
తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రాన్ని మంగళవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వి.శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. వారి రాకను పురస్కరించుకుని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు, ఆలయ పండితులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనివాస్ దంపతులు గోదాదేవిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం జస్టిస్ వి.శ్రీనివాస్ దంపతులను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు సత్కరించారు.
పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం స్టాట్యూ ప్రారంభోత్సవం సందర్భంగా లక్షలాదిగా విజయవాడ తరలి రావాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంగళవారం ఈ కార్యక్రమంలో తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు బోదాల శ్రీనివాసరావు, నలకుర్తి రమేష్ మాల మహానాడు అధ్యక్షుడు నత్తాయానారాజు తదితరులు పాల్గొన్నారు.
మహిళల విజయగాధలతో షీరోస్ పుస్తకావిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్ : భారతదేశంలో వివిధ రంగాల్లోని ప్రముఖ మహిళల విజయగాధలతో కూడిన షీరోస్ పుస్తకాన్ని శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఎన్. మంగాదేవి, వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ఆవిష్కరించారు. మంగళవారం గుంటూరు రూరల్ చేతన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఎన్నారై డాక్టర్ జాస్తి శివరామకృష్ణ ఆలోచనలతో మొదలైన షీరోస్ పుస్తకంలోని చిత్రాల రూపకల్పనను మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసిన బాబు దుండ్రపెల్లి పూర్తి చేశారు. ప్రపంచంలో ప్రసిద్ధులైన పురుషులను హీరోస్ అని పిలుచుకుంటుండగా, ప్రముఖ మహిళలు సాధించిన విజయాలతో కూడిన పుస్తకాన్ని తీసుకురావాలనే ఆలోచన నుంచి షీరోస్ రూపుదిద్దుకుంది. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 15 పాఠశాలలకు చెందిన 256 మంది బాలికలు షీరోస్‌గా సమాజంలో విభిన్న రంగాలకు చెందిన మహిళల వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుగు గిజుభాయ్‌గా ప్రసిద్ధులైన విద్యావేత్త డాక్టర్ సీఏ ప్రసాద్, బాలకుటీర్ సీఏవో దుర్గా రఘురామ్, వీవీఐటీ–వీవా డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, మరుద్వతి, జయశ్రీ పాల్గొన్నారు.
యార్డుకు 76,495 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 76,495 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 73,895 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.21,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 22,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం క్వింటాలుకు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.9,500 నుంచి 22,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.13,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 40,355 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్‌చార్జి కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు.


షీరోస్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంగాదేవి, విద్యాసాగర్ తదితరులు