథం కళాశాల సమీపంలో బస్సును అదుపులోకి తీసుకొని దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేశారు. బస్సు దొంగిలించిన వ్యక్తి జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పొన్నవోలు నాగేశ్వరరావు అని గుర్తించారు. నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసు గంట వ్యవధిలోనే పోలీసులు ఛేధించారు.
నలుగురికి తీవ్ర గాయాలు
వలస కూలీల ఆటోను ఢీకొన్ని ప్రైవేటు బస్సు
వలస కూలీల ఆటోను ఢీకొన్ని ప్రైవేటు బస్సు