
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సమేతంగా భోగి పండుగను జరుపుకున్న ప్రజలు సంక్రాంతి, కనుమలను రెట్టించిన ఉత్సాహంతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. పేద, బడుగు, బలహీనవర్గాల పెన్నిధిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరిపాలనలో తీసుకువచ్చిన గ్రామ స్వరాజ్యంతో పలెటూర్లు కళకళ లాడుతున్నాయని అన్నారు. సంక్షేమ పాలనలో రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు.
ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
పట్నంబజారు: ప్రతి కుటుంబంలో సంక్రాంతి కాంతులు విరబూయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కామాణిక్య వరప్రసాద్ కోరారు. సంక్రాంతి పురస్కరించుకుని జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలని కోరారు. ప్రతి ఇంట సంక్షేమ సంబరాలు వెల్లివిరియాలని, అభివృద్ధితో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
రోడ్డు ప్రమాదంలో కంటైనర్ డ్రైవరు మృతి
మృతుడు ఉత్తరప్రదేశ్ వాసిగా గుర్తింపు
రొంపిచర్ల: మండలంలోని అన్నవరప్పాడు గ్రామ సమీపంలో అద్దంకి–నార్కెట్‌పల్లి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్ది ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చైన్నె నుంచి హైదరాబాద్‌కు పాత ఇనుము లోడుతో వెళ్తున్న లారీ, హైదరాబాద్ నుంచి చైన్నెకు వెళ్తున్న కంటైనరు అన్నవరప్పాడు సమీపంలోకి రాగానే ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంటైనర్ డ్రైవర్ పునీత్ కుమార్(24) మృతి చెందాడు. ప్రమాదంలో రెండు వాహనాలు ఢీకొనడంతో కంటైనర్ డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకొని మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ కేపీ.రవీంద్ర సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన పునీత్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.
బావిలో పడి ఆర్టీసీ మెకానిక్ మృతి
నాదెండ్ల: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెంది 18 రోజులు గడవకముందే కుమారుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అంబేడ్కర్ కాలనీకి చెందిన కంభంపాటి కోటేశ్వరరావు గత నెల 27వ తేదీన మార్కెట్ యార్డులో కూరగాయలు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా, కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విషాదం అలుముకున్న ఇంటిలోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఈయన పెద్ద కుమారుడైన కంభంపాటి వెంకటరావు (45) చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పని చేస్తూ సోదరుడు రాంబాబుతో కలిసి గ్రామంలో కొంత పొలాన్ని సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు ఇరువురూ వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భోజనం తెచ్చేందుకు రాంబాబు ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో వెంకటరావు ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. భోజనం తీసుకుని పొలానికి వచ్చిన రాంబాబు తన సోదరుడి కోసం వెతకగా బావిలో శవమై కనిపించాడు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని భార్య గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కారంచేడులోప్రముఖుల సందడి
కారంచేడు: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కారంచేడులో గ్రామానికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబ సభ్యులతో సందడి చేశారు. శనివారం రాత్రికే గ్రామానికి చేరుకున్న సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు, లక్ష్మి, వెంకటేష్, నీరజ, హీరో రానా, మిహికా బజాజ్, సినీ హీరో అభిరామ్, భార్య ప్రత్యూష దంపతులు, సురేష్‌బాబు కుమార్తె మాళవిక, రామానాయుడు సతీమణి రాజేశ్వరి గ్రామంలోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరాధ్యదైవం అయిన కట్టమల్లేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, పిల్లలతో గ్రామంలో భోగి పండుగ నిర్వహించారు. సీనీ హీరోలైన రానా, అభిరామ్‌లతో గ్రామస్తులు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.

