పెదకాకాని: స్నేహితులతో కలిసి గుంటూరు చానల్‌కు ఈత నేర్చుకునేందుకు వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించిన ఘటన తక్కెళ్ళపాడులో జరిగింది. గుంటూరుకు చెందిన షేక్ జానీ(18) మరో ముగ్గురు స్నేహితులు మేకా వంశీ, లోకేష్‌కుమార్, మహబూబ్‌లతో కలసి ఈత నేర్చుకునేందుకు పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడు సమీపంలో ప్రవహిస్తున్న గుంటూరు చానల్ వద్దకు చేరుకున్నాడు.
కృష్ణానది నుంచి ప్రారంభమైన గుంటూరు చానల్(కొత్తకాలువ) మండలంలోని నంబూరు, పెదకాకాని, తక్కెళ్ళపాడు, రామచంద్రపాలెం గ్రామాల గుండా ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం గుంటూరు చానల్‌లో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. తక్కెళ్ళపాడు గ్రామంలోకి వెళ్ళే సమీపంలో కాలువలోకి దిగి ఈత కొడుతుండగా ఈత పూర్తిగా రాని షేక్ జాని నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. అదే సమయంలో అక్కడ సుమారు 30 మంది యువకులు ఈత కొడుతున్నారు. జాని నీటిలో మునగడంతో స్నేహితులు కేకలు వేశారు. దీంతో కొందరు నీటిలో మునిగిపోయిన జానీని వెతికి ఒడ్డుకు చేర్చారు. ఘటనా స్థలంలోనే ప్రథమ చికిత్స అందిస్తుండగా జానీ మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
మృతుడు జానీకి తల్లి వహీదా, చెల్లెలు సానియా, తమ్ముడు సైఫ్‌అలీ ఉన్నారు. తండ్రి కొంతకాలంగా కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటున్నాడు. జానీ గుంటూరులోని వస్త్రదుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు జానీ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని అమ్మ చారిటబుల్ ట్రస్టు వారి వాహనంలో గుంటూరు మార్చురీకి తరలించారు. మృతుని తల్లి షేక్ వహీదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.పి.నారాయణస్వామి తెలిపారు.