చందోలు(పిట్టలవానిపాలెం) : చందోలులోని బగళాముఖి బండ్లమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అభయ ప్రదాయినిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
విద్యార్థులకు బెన్‘ఫిట్’
గుంటూరు ఎడ్యుకేషన్: తరగతి గదిలో నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థుల్లో శారీరక దారుఢ్యాన్ని పెంచి, మానసిక ఉల్లాసాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ‘‘ఫిట్ ఇండియా స్కూల్ వీక్’’ పేరుతో సోమవారం నుంచి వారోత్సవాలను నిర్వహించనుంది. క్రీడలతోపాటు యోగా, ధ్యానం, నైపుణ్యం, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, మేధో వికాసం పెంచే ఉద్దేశంతో సోమవారం నుంచి ఈనెల 25 వరకు ఆరు రోజుల పాటు వినూత్న కార్యక్రమాల నిర్వహణకు విద్యాశాఖ సమగ్ర షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఫిట్ ఇండియా స్కూల్ వారోత్సవాలను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ ఆదేశించారు. వారోత్సవాల నిర్వహణను పర్యవేక్షించాలని డీవైఈఓలు, ఎంఈఓలకు ఆదేశాలిచ్చారు.
విజయకీలాద్రిపై
శ్రవణా నక్షత్ర వేడుకలు
తాడేపల్లిరూరల్ : సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రవణా నక్షత్ర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చినజీయర్‌స్వామి మంగళా శాసనాలతో శ్రవణా నక్షత్రం సందర్భంగా వేంకటేశ్వరస్వామికి ఉదయం 9 గంటల నుంచి పంచామృతాలతో తిరుమంజనం నిర్వహించామని, 10 గంటలకు విజయాద్రి శ్రీనివాసునికి నిత్య కల్యాణ ఉత్సవం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని వెల్లడించారు.
బూందీ రూపంలో
వెండి సమర్పణ
మోపిదేవి(అవనిగడ్డ): స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి విజయవాడకు చెందిన భక్తులు కేశనం జగదీశ్వరావు దంపతులు కిలో వెండితో తయారు చేసిన బూందీ ఆకారంలో వస్తువు సమర్పించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న వీరు సుమారు రూ.76 వేలు విలువైన కిలో వెండి ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణకు అందించారు. దాతను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
22న జూడో
క్రీడాకారుల ఎంపిక
హనుమాన్‌జంక్షన్ రూరల్: జూడో క్రీడాకారుల సెలక్షన్స్ ఈ నెల 22వ తేదీన హనుమాన్‌జంక్షన్‌లో నిర్వహిస్తున్నామని ఉమ్మడి కృష్ణా జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు వర్రె అంజిబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయి గీతాంజలి హైస్కూల్ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి జూడో క్రీడాకారుల ఎంపిక ఉంటుందని చెప్పారు. సబ్ జూనియర్ విభాగంలో జిల్లా జట్టు ఎంపిక నిమిత్తం నిర్వహించే ఈ సెలక్షన్స్‌కు 2009 నుంచి 2011 మధ్య జన్మించిన బాల బాలికలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జూడో కోచ్‌లు, క్రీడాకారులు 9948656781 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment